సైన్స్‌ సంగతులు..

దేనికైనా నకిలీలు పుట్టుకొస్తున్న రోజులివి. కరెన్సీ నోట్ల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దొంగ నోట్లను ముద్రించడం.. ఎంతో తెలివిగా వాటిని చలామణిలోకి తీసుకురావడం.. వాటిని గుర్తించడం చూస్తూనే ఉంటాం. అందుకే ఎవరైనా

Updated : 25 Feb 2021 12:14 IST

కొత్తరకం సిరాతో నకిలీలకు చెక్‌!

దేనికైనా నకిలీలు పుట్టుకొస్తున్న రోజులివి. కరెన్సీ నోట్ల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దొంగ నోట్లను ముద్రించడం.. ఎంతో తెలివిగా వాటిని చలామణిలోకి తీసుకురావడం.. వాటిని గుర్తించడం చూస్తూనే ఉంటాం. అందుకే ఎవరైనా కొత్త నోటు తీసి ఇవ్వగానే అనుమానంతో ఒకటికి రెండు సార్లు చెక్‌ చేస్తాం. ఇంకా ఎన్నేళ్లిలా దొంగనోట్ల విషయంలో జాగ్రత్త పడాలి? నకిలీ నోట్లు తయారు చేయకుండా చేయలేమా? అనే సందేహం వచ్చే ఉంటుంది. మన భారతీయ శాస్త్ర, సాంకేతిక పరిశోధనా మండలి శాస్త్రవేత్తలు అందుకో ఉపాయాన్ని కనుగొన్నారు. అదేంటంటే.. కొత్తరకం సిరా. ఆ ఇంకుతో కరెన్సీ నోట్లను ముద్రించేందుకు వాడొచ్చని ప్రతిపాదించారు. ప్రతిదీప్తి, చీకట్లో ప్రకాశించే ప్రక్రియల ఆధారంగా సిరాని తయారు చేశారు. ఇంకుని వాడడం కారణంగా తేజోవంతమైన కాంతితో రెట్టింపు ఉద్గారంతో నోట్లు తయారవుతాయి. వెలుతురుని బట్టి ఇవి రంగు మారుతుంటాయి. ప్రింట్‌ అయిన నోటుని వెలుతురులో చూస్తే ఒకలా.. అతినీలలోహితకాంతితో చూస్తే మరోలా కనిపించడం వీటి ప్రత్యేకత. అంటే.. వెలుతురులో తెల్లగా కనిపిస్తే.. యూవీలైట్‌తో ఎరుపు రంగులోనూ కనిపిస్తుంది. దొంగ నోట్లలో ఇలాంటి మార్పు ఉండదు. దీంతో నకిలీ కరెన్సీ నోట్లను తయారు చేయడం అసాధ్యమే. ఒక్క నోట్ల విషయంలోనే కాదు. ఈ కొత్త రకం సిరాతో పాస్‌పోర్టులనూ తయారు చేయొచ్చు. అప్పుడు దొంగ పాస్‌పోర్టులతో ప్రయాణాలు చేసే వారికీ బ్రేక్‌ పడుతుంది.


పాల నాణ్యత చెప్పే కాగితం..

పాల స్వచ్ఛతను తెలిపేందుకు ఎన్నో పరికాలు ఉన్నాయి. కానీ,  మనం ఇంట్లో వాడేందుకు తగినవి ఏమున్నాయ్‌. ఆలోచనలో పడ్డారా? చాలా సింపుల్‌గా పాల నాణ్యతను తెలుసుకునేందుకు మన శాస్త్రవేత్తలు కాగితపు సెన్సర్‌ కిట్‌ని వాడొచ్చని చెబుతున్నారు. ఒక చుక్క పాలను కాగితం ముక్కపై వేస్తే చాలు. పాలను పాశ్చరైజేషన్‌ చేసిందీ.. లేనిదీ తేల్చొచ్చు. సాధారణంగా ‘ఏఎల్‌పీ’ అనే పాల ఎంజైమ్‌ పాల నాణ్యతను తెలియజేసే ఒక సూచిక. పాలు పాశ్చరైట్‌ అయిన తర్వాత కూడా సూక్ష్మజీవుల ఉనికిని, వాటి చురుకుదనాన్ని ఏఎల్‌పీ సూచిస్తుంది. దీని శాతం పాలల్లో ఎంత ఉందో తెలుసుకునేందుకు సాధారణ ఫిల్టర్‌ కాగితాన్ని ఉపయోగించారు. దానిలోకి కొన్ని రసాయన శోధకాల్ని చొప్పించారు. ఆ శోధకాలతో ఏఎల్‌పీ కలిసిందంటే చాలు. కాగితం రంగు మారిపోతుంది. ఇలా మారిన కాగితాన్ని స్మార్ట్‌ఫోన్‌ కెమెరాతో ఫొటో తీసి, మార్పు చెందిన రంగుని ప్రాసెస్‌ చేసి ఫలితాన్ని పొందొచ్చు. అందుకు ప్రత్యేక యాప్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. చాలా తక్కువ సమయంలోనే సులభమైన పద్ధతిలో పాల నాణ్యతను తెలుసుకునేందుకు ఇదో స్మార్ట్‌ మార్గమే!

- డాక్టర్‌ సి.వి.సర్వేశ్వర శర్మ ప్రెసిడెంట్‌, కోనసీమ సైన్స్‌ పరిషత్‌

Read latest Technology News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని