డీఎన్‌ఏ ప్లాస్టిక్‌!

జన్యు పదార్థంతో (డీఎన్‌ఏ) ప్లాస్టిక్‌! మీరు చదివింది నిజమే. ఇదో కొత్తరకం ప్లాస్టిక్‌. పర్యావరణానికి ఎలాంటి హాని చేయదు. దీన్ని తయారు చేయటానికి పెద్దగా ఇంధనమూ అవసరం లేదు. తేలికగా ముక్కలు చేసి, ఇతర వస్తువులుగా మార్చుకోవచ్చు.

Updated : 24 Nov 2021 01:12 IST

న్యు పదార్థంతో (డీఎన్‌ఏ) ప్లాస్టిక్‌! మీరు చదివింది నిజమే. ఇదో కొత్తరకం ప్లాస్టిక్‌. పర్యావరణానికి ఎలాంటి హాని చేయదు. దీన్ని తయారు చేయటానికి పెద్దగా ఇంధనమూ అవసరం లేదు. తేలికగా ముక్కలు చేసి, ఇతర వస్తువులుగా మార్చుకోవచ్చు. పునర్వినియోగానికి సాధ్యం కాని పెట్రో రసాయనాలతో తయారయ్యే సంప్రదాయ ప్లాస్టిక్స్‌ పర్యావరణానికి హాని చేస్తాయి. వీటిని తయారుచేయటానికి ఎక్కువ ఉష్ణోగ్రత, విషతుల్య రసాయనాలు కావాలి. ఇవి క్షీణించటానికి వందలాది ఏళ్లు పడుతుంది. అందుకే ప్రత్యామ్నాయ ప్లాస్టిక్‌ కోసం చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. మొక్కజొన్న పిండి, నాచు వంటి వాటితో తయారయ్యే ప్లాస్టిక్‌లకు ఇటీవలి కాలంలో ప్రాచుర్యం పెరుగుతోంది. ఇవి త్వరగానే క్షీణిస్తాయి. పునర్వియోగించుకోవచ్చు కూడా. కాకపోతే వీటి తయారీకి ఎక్కువ ఇంధనం అవసరమవుతుంది. ముక్కలుగా విరగ్గొట్టటం కష్టం. ఇలాంటి ఇబ్బందులను తప్పించటానికే చైనాలోని టియాంజిన్‌ యూనివర్సిటీ పరిశోధకులు డీఎన్‌ఏ ప్లాస్టిక్‌పై దృష్టి సారించారు. ముందుగా వంట నూనెల నుంచి తీసిన రసాయనానికి చిన్న డీఎన్‌ఏ పోచలను అనుసంధానం చేసి మెత్తటి జిగురుద్రవాన్ని సృష్టించారు. దీన్ని అచ్చులలో పోసి, శీతలీకరించారు. దీంతో జిగురు ద్రవంలోని నీరు బయటకు వెళ్లిపోయి, గట్టిపడింది. ఆయా అచ్చుల ఆకారాల్లో స్థిరపడిపోయింది. దీని ద్వారా కప్పుల వంటి రకరకాల వస్తువులను రూపొందించారు. వీటిని నీటిలో ముంచగా తిరిగి జిగురుద్రవంగా మారటం గమనార్హం. దీన్ని ఇతరత్రా వస్తువులను తయారు చేసుకోవటానికి తిరిగి వాడుకోవచ్చు. మరో మంచి విషయం ఏంటంటే- ఈ ప్టాస్టిక్‌ తయారీలో ఉపయోగపడే డీఎన్‌ఏ అంతటా అందుబాటులో ఉండటం. మన భూమ్మీద 5వేల కోట్ల టన్నుల డీఎన్‌ఏ ఉందని అంచనా. ప్రస్తుతానికి సాల్మన్‌ చేప వీర్యం నుంచి సేకరించిన డీఎన్‌ఏతో ఈ ప్లాస్టిక్‌ను రూపొందించినా.. పంట వ్యర్థాలు, ఆల్గే, బ్యాక్టీరియా డీఎన్‌ఏనూ దీనికి వాడుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. డీఎన్‌ఏ ప్లాస్టిక్‌ తయారీకి ఎక్కువ ఉష్ణోగ్రత అవసరముండదు కాబట్టి 97% వరకు కర్బన ఉద్గారాలను తగ్గించే అవకాశముందని అభిప్రాయపడుతున్నారు. అవసరం తీరాక డీఎన్‌ఏను జీర్ణం చేసుకునే ఎంజైమ్‌ సాయంతో దీన్ని తేలికగా విచ్ఛిన్నం చేసుకోవచ్చు. కాకపోతే ఇది మామూలు ప్లాస్టిక్‌ అంత దృఢంగా ఉండదు. పొడిగా ఉండేలా చూసుకోవటమూ ముఖ్యమే. ఈ రెండు ఇబ్బందులనూ అధిగమించగలిగితే మరింత ఎక్కువగా వినియోగంలోకి రాగలదని ఆశిస్తున్నారు.

ఈ ప్టాస్టిక్‌ తయారీలో వాడే డీఎన్‌ఏ అంతటా అందుబాటులో ఉంటుంది. మన భూమ్మీద 5వేల కోట్ల టన్నుల డీఎన్‌ఏ ఉందని అంచనా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని