కీటక విజ్ఞానం

కీటకాలను మనం పెద్దగా పట్టించుకోం గానీ శాస్త్రవేత్తలకు మొదట్నుంచీ వీటిపై ఆసక్తి ఎక్కువే. వీటి స్ఫూర్తితో ఎన్నెన్నో వినూత్న పరిజ్ఞానాలను ఆవిష్కరించారు. పరికరాలను రూపొందించారు. సీతాకోక చిలుకల దగ్గర్నుంచి ఈగలు, పేడ పురుగులు, బొద్దింకల వరకూ కీటకాలన్నీ శాస్త్ర సాంకేతిక సమస్యల పరిష్కారానికి మార్గం చూపుతున్నవే.

Updated : 19 Jan 2022 05:27 IST

కీటకాలను మనం పెద్దగా పట్టించుకోం గానీ శాస్త్రవేత్తలకు మొదట్నుంచీ వీటిపై ఆసక్తి ఎక్కువే. వీటి స్ఫూర్తితో ఎన్నెన్నో వినూత్న పరిజ్ఞానాలను ఆవిష్కరించారు. పరికరాలను రూపొందించారు. సీతాకోక చిలుకల దగ్గర్నుంచి ఈగలు, పేడ పురుగులు, బొద్దింకల వరకూ కీటకాలన్నీ శాస్త్ర సాంకేతిక సమస్యల పరిష్కారానికి మార్గం చూపుతున్నవే. వీటి లోకంలోకి ప్రవేశిస్తే ఇలాంటి కొత్త సంగతులెన్నో బయటపడతాయి.

ఎందుకనో కీటకాలంటే మనకు మొదట్నుంచీ భయమే. బొద్దింక కనిపిస్తే భయంతో కేకలేస్తాం. ఇంట్లో ఈగలు, దోమలు తిరుగుతుంటే తరిమేస్తాం. తేనెటీగలు, కందిరీగల గురించైతే చెప్పనక్కర్లేదు. చూడగానే వణికిపోతాం. ఇవేమీ కోరలతో మనల్ని చీల్చి చెండాడవు. ఆ మాటకొస్తే వీటిల్లో చాలావరకు పెద్దగా హాని చేసేవీ కావు. మనకు తెలిసి సుమారు 10 లక్షల కీటకాల జాతులున్నాయి. వీటిల్లో ఒక్క శాతం కూడా మనుషులకు హాని చేయవు. సముద్రాల్లో తప్ప కీటకాలు లేని చోటు లేదు. భూ ప్రపంచంలో అన్ని మూలలా కనిపిస్తాయి. పర్యావరణ వ్యవస్థ సజావుగా చూడటంలో వీటి పాత్ర చాలా కీలకం. పుప్పొడిని వ్యాపింపజేస్తాయి. పదార్థాలు కుళ్లిపోయేలా చేస్తాయి. జంతువులకే కాదు, మనుషులకూ ఆహారంగా ఉపయోగపడతాయి. అన్నింటికన్నా ముఖ్యంగా మనం ఎదుర్కొంటున్న ఎన్నో సాంకేతిక సమస్యలకు పరిష్కారం చూపుతున్నాయి కూడా. అందుకనే దశాబ్దాలుగా శాస్త్రవేత్తలు కీటకాల వంక చూస్తున్నారు. వీటిని స్ఫూర్తిగా తీసుకొని, జీవానుకరణ (బయోమిమిక్రీ) పద్ధతితో కొంగొత్త ఆవిష్కరణలను సుసాధ్యం చేస్తున్నారు.


సీతాకోక చిలుక ‘వస్త్రాలు’

సీతాకోక చిలుక రెక్కల రంగుల ప్రత్యేకతే వేరు. ఇవి రసాయనాలతో వచ్చేవి కావు. కిటిన్‌ పొరలతో కూడిన రెక్కల నిర్మాణం తీరు, వర్ణద్రవ్యాలు, కాంతి తరంగాల కలయికతో పుట్టుకొస్తాయి. అందుకే వీటిని స్ట్రక్చరల్‌ రంగులంటారు. కాంతి ప్రసరించినప్పుడు రెక్కల నిర్మాణ వైవిధ్యం, పొరల మధ్య దూరం వల్ల కొన్ని రంగులు రద్దవుతాయి. కొన్ని కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. ఇవి వెలిసిపోవు. శాశ్వతంగా అలాగే ఉంటాయి. వస్త్ర డిజైనర్లకు ఇంతకన్నా కావాల్సిందేముంది? అందుకే ఆస్ట్రేలియా డిజైనర్‌ ఒకరు రంగులు లేని ‘మోర్ఫోటెక్స్‌’ దుస్తులను తయారుచేశారు. సీతాకోక చిలుక రెక్కల మాదిరిగానే పాలిస్టర్‌, నైలాన్‌ పోచలతో సూక్ష్మమైన పొలుసులను తయారుచేసి, వివిధ పొరలుగా అమర్చారు. దీని మీద కాంతి పడినప్పుడు వస్త్రం  రంగులతో మెరిసిపోతుంది. సీతాకోక చిలుక రెక్కల స్ఫూర్తితోనే క్వాల్‌కామ్‌ సంస్థ మిరాసోల్‌, ఐమోడ్‌ తెరలను రూపొందించింది. ఇవి నిరంతరం వెలుగుతున్నట్టుగా కనిపిస్తాయి. చుట్టుపక్కల కాంతితోనే పనిచేయటం వల్ల 90% ఇంధనం అవసరమవుతుంది. ప్రస్తుతం మనం వాడుతున్న ఫోన్లకూ ఇలాంటి తెరలుంటే ఎంత బాగుంటుందో కదా.


బీటిల్‌ ‘మంచు నీటి సీసా’

ఎడారిలో నీరు దొరకటం కష్టం. గ్లాసు నీళు కనిపించినా ప్రాణం లేచి వస్తుంది. మరి ఇలాంటి చోట గాలితోనే.. అంటే పొగ మంచుతోనే తాగు నీటిని సంగ్రహిస్తే? సియోల్‌ నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీ విద్యార్థి కిటాయే పాక్‌ రూపొందించిన డ్యే బ్యాంక్‌ బాటిల్‌ అదే చేస్తుంది. దీనికి స్ఫూర్తి ఆఫ్రికాలోని నమిబ్‌ ఎడారిలో నివసించే ఓనీమక్రిస్‌ అన్‌గ్యూక్యులరిస్‌ అనే బీటిల్‌. పేడ పురుగులాంటి ఇది తనదైన శైలిలో నీటిని ఒడిసి పడుతుంది. దీని వీపు మీద బొడిపెల దారులుంటాయి. ఇది తలను కిందికి వంచి నిల్చొని, తెల్లవారుజామున వీచే చల్లటి మంచు గాలులను వీపునకు తగిలేలా చూసుకుంటుంది. వీపు మీద పోగుపడే మంచు.. క్రమంగా నీరుగా మారి, బొడిపెల దారుల ద్వారా నోటికి చేరుతుంది. దీని ఉపాయం ఆధారంగానే కిటాయే పాక్‌ కొత్తరకం సీసాను సృష్టించారు. చూడటానికిది బోర్లించిన పాత్రలా కనిపిస్తుంది. స్టీలుతో తయారైన దీన్ని ఆరుబయట పెడితే, రాత్రిపూట చల్లగా అవుతుంది. ఉదయం ఉష్ణోగ్రత పెరుగుతున్నకొద్దీ దీని మీద చేరిన తేమ నీరుగా మారి, కిందికి దిగుతుంది. చిన్న చిన్న రంధ్రాల ద్వారా సీసా లోపలికి చేరుకుంటుంది.


ఫ్లీ కీళ్ల ‘రబ్బరు’

రెక్కలుండవు గానీ ఫ్లీ కీటకాలు మంచి హై, లాంగ్‌ జంపర్లు. ఒక్క ఉదుటున గెంతుతాయి. వీటి మోకాళ్లలో రెసిలిన్‌తో తయారైన ప్రత్యేకమైన ప్యాడ్లు ఉంటాయి. రెసిలిన్‌ మృదువుగా ఉంటుంది, బాగా సాగుతుంది. చాలా ఒత్తిడిని తట్టుకుంటుంది. మనకు తెలిసి అత్యంత ఎక్కువగా సాగే గుణం గల ప్రొటీన్‌ ఇదే. ఇది త్వరగా శక్తిని నిల్వ చేసుకుంటుంది. అంతే త్వరగా విడుదల చేస్తుంది. దీని స్ఫూర్తితోనే ఆస్ట్రేలియా ప్రభుత్వ పరిశోధన సంస్థ సీఎస్‌ఐఆర్‌ఓ కొత్తరకం రబ్బరును రూపొందించింది. ఇది 98% నిరోధకత్వాన్ని కలిగుంటుంది. గుండె కవాటాల దగ్గర్నుంచి బూట్ల వరకు వివిధ పరికరాల తయారీలో విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది.


చిమ్మెట కళ్ల ‘తెరలు’

చిమ్మెట (మాత్‌) కళ్లకు ఎక్కడలేని ప్రత్యేకత ఉంది. మొత్తం ప్రకృతిలో అతి తక్కువ కాంతిని పరావర్తనం చేసేవి ఇవే. దీని కళ్లు ఒమాటిడియం భాగాలతో కూడుకొని ఉంటాయి. ప్రతీ ఒమాటిడియం మీద కాంతి పరావర్తనాన్ని అడ్డుకునే అతి సూక్ష్మమైన నిర్మాణాల పొరలుంటాయి. వీటి సాయంతోనే మాత్‌ రాత్రిపూట శత్రువుల కంటికి కనిపించకుండా తనని తాను రక్షించుకుంటుంది. కాబట్టే జపాన్‌ శాస్త్రవేత్తలను ఇది ఆకర్షించింది. దీని కళ్ల స్ఫూర్తితో ఓ వినూత్న పొరను రూపొందించారు. దీన్ని సౌర విద్యుత్‌ ఫలకాల్లోని ఫొటోవోల్టాయిక్‌ కణాలను జోడించగా కాంతిని పట్టి ఉంచే సామర్థ్యం ఎన్నో రెట్లు పెరగటం గమనార్హం. ఇక అమెరికా, తైవాన్‌ పరిశోధకులైతే మరో అడుగు ముందుకేసి స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్ల కోసం యాంటీ-రిఫ్లెక్టివ్‌ పొరలను తయారుచేశారు. మాత్‌ కళ్ల స్ఫూర్తితో రూపొందించిన గ్లేర్‌ నిరోధక పొర మూలంగా ఎండలోనూ ఫోన్లు, ట్యాబ్లెట్లలోని అంశాలను చదవటం తేలికైంది. ఉపరితలం నుంచి కాంతి పరావర్తనం కావటాన్ని ఈ పొర 0.23 శాతానికి తగ్గించేసింది.


బొద్దింక రోబోలు

బొద్దింకలు ఇంట్లో అన్ని మూలల్లోనూ కనిపిస్తాయి. ఎంత వేగంగా పరుగెడతాయో? ఇవి ఎలాంటి చోటైనా సునాయాసంగా ఎత్తులకు ఎక్కుతాయి. రోబో రూపకర్తలను ఆకర్షించింది ఇదే. మడగాస్కర్‌ హిసింగ్‌ బొద్దింకలతో యూనివర్సిటీ ఆఫ్‌  కనెక్టికట్‌  పరిశోధకులు రోబో-రోచ్‌లను తయారుచేశారు. బొద్దింకలో న్యూరో కంట్రోలర్‌ను అమర్చి, దీని వీపు మీద ఓ మైక్రో సర్క్యూట్‌ను బిగించారు. బ్లూటూత్‌ ట్రాన్స్‌మీటర్‌, రిసీవర్‌ ద్వారా దీన్ని అనుకున్న విధంగా కదిలేలా చేయటంలో విజయం సాధించారు. ఇలా స్మార్ట్‌ఫోన్‌తో ఈ బొద్దింకను తేలికగా నియంత్రించటానికి వీలవుతుంది. భవనాలు కూలినప్పుడు శిథిలాల కింద చిక్కుకున్నవారిని కనుక్కోవటానికి ఇది ఉపయోగపడుతుంది. యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా పరిశోధకులైతే బొద్దింకను స్ఫూర్తిగా తీసుకొని, పాలీవినైలిడిన్‌ డైఫ్లోరైడ్‌ పొరతో చిన్న రోబోనూ రూపొందించారు. పొర సంకోచ, వ్యాకోచాల మూలంగా కదిలే ఇది బొద్దింక మాదిరిగానే దూసుకుపోతుంది. దీని మీద కాలు పెట్టి నొక్కినా ఏమీ కాదు. కాలు తీయగానే ముందుకు కదులుతుంది.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని