బుట్ట విద్యుత్‌ కేంద్రం!

పర్యావరణానికి హాని చేయని విద్యుత్తు తయారీ రోజురోజుకీ ప్రాధాన్యం సంతరించుకుంటోంది. ఈ విషయంలో సౌర విద్యుత్తు, పవన విద్యుత్తు ఎంతో భరోసా కల్పిస్తున్నాయి. అయితే ఎండ ఎక్కువ పడని, గాలి అంతగా వీయని ప్రాంతాల్లో వీటి ఉత్పత్తి కష్టమే. ఆలోచించగలిగితే పరిష్కారాలకు కొదవేముంది?

Updated : 16 Feb 2022 06:51 IST

ర్యావరణానికి హాని చేయని విద్యుత్తు తయారీ రోజురోజుకీ ప్రాధాన్యం సంతరించుకుంటోంది. ఈ విషయంలో సౌర విద్యుత్తు, పవన విద్యుత్తు ఎంతో భరోసా కల్పిస్తున్నాయి. అయితే ఎండ ఎక్కువ పడని, గాలి అంతగా వీయని ప్రాంతాల్లో వీటి ఉత్పత్తి కష్టమే. ఆలోచించగలిగితే పరిష్కారాలకు కొదవేముంది? కావాలంటే హాల్సియం అనే అంకుర సంస్థ పరికరాన్నే చూడండి. దీనిపేరు పవర్‌పాడ్‌. చూడటానికి చెత్తబుట్టలా కనిపిస్తుంది గానీ నిజానికిదో పవన విద్యుత్తు కేంద్రం! పవన విద్యుత్తుకు పెద్ద పెద్ద గాలిమరలు కావాలి కదా. బుట్టతో ఎలా సాధ్యమని అనుకుంటున్నారా? దీనిలోపల గుండ్రంగా తిరిగే అధునాతన బ్లేడ్‌ వ్యవస్థ ఉంటుంది మరి. బుట్ట చుట్టూ గాలి లోపలికి వెళ్లటానికి మార్గాలుంటాయి. లోపలికి ప్రవేశించిన గాలి గరాటు లాంటి నిర్మాణంలోంచి వెళ్లి బ్లేడ్‌ను తాకుతుంది. గరాటులోంచి వెళ్లటం వల్ల గాలి వేగం పెరుగుతుంది. దీంతో బ్లేడు చాలావేగంగా తిరుగుతుంది. అప్పుడు టర్బైన్‌ తిరిగి విద్యుత్తు పుట్టుకొస్తుంది. ప్రత్యేకించి పట్టణాలను దృష్టిలో పెట్టుకునే దీన్ని రూపొందించారు. ఒక కిలోవాట్‌ విద్యుత్తును తయారుచేయగల దీన్ని కొద్ది స్థలంలోనే ఏర్పాటు చేసుకోవచ్చు. స్టూలు మాదిరిగా ఎక్కడంటే అక్కడ పెట్టుకోవచ్చు. అవసరమనుకుంటే ఎక్కడికైనా మోసుకెళ్లొచ్చు. నిజానికి పట్టణాలు, నగరాల్లో సగటు గాలి వేగం చిన్న టర్బైన్‌ మరలను తిప్పటానికైనా సరిపోదు. టర్బైన్‌ తిరగకపోతే బ్లేడ్ల మధ్య గాలి తేలిపోతుంది. విద్యుత్తు ఉత్పత్తి కాదు. పైగా కొన్నిసార్లు హఠాత్తుగా గాలి దశ మారొచ్చు. ఒకే సమయంలో పలు దిక్కుల నుంచి గాలి వీయొచ్చు. ఇది టర్బైన్‌ పనితీరును అస్తవ్యస్తం చేస్తుంది. పవర్‌పాడ్‌తో ఇలాంటి ఇబ్బందులేవీ ఉండవు. గాలి ఏ దిక్కు నుంచి వీచినా లోపలికి ప్రవేశిస్తుంది. ఎక్కువ గాలి వీయాల్సిన అవసరం లేదు. కొద్దిపాటి గాలి అయినా చాలు. బయట మరలు ఉండవు కాబట్టి సురక్షితం కూడా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని