తెగిన కాలు పునః సృష్టి!

బల్లి తోక తెగిపోతే కొత్తది మొలుస్తుంది కదా. అలా మనుషులకూ తెగిన కాళ్లు, చేతులు తిరిగి మొలిస్తే? ఊహించుకోవటానికిది బాగానే ఉంటుంది. కాల్పనిక సైన్స్‌ సినిమాల్లో ఇలాంటివి చూస్తూనే ఉంటాం. నిజమైతే ఎంత బాగుంటుందోననీ

Published : 02 Feb 2022 01:16 IST

బల్లి తోక తెగిపోతే కొత్తది మొలుస్తుంది కదా. అలా మనుషులకూ తెగిన కాళ్లు, చేతులు తిరిగి మొలిస్తే? ఊహించుకోవటానికిది బాగానే ఉంటుంది. కాల్పనిక సైన్స్‌ సినిమాల్లో ఇలాంటివి చూస్తూనే ఉంటాం. నిజమైతే ఎంత బాగుంటుందోననీ అనుకుంటుంటాం. మున్ముందు ఇలాంటి విచిత్రం సాకారమైనా ఆశ్చర్యం లేదు. టఫ్ట్స్‌ యూనివర్సిటీ, హార్వర్డ్‌ యూనివర్సిటీకి చెందిన వీస్‌ ఇన్‌స్టిట్యూట్‌ శాస్త్రవేత్తల తాజా ప్రయోగ చికిత్సే దీనికి నిదర్శనం. మందుల మిశ్రమంతో ఒక కప్పకు తెగిపోయిన కాలును తిరిగి సృష్టించటంలో విజయం సాధించారు మరి.

కాళ్లు, చేతుల వంటి అవయవాలను తిరిగి సృష్టించటానికి మూలకణాలు, జన్యుచికిత్సలతో పరిశోధకులు ఎన్నెన్నో ప్రయోగాలు చేస్తూ వస్తున్నారు. అయితే ఇవి చాలా సంక్లిష్టమైన పద్ధతులు. వీటికి భిన్నంగా టఫ్ట్స్‌, హార్వర్డ్‌ యూనివర్సిటీల పరిశోధకులు ఓ తేలికైన మార్గంతో అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. ముందుగా కప్పకు కాలు తెగిపోయిన చోట చుట్టూరా కణజాలం గట్టిపడి, మచ్చగా మారకుండా సిలికాన్‌ మూత (బయోడోమ్‌) బిగించారు. ఇలా గాయం చుట్టూ రక్షణ వాతావరణం ఏర్పాటు చేశారు. బయోడోమ్‌లో ముందుగానే ఐదురకాల మందుల మిశ్రమాన్ని కూర్చారు. దీన్ని 24 గంటల తర్వాత తొలగించారు. మందుల ప్రభావం మూలంగా తొలిరోజుల్లో పిండంలో మాదిరిగానే కణ మార్గాలు ప్రేరేపితమయ్యాయి. అంటే పునరుజ్జీవ ప్రక్రియ మొదలైందన్నమాట. అప్పట్నుంచి క్రమంగా ఎముక నిర్మాణం, అంతర్గత కణజాలం, నాడులు, వేళ్ల వంటివన్నీ పుట్టుకొచ్చాయి. ఇందుకు దాదాపు 18 నెలలు పట్టింది. కేవలం 24 గంటల చికిత్సతోనే నెలల కొద్దీ పునరుజ్జీవ ప్రక్రియ కొనసాగటం గమనార్హం. కాకపోతే వేళ్లలో ఎముకలు మాత్రం ఏర్పడలేదు. అయితేనేం.. కొత్తగా పుట్టుకొచ్చిన కాలుకు స్పర్శజ్ఞానం తెలవటం.. కొత్త కాలు సాయంతో కప్ప ఈదుతుండటం విశేషం. కప్పలు, ఇతరత్రా జంతువులు అంతర్గతంగా పునరుజ్జీవ సామర్థ్యాలు కలిగుంటున్నట్టు ఇది సూచిస్తోందని పరిశోధకులు చెబుతున్నారు. వీటిని ప్రేరేపించటం సాధ్యమేనని తాజా ప్రయోగంతో రుజువైనట్టయ్యింది. గతంలో బయోడోమ్‌లో ప్రొజెస్టిరాన్‌ మందును కూర్చి కప్ప కాళ్లను తిరిగి సృష్టించాలని ప్రయత్నించారు. దీంతో కణజాలం బాగానే పుట్టుకొచ్చినా, పనికిరాని ముళ్ల వంటి భాగాలూ ఏర్పడ్డాయి. అందుకే ఈసారి వాపుప్రక్రియను అణచిపెట్టటానికి.. రక్తనాళాలు, కండరాలు, నాడుల వృద్ధిని ప్రోత్సహించటానికి, కణజాలం గట్టిపడి మచ్చ ఏర్పడకుండా ఉండటానికి ఐదురకాల మందులను ఉపయోగించారు. ఈ ప్రక్రియను మున్ముందు క్షీరదాల్లో, తర్వాత మానవుల మీద పరీక్షించి చూడాలని భావిస్తున్నారు. నిజానికి మనలోనూ కొంత పునరుజ్జీవ శక్తి ఉంటుంది. గాయం మానటానికి పుట్టుకొచ్చే కణజాలమే దీనికి ఉదాహరణ. కాలేయం సగం వరకు దెబ్బతినా తిరిగి పూర్తిగా కోలుకుంటుంది కూడా. అందువల్ల మందుల మిశ్రమంతో కూడిన ఇలాంటి చికిత్సతో ఏదో ఒకనాడు మనుషుల్లోనూ కోల్పోయిన కాళ్లు, చేతులను తిరిగి సృష్టించే అవకాశం లేకపోలేదని భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని