సంతాన రోబోలు!

రోబో ప్రపంచంలో కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) ఎన్నెన్నో అసాధ్యాలను సుసాధ్యం చేస్తోంది. నడవటం, ఈదటం, సమాచారం ఇచ్చిపుచ్చుకోవటం వంటి నైపుణ్యాలను రోబోలు నేర్చుకోవటానికి వీలు కల్పిస్తోంది.

Published : 08 Dec 2021 00:37 IST

రోబో ప్రపంచంలో కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) ఎన్నెన్నో అసాధ్యాలను సుసాధ్యం చేస్తోంది. నడవటం, ఈదటం, సమాచారం ఇచ్చిపుచ్చుకోవటం వంటి నైపుణ్యాలను రోబోలు నేర్చుకోవటానికి వీలు కల్పిస్తోంది. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి పిల్లలను కనే సామర్థ్యాన్నీ సంతరించి పెట్టింది. రోబోలకు సంతానమేంటని అనుకుంటున్నారా? ఇవి మామూలు రోబోలు కాదు. ‘సజీవ’ రోబోలు! ఒక ప్రత్యేకమైన పద్ధతిలో ఇవి ‘పునరుత్పత్తి’ చెందగలవని.. అంటే తమ నకళ్లను సృష్టించుకోగలవని తాజా పరిశోధనలో బయటపడింది మరి.

రోబోలకు ఆలోచించుకునే గుణం అబ్బేలా చేయటమే చిత్రం. అలాంటిది ప్రాణం పోయటం, పైగా తమ నకళ్లను సృష్టించుకునేలా చేయటమంటే మాటలా? యూనివర్సిటీ ఆఫ్‌ వెర్మోంట్‌, హార్వర్డ్‌ యూనివర్సిటీ, టఫ్ట్స్‌ యూనివర్సిటీ పరిశోధకులు ఇలాంటి అసాధ్యాన్నే సుసాధ్యం చేశారు. గత సంవత్సరం ఆఫ్రికాలో కనిపించే జెనోపస్‌ లేవీస్‌ అనే కప్ప పిండం మూల కణాలతో జెనోబోట్స్‌ అనే ప్రాణులను సృష్టించారు. కొత్తరకం సజీవ యంత్రాలుగా ఆరంభంలోనే గుర్తింపు పొందాయి. ఇవి సంప్రదాయ రోబోలు కావు. అలాగని కొత్తరకం ప్రాణులూ కావు. కంప్యూటర్‌ ప్రోగ్రామ్‌తో నియంత్రించటానికి వీలైన సజీవ కళాఖండాలు. ఆల్గోరిథమ్‌ ద్వారా అంటే కంప్యూటర్‌ ప్రోగ్రామ్‌ ద్వారా ఆయా పనులను నేర్చుకునేలా వీటికి తర్ఫీదు ఇచ్చారు మరి. అనంతరం అతి సూక్ష్మమైన చిమ్మెటలు, ఎలక్ట్రోడ్ల సాయంతో వీటి ఆకారాలను మరింత మెరుగు దిద్దారు. చర్మ కణాలతో ఆకారం స్థిరంగా ఉండేలా, గుండె కణాలతో కదలేలా తీర్చిదిద్దారు. క్రమంగా రకరకాల ఆకారాల్లో మారేలా ప్రోగ్రామ్‌ చేశారు. వీటి సాయంతోనే ఇవి తమకు తాముగా కదులుతాయి. ఒకదాంతో మరోటి సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటాయి. దెబ్బతింటే తమకు తామే నయం చేసుకుంటాయి.

పునరుత్పత్తి ఎలా?

మూడు వేల కణాలతో తయారైన జెనోబోట్స్‌కు శాస్త్రవేత్తలు ఇప్పుడు తమ నకళ్లను సృష్టించుకునే సామర్థ్యాన్నీ కల్పించారు. అయితే చెట్లు, జంతువుల మాదిరిగా కాదు. ప్రత్యేకమైన ‘కైనెటిక్‌ రిప్లికేషన్‌’ పద్ధతిలో పునరుత్పత్తి చెందేలా తీర్చిదిద్దారు. ఇలాంటి ప్రక్రియ కణస్థాయిలో జరగొచ్చని భావించినా ఇంతకుముందెన్నడూ గుర్తించలేదు. తొలిసారిగా దీన్ని నిరూపించారు. జెనోబోట్స్‌ను ద్రావణంతో కూడిన ప్రయోగపాత్రలో వేస్తే.. కొంతకాలానికి విడిగా కప్ప కణాల  మేఘం ఏర్పడుతుంది. ఇవి తగినంత సంఖ్యలో పోగు పడ్డాక వీటిల్లో సగం వరకు పూర్తిస్థాయి ప్రాణులుగా మారుతుండటం విశేషం. అంటే అచ్చం జెనోబోట్స్‌ పిల్లల్లా రూపాంతరం చెందుతాయి అన్నమాట. ఇవి మాతృ కణాల్లాగానే ద్రావణంలో ఈదుతుండటం గమనార్హం. ఇలాంటి పునరుత్పత్తిని ఇంతకుముందు ఎలాంటి ప్రాణుల్లోనూ చూడలేదని, లక్షలాది సంవత్సరాలకు బదులుగా కొద్దిరోజుల్లోనే ఇవి పుట్టుకురావటం విచిత్రమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కృత్రిమ మేధతో వీటి పునరుత్పత్తి సామర్థ్యాన్ని మరింత వేగంగా జరిగేలా చూడొచ్చని వివరిస్తున్నారు.

ఏంటీ ప్రయోజనం?

ప్రస్తుతానికి జెనోబోట్స్‌ ప్రాథమిక దశలోనే ఉన్నాయి. వీటితో ఒనగూరే ప్రయోజనమేంటన్నది కచ్చితంగా తెలియదు. కానీ కాలుష్యం తగ్గటానికి వీటిని ఉపయోగించుకోవచ్చని భావిస్తున్నారు. ఇతర యంత్రాలు చేయలేని పనులను వీటికి అప్పగించొచ్చు. ఉదాహరణకు- రేడియోధార్మిక  పదార్థాలను, తీవ్ర విషతుల్యాలతో కూడిన కలుషితాలను గుర్తించటం.. సముద్రాల్లో అతి సూక్ష్మ ప్లాస్టిక్‌లను ఒకదగ్గరికి చేర్చటం.. రక్తనాళాల్లో పూడికలను తొలగించటం వంటి పనులకు ఉపయోగించుకోవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. బయటి నుంచి అంతగా సూచనలు అందించకుండానే తమకు తామే పనిచేసేలా భవిష్యత్‌ టెక్నాలజీలను రూపొందించే అవకాశముందనీ అనుకుంటున్నారు. ప్రయోజనాల విషయం పక్కన పెడితే పునరుత్పత్తి అనేది పరిణామక్రమానికి సింహద్వారం లాంటిది. అదీ లక్షలాది సంవత్సరాలకు బదులు కొద్దిరోజుల్లోనే పూర్తయ్యేలా చేయటం చాలా గొప్ప విషయం. జీవుల ప్రవర్తన గురించి మనకు తెలిసింది కొంతేనని, తెలుసుకోవాల్సింది ఇంకెంతో ఉందనే సంగతినిది మరోసారి రుజువు చేస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని