విశాల విశ్వంలో వలయ రహస్యం!

అనంత విశ్వంలో పాలపుంతలు.. వాటిలో జరిగే వింతలు.. భూమిపై నుంచి చూసే శాస్త్రవేత్తలకూ.. ఆ విశ్వం ఊసులు వింటున్న సామాన్య మానవులకూ ఊహకు అందని అద్భుతాలే. కొన్ని శతాబ్దాలుగా గెలాక్సీల అంతు తేల్చడానికి  మనిషి మూడో కన్నులాంటి టెలిస్కోపుతో విశ్వాన్ని వీక్షిస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలో ఎప్పటి నుంచో అంతు చిక్కని రహస్యంగా మిలిగిపోయింది గెలాక్సీల్లో కమ్ముకుని ఉన్న ‘హైడ్రోజన్‌ గ్యాస్‌’. పాలపుంతల కంటే ఎక్కువ పరిమాణంతో.....

Updated : 25 Feb 2021 12:13 IST

సైన్స్‌ సంగతులు

అనంత విశ్వంలో పాలపుంతలు.. వాటిలో జరిగే వింతలు.. భూమిపై నుంచి చూసే శాస్త్రవేత్తలకూ.. ఆ విశ్వం ఊసులు వింటున్న సామాన్య మానవులకూ ఊహకు అందని అద్భుతాలే. కొన్ని శతాబ్దాలుగా గెలాక్సీల అంతు తేల్చడానికి  మనిషి మూడో కన్నులాంటి టెలిస్కోపుతో విశ్వాన్ని వీక్షిస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలో ఎప్పటి నుంచో అంతు చిక్కని రహస్యంగా మిలిగిపోయింది గెలాక్సీల్లో కమ్ముకుని ఉన్న ‘హైడ్రోజన్‌ గ్యాస్‌’. పాలపుంతల కంటే ఎక్కువ పరిమాణంతో వలయాల్లా కనిపిస్తూ విశ్వ రహస్యాల్ని నిక్షిప్తం చేసుకున్నాయేమో అనిపించేంతలా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి..

డైనోసార్ల కాలం నాటివట!

విశ్వంలోని గ్రహాలు, తారలతో పోలిస్తే భూగోళం సముద్రంలోని చిన్న నీటి బిందువులా అనిపిస్తుంది. కానీ, సకల చరాచర జీవులకు ఆధార గ్రహం. అందుకేనేమో ఇంత ప్రత్యేకత సంతరించుకుంది. ఇలాంటిది  మరెక్కడైనా ఉందా? అసలు ఈ విశ్వంలో దాగున్న రహస్యాలేంటి? అనే విషయంపై శతాబ్దాల తరబడి మనిషి నిరంతరం అన్వేషిస్తూనే ఉన్నాడు. దీంట్లో భాగంగానే పుణెలోని ఖగోళ శాస్త్రవేత్తలు సుదూర గెలాక్సీ చుట్టూ ఏర్పడి ఉన్న హైడ్రోజన్‌ వాయువు వలయాలు చూశారు. వీటిని జెయింట్‌ మీటర్‌వేవ్‌ టెలిస్కోపుతో చూసినపుడు గుర్తించగలిగారు. ఈ వలయాలు అవి ఏర్పడిన గెలాక్సీ పరిమాణం కన్నా చాలా పెద్దగా ఉన్నాయి. వీటి వ్యాసం మన పాలపుంత పరిమాణం కన్నా నాలుగు రెట్లు ఎక్కువ. ఇవి భూమికి 260 మిలియన్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నాయి. ఈ గెలాక్సీని ‘ఏజీసీ 203001’ అని పిలుస్తున్నారు. హైడ్రోజన్‌ వలయాలు ఏర్పడి ఉన్న కారణంగా ఈ గెలాక్సీ మిగిలిన వాటికి భిన్నంగా ఉన్నట్లు విశ్లేషించారు. అవి ఏర్పడినప్పుడు గెలాక్సీ విడుదల చేసిన కాంతిని బట్టి శాస్త్రవేత్తలు ఈ వలయాల ఉనికిని తెలుసుకోగలిగారు. అయితే, శాస్త్రవేత్తలు చూసిన కాంతి ఇప్పటిది కాదట. భూమి మీద విశేషంగా డైనోసార్లు, నేల మీద పాకే జంతువులు మసలిన కాలం నాటిదని తేల్చారు. అప్పుడు ప్రసరించిన కాంతి ఇప్పటికి భూమిని చేరి ఉండొచ్చని భావిస్తున్నారు.

నక్షత్రరహితంగా..

సాధారణంగా హైడ్రోజన్‌ వాయువు ఘనీభవించి నక్షత్రాలు ఏర్పడతాయి. విచిత్రం ఏంటంటే.. ఈ హైడ్రోజన్‌ వాయువు వలయాలు ఉన్న ప్రాంతంలో ఎటువంటి నక్షత్రాలు ఏర్పడలేదు. అంతులేని పరిమాణంలో ఉన్న హైడ్రోజన్‌ వాయువు ఉన్న ప్రదేశంలో నక్షత్రాలు ఏర్పడకపోవడం గత సిద్ధాంతాలకు సవాల్‌గా తయారయ్యింది. ఈ వలయాల రహస్యం ఇంకా అంతుచిక్కని రహస్యంగానే ఉంది. ఈ వలయాలను మరింత క్షుణ్ణంగా అధ్యయనం చేయడం కోసం హవాయ్‌లో నెలకొల్పబడిన కెనడా-ఫ్రాన్స్‌-హవాయ్‌ టెలిస్కోపు సహాయంతో ఈ వ్యవస్థకి సంబంధించిన నాణ్యమైన ప్రతిబింబాలను పొందగలిగారు. మరో తొమ్మిది గెలాక్సీల చుట్టూ ఇలాంటి వలయాలు ఏర్పడి ఉన్నట్టుగా గమనించారు. వీటిని పరిశీలించగా శాస్త్రవేత్తల ముందు ఉన్న ఎన్నో జవాబు దొరకని ప్రశ్నలు ప్రత్యక్షమయ్యాయి. వాటిల్లో నక్షత్రాలు ఏర్పడకుండా ఇంత భారీ పరిమాణంలో హైడ్రోజన్‌ వలయాలు ఎలా ఏర్పడ్డాయనేది అంతుచిక్కని రహస్యంగా మారింది. వాటిని అధ్యయనం చేయడం ఇప్పుడు ఖగోళ శాస్త్రవేత్తలకు ఓ సవాల్‌ అనొచ్చు.

ఒకదానితో మరొకటి ఢీకొని ఉండొచ్చు..

హైడ్రోజన్‌ వాయువు రహస్యాల్ని ఛేదించే క్రమంలో.. రెండు గెలాక్సీలు ఒక దానితో మరొకటి ఢీకొని ఈ హైడ్రోజన్‌ వాయువును గెలాక్సీ వెలుపలకు నెట్టి ఉండొచ్చు అని.. లేదంటే.. ఒక గెలాక్సీ సమీపంలో మరొక గెలాక్సీ వెళుతూ ఇలా చేసి ఉండవచ్చని మరికొందరు శాస్త్రవేత్తలు చెబుతున్న మాట. ఈ ఆలోచనలు ప్రస్తుత పరిస్థితిని వివరించలేవంటున్నారు పలువురు. 1987లోనే ఇటువంటి గెలాక్సీని గుర్తించామంటున్నారు ఇంకొందరు శాస్త్రవేత్తలు. ఆసక్తికరమైన ఈ పరిణామం ఖగోళ శాస్త్రవేత్తలలో సరికొత్త అన్వేషణకై ఉత్సాహాన్ని నింపింది. దీంతో ఆయా గెలాక్సీల పటాన్ని తయారు చేసే ప్రయత్నంలో ఉన్నారు. తప్పని సరిగా తమ పరిశోధనలు విజయవంతమై విశ్వంలో దాగున్న సరికొత్త విషయాలు తెలుసుకోగలమని చెబుతున్నారు ప్రపంచ ఖగోళ శాస్త్రవేత్తలు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని