జేమ్స్‌వెబ్‌ తొలి ఫొటోలు అదుర్స్‌

సుదూర అంతరిక్షంలో కాంతులీనుతున్న ఈ నక్షత్రం ఎంత అందంగా కనిపిస్తోందో! మనలాగే శాస్త్రవేత్తలు కూడా దీన్ని అంతే అబ్బురంగా చూస్తున్నారు. ఇంతకుముందు ఎన్నో నక్షత్రాల ఫొటోలను చూసినా దీనికిదే సాటి.

Updated : 23 Mar 2022 06:04 IST

సుదూర అంతరిక్షంలో కాంతులీనుతున్న ఈ నక్షత్రం ఎంత అందంగా కనిపిస్తోందో! మనలాగే శాస్త్రవేత్తలు కూడా దీన్ని అంతే అబ్బురంగా చూస్తున్నారు. ఇంతకుముందు ఎన్నో నక్షత్రాల ఫొటోలను చూసినా దీనికిదే సాటి. నాసా ఇటీవల అంతరిక్షంలో ప్రవేశపెట్టిన జేమ్స్‌వెబ్‌ టెలిస్కోప్‌ (జేడబ్ల్యూటీ) తీసిన మొట్టమొదటి ఫొటోల్లో ఇదొకటి మరి. పద్దెనిమిది షడ్భుజి భాగాలతో కూడిన టెలిస్కోప్‌ ప్రధాన అద్దం తనకు తానుగా విప్పుకొని, కుదురుకొని తొలి ఫొటోలు తీసి, పంపించింది. ఇవి ఊహించినదాని కన్నా ఎన్నో రెట్లు మెరుగ్గా, స్పష్టంగా ఉండటం విశేషం. ఈ ఫొటోలోని నక్షత్రం పేరు హెచ్‌డీ84406. మామూలుగా మన కంటికి కనిపించే నక్షత్రంతో పోలిస్తే ఇది 100 రెట్లు తక్కువగా ప్రకాశిస్తుంది. అలాంటి నక్షత్రాన్నీ జేడబ్ల్యూటీ ఎంత స్పష్టంగా ఫొటో తీసిందో. ఇక నక్షత్రం వెనకాల మినుకు మినుకుమంటున్న చుక్కలన్నీ సుదూర నక్షత్ర మండలాలు కావటం గమనార్హం. వీటిని ఫొటోలు తీయటం ఇదే తొలిసారి. ఈ తొలి ఫొటోలు శాస్త్రీయ అవసరాల కోసం ఉద్దేశించినవి కావు. టెలిస్కోప్‌ భాగాలు ఎంత బాగా, సమన్వయంగా పనిచేస్తున్నాయో తెలుసుకోవటానికి తీసినవి. టెలిస్కోప్‌లో నాలుగు శాస్త్రీయ పరికరాలు ఉన్నాయి. వీటిల్లోని నియర్‌ ఇన్‌ఫ్రారెడ్‌ కెమెరా ఒక్కటే రంగంలోకి దిగింది. మిగతావి జూన్‌ లేదా జులైలో పని మొదలెట్టొచ్చని అనుకుంటున్నారు. ఇవన్నీ ఫొటోలు తీసి పంపిస్తే ఇంకెలా ఉంటుందో? విశ్వం ఆవిర్భావ సమయంలో నక్షత్ర మండలాల గుట్టును ఇవి విప్పుతాయనటంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే శాస్త్రవేత్తలకు అంత సంతోషం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని