జంక్‌ మెయిళ్లకు కళ్లెమిలా..

ఏదో ఖాతాకు సైనిన్‌ అవుతాం. ఆన్‌లైన్‌లో ఏదో కొంటాం. ఇలాంటి పనుల కోసం ఈమెయిల్‌ చిరునామాను వాడటం పరిపాటే.

Published : 05 Jul 2023 00:36 IST

ఏదో ఖాతాకు సైనిన్‌ అవుతాం. ఆన్‌లైన్‌లో ఏదో కొంటాం. ఇలాంటి పనుల కోసం ఈమెయిల్‌ చిరునామాను వాడటం పరిపాటే. అంతవరకు బాగానే ఉంటుంది గానీ తర్వాతే జంక్‌ మెయిళ్ల సమస్య మొదలవుతుంది. ఇక్కడే బర్నర్‌ ఈమెయిల్‌ ఆదుకుంటుంది. ఒక్కసారే ఈమెయిల్‌ అవసరమైనప్పుడు ప్రైమరీ ఈమెయిల్‌కు బదులు వీటిని వాడుకోవచ్చు. అలాంటి కొన్ని బర్నర్‌ మెయిళ్లు ఇవీ..

టెంప్‌ మెయిల్‌

ఇది తాత్కాలిక, అజ్ఞాత ఈమెయిల్‌ చిరునామాను అందిస్తుంది. ఉచిత వర్షన్‌ ఖాతాల వంటి వాటి నమోదుకు వాడుకోవచ్చు. దీంతో ఈమెయిల్‌ పంపలేం గానీ బర్నర్‌ ఖాతా ప్రయోజనాలు పొందొచ్చు. ఈమెయిళ్లు రెండు గంటల వరకు స్టోర్‌ అవుతాయి. అనంతరం వాటంతటవే డిలీట్‌ అవుతాయి. బ్రౌజర్‌ ద్వారా https://temp-mail.org/en/  లోకి వెళ్లి బర్నర్‌ ఈమెయిల్‌ సేవలు పొందొచ్చు. ఐఓఎస్‌, ఆండ్రాయిడ్‌ పరికరాలకు యాప్‌ కూడా అందుబాటులో ఉంటుంది. చందా చెల్లించి ప్రీమియం సేవలూ పొందొచ్చు. అప్పుడు ఒకేసారి 10 చిరునామాలు పొందొచ్చు. ఇన్‌బాక్స్‌ను పూర్తిస్థాయిలో వాడుకోవచ్చు. స్టోరేజీనీ పెంచుకోవచ్చు.

ఈమెయిల్‌వన్‌డెక్‌

కేవలం రెండంచెలతోనే ఈమెయిల్‌వన్‌డెక్‌ను సెటప్‌ చేసుకోవచ్చు. మనుషులమేనని ధ్రువీకరించుకొని, బర్నర్‌ ఈమెయిల్‌ చిరునామాను పొందితే సరి. ఇది ఉచితమే. మెసేజ్‌ను కంపోజ్‌ చేయొచ్చు, అవతలివారి నుంచి సమాధానమూ అందుకోవచ్చు. వచ్చే మెసేజ్‌లు రోజులో చాలాసేపటి వరకు స్టోర్‌ అవుతాయి. ఈమెయిల్‌వన్‌డెక్‌ తరచూ మెయిల్‌ లాగ్స్‌ను తొలగించేస్తుంది. ఇలా ముఖ్యమైన సందేశం కోసం ఎదురుచూస్తున్నప్పుడు మేలు చేస్తుంది. బిట్‌కాయిన్‌, ఎథిరమ్‌ క్రిప్టోకరెన్సీల రూపంలో ప్రీమియం సేవలకు అప్‌డేట్‌ చేసుకునే సదుపాయమూ ఉంది. దీంతో అజ్ఞాత ఈమెయిళ్లు పంపొచ్చు. ఇష్టమైన విధంగా ఈమెయిల్‌ ఐడీలను సృష్టించుకోవటం, ఈమెయిల్‌ అడ్రస్‌లను సేవ్‌ చేసుకోవటం వంటివన్నీ చేయొచ్చు.

గెరిల్లా మెయిల్‌

ఇది మన బ్రౌజర్‌లోనే ఉచిత డిస్పోజబుల్‌ ఈమెయిల్‌కు అవకాశం కల్పిస్తుంది. ఐడీని ఎంచుకొని, మెసేజ్‌ కంపోజ్‌ చేయటమే తరువాయి. ఈమెయిల్‌కు అందే ధ్రువీకరణ లింక్‌ను క్లిక్‌ చేసి, తర్వాత డిలీట్‌ చేసేయొచ్చు. స్పామ్‌ మెయిళ్లు మన ఇన్‌బాక్స్‌లోకి చేరకుండా గెరిల్లా మెయిల్‌ వాటిని ముందే తొలగించేస్తుంది. అందిన మెయిల్‌ను చెక్‌ చేసేంతవరకు ఇది క్వారంటైన్‌లో అలాగే ఉంటుంది. గంట తర్వాత క్వారంటైన్‌, ఇన్‌బాక్స్‌ నుంచి మెయిళ్లు అదృశ్యమవుతాయి.

10మినిట్‌మెయిల్‌

ఉచిత వ్యక్తిగత ఈమెయిల్‌ చిరునామాకు ఇది చక్కటి సాధనం. ఈమెయిళ్లు పంపటానికి దీన్ని వాడుకోవచ్చు. పేరుకు తగ్గట్టుగానే ఇది 10 నిమిషాల్లోనే ఈమెయిల్‌ను, అడ్రస్‌ను డిలీట్‌ చేసేస్తుంది. ఏదైనా ఖాతాకు ఈమెయిల్‌ చిరునామాను ధ్రువీకరించుకోవాల్సి వస్తే దీన్ని వాడుకోవచ్చు.https://10minutemail.com/ ఇన్‌బాక్సులోకి వెళ్లి, లింక్‌ను క్లిక్‌ చేస్తే సరి. కావాలనుకుంటే ఆ మెయిల్‌కు సమాధానమూ పంపొచ్చు. ఏదైనా ముఖ్యమైన మెయిల్‌ అయితే దాన్ని వేరే ఈమెయిల్‌ అడ్రస్‌కు ఫార్వర్డ్‌ చేయొచ్చు కూడా. ఒకవేళ సమయంలోపు ఈమెయిల్‌ అందకపోతే ‘గివ్‌ మీ 10 మోర్‌ మినట్స్‌’ బటన్‌ను క్లిక్‌ చేస్తే కౌంట్‌డౌన్‌ టైమర్‌ రీసెట్‌ అవుతుంది. 10మినట్‌మెయిల్‌.కామ్‌ లోకి వెళ్లి తాత్కాలిక ఈమెయిల్‌ పొందొచ్చు. దీనికి వ్యక్తిగత వివరాలు ఇవ్వాల్సిన అవసరమూ లేదు.

యాపిల్‌ హైడ్‌ మై ఈమెయిల్‌

యాపిల్‌ పరికరాలు వాడేవారికి హైడ్‌ మై ఈమెయిల్‌ ఫీచర్‌ ఎంతో ఉపయుక్తం. ఇది ప్రత్యేక, రాండమ్‌ ఈమెయిల్‌ చిరునామాలను సృష్టించి, ఇన్‌బాక్స్‌లోకి ఫార్వర్డ్‌ చేస్తుంది. ఎన్ని ఐడీలు అవసరమైతే అన్నింటినీ ఏర్పాటు చేసుకోవచ్చు. మెసేజ్‌లకు జవాబు ఇవ్వచ్చు. ఐక్లౌడ్‌కు సైన్‌ఇన్‌ అయితే చాలు. దీని ద్వారా ఈమెయిల్‌ను క్రియేట్‌ చేసుకోవటానికి సెటింగ్స్‌లోకి వెళ్లి, యాపిల్‌ ఐడీ మీద నొక్కాలి. ఐక్లౌడ్‌లోకి వెళ్లి, హైడ్‌ మై ఈమెయిల్‌ ద్వారా క్రియేట్‌ న్యూ అడ్రస్‌ను ఎంచుకోవాలి. తెర మీద కనిపించే సూచనల ప్రకారం కొత్త ఈమెయిల్‌ ఐడీని సృష్టించుకోవచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని