కాలనీ ముద్రణ!

నిర్మాణ రంగంలో 3డీ ప్రింటింగ్‌ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతోంది. దీంతో ఇళ్లనూ ముద్రిస్తున్నారు. వీటి గురించి తరచూ వింటూనే ఉన్నాం. మరి ఏకంగా ఒక కాలనీయే ముద్రితమైతే? అసాధారణ విషయమే కదా.

Published : 10 Nov 2021 00:58 IST

నిర్మాణ రంగంలో 3డీ ప్రింటింగ్‌ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతోంది. దీంతో ఇళ్లనూ ముద్రిస్తున్నారు. వీటి గురించి తరచూ వింటూనే ఉన్నాం. మరి ఏకంగా ఒక కాలనీయే ముద్రితమైతే? అసాధారణ విషయమే కదా.

కటి కాదు, రెండు కాదు. ఏకంగా వంద ఇళ్లు. ఒకోటీ 3,000 చదరపు అడుగులు ఉంటుంది. అన్నీ 3డీ ప్రింటింగ్‌ పద్ధతిలో ముద్రితమయ్యేవే. ప్రతి ఇంటి కప్పు మీదా సోలార్‌ ఫలకాలు. ఇలాంటి అద్భుత గృహ సముదాయానికి అమెరికాలోని టెక్సాస్‌ రాజధాని ఆస్టిన్‌ వేదిక కానుంది. అన్నీ సవ్యంగా పూర్తయితే ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి 3డీ కాలనీగా రికార్డులకు ఎక్కనుంది. ఒకో ఇంటిని ముద్రించటానికి వారం పడుతుందని భావిస్తున్నారు. ఇందుకోసం ‘వల్కన్‌’ నిర్మాణ వ్యవస్థను వినియోగించుకోనున్నారు. 46 అడుగుల వెడల్పుండే ఇది రోబో యంత్రాల సాయంతో పనిచేస్తుంది. లావాక్రీట్‌ అనే ప్రత్యేక కాంక్రీటు మిశ్రమాన్ని పొరలు పొరలుగా పరచుకుంటూ ఇళ్లను పూర్తిచేస్తుంది. ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో 3డీ ముద్రిత నిర్మాణాలు చేపడుతున్నారు. తక్కువ కాలంలో, తక్కువ ఖర్చుతో పూర్తి అవుతుండటం వల్ల రోజురోజుకీ ఇవి ఆదరణ పొందుతున్నాయి. వీటికి ఉదాహరణలు ఇవీ..

పర్యావరణానికి హాని చేయకుండా మట్టి సాయంతో 3డీ పద్ధతిలో ఇళ్లు ముద్రించొచ్చని ఇటలీ సంస్థ ఒకటి ప్రయోగాత్మకంగా నిరూపించింది. టెక్నాలజీ, క్లే పదాలను కలిపి ఈ ఇంటికి ‘టెక్లా’ అని పేరు పెట్టారు. సమీపంలోని నదీ తీరం నుంచి సేకరించిన మట్టితోనే దీన్ని ముద్రించటం విశేషం. చూడటానికి దీని కప్పు రెండు గుమ్మటాలు కలిసి ఉన్నట్టుగా ఉంటుంది. సుమారు 60 చదరపు మీటర్ల వైశాల్యంతో కూడిన దీని ఎత్తు 4.2 మీటర్లు. దీనికి కిటికీలు లేవు గానీ కప్పు మధ్యలో గుండ్రంగా రంధ్రం ఉంటుంది. దీంతో గాలి బాగా ఆడుతుంది. రోజంతా వెలుతురు పడుతుంది. మట్టిని వాడటం వల్ల లోపల చల్లగానూ ఉంటుంది. రెండు చేతులు గల రోబో ప్రింటింగు యంత్రం సాయంతో దీన్ని ముద్రించారు. ఈ విధానం ద్వారా 200 గంటల్లో, 6 కిలోవాట్ల విద్యుత్తుతోనే ఇంటిని ముద్రించొచ్చు. నిర్మాణ వ్యర్థాలు దాదాపు ఉండవనే అనుకోవచ్చు. ఇందులో కొంత ఫర్నిచర్‌నూ 3డీలోనే ముద్రించటం గమనార్హం.

నెదర్లాండ్స్‌లో ఇటీవల 3డీ ముద్రిత ఇంటిలో నివసించటమూ మొదలైంది. సుమారు 94 చదరపు మీటర్ల వైశాల్యంలో హాలు, రెండు పడక గదులు ఉండేలా దీన్ని ముద్రించారు. చూడ్డానికి పైకి పెద్ద రాయి మాదిరిగా కనిపిస్తుంది. దీన్ని ఫ్యాక్టరీలో ముద్రించి, అనంతరం ట్రక్కులో తరలించటం విశేషం. తర్వాత పునాది మీద ఇంటిని స్థిరంగా అమర్చారు. కాంక్రీటు మిశ్రమాన్ని అవసరమైన చోట మాత్రమే పొరలు పొరలుగా పరచటం, పునాది మీద ఎక్కువ భారం పడకుండా ఉండటం, వ్యర్థాలేవీ ఏర్పడకుండా చూడటం ద్వారా ఇలాంటి 3డీ ముద్రిత ఇళ్లు పర్యావరణానికి ఎంతగానో మేలు చేస్తాయని నిపుణులు భావిస్తున్నారు.

మనదేశంలోనూ ఐఐటీ మద్రాస్‌కు చెందిన అంకుర సంస్థ ఇటీవల 3డీ ముద్రిత ఇంటిని నిర్మించింది. సుమారు 600 చదరపు అడుగుల వైశాల్యం గల ఇందులో హాలు, పడక గది, వంటిల్లు ఉన్నాయి. ‘కాంక్రీట్‌ 3డీ ప్రింటింగ్‌ టెక్నాలజీ’తో ఐదు గంటల్లోనే దీన్ని పూర్తి చేశారు. ఖర్చు కూడా 30% తగ్గింది. ఇది 50 ఏళ్ల వరకు దృఢంగా ఉండగలదని భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని