కాంతిని వెదజల్లే ప్లాస్టిక్‌

మృదువైన, ఎటంటే అటు వంగే డిస్‌ప్లే తెరలొస్తే కంప్యూటర్ల స్వరూపమే మారిపోతుంది. వీటిని చర్మం మీదే అతికించుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌ వంటివి వెంట తీసుకెళ్లాల్సిన అవసరమేమీ

Updated : 30 Mar 2022 05:54 IST

మృదువైన, ఎటంటే అటు వంగే డిస్‌ప్లే తెరలొస్తే కంప్యూటర్ల స్వరూపమే మారిపోతుంది. వీటిని చర్మం మీదే అతికించుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌ వంటివి వెంట తీసుకెళ్లాల్సిన అవసరమేమీ ఉండదు. కానీ ప్రస్తుతం అందుబాటులో ఉన్న మృదువైన తెరలతో ఇబ్బందేంటంటే- వీటికి ఎక్కువ విద్యుత్తు కావాలి. పెళుసుగానూ ఉంటాయి. అంతగా వంగవు. ప్రకాశం తక్కువ. ఖరీదూ ఎక్కువే. ఇలాంటి ఇబ్బందులు తప్పించటానికే కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ పరిశోధకులు కాంతిని వెదజల్లే కొత్తరకం ప్లాస్టిక్‌ పదార్థాన్ని సృష్టించారు. ఇది ఎలాంటి పగుళ్లు పడకుండానే తన పొడవు కన్నా రెండు రెట్లు ఎక్కువగా సాగుతుంది. ఈ పాలిమర్‌ స్మార్ట్‌ఫోన్‌ తెరల కన్నా రెండు రెట్లు ఎక్కువగా ప్రకాశిస్తుంది. వంద రెట్లు సాగదీసినా 80% వరకు ప్రకాశాన్ని నిలుపుకోగలదు. దీని గుండా విద్యుత్‌శక్తి ప్రవహించినప్పుడు ఫోటాన్లను వెలిగేలా చేస్తుంది. ఇలా ఎరుపు, ఆకుపచ్చ, నీలం రంగులను వెదజల్లుతుంది. దీంతో తయారుచేసిన పలుచటి పొరలను నేరుగా చర్మానికే అతికించుకోవచ్చు. వంగినా పడిపోకుండా అలాగే పట్టుకొని ఉంటుంది. దృశ్యాలను మార్చే నియంత్రణ పరిజ్ఞానం, పిక్సెల్స్‌తో కూడిన పెద్ద పెద్ద తెరల వంటివి తయారు చేయటానికిది బాగా ఉపయోగపడగలదని భావిస్తున్నారు. ప్రస్తుతానికైతే దీన్ని పరిమిత స్థాయిలోనే, ఒక్క రంగును వెదజల్లే నమూనాలతోనే ప్రదర్శించారు. ఇప్పుడు అందుబాటులో ఉన్న గట్టి తెరలు వెలగటానికి వినియోగిస్తున్న పరిజ్ఞానాన్ని ఈ పాలిమర్‌కు జోడిస్తే గణనీయమైన మార్పులకు దారితీస్తుందనటం నిస్సందేహం. దీని తయారీ చవక కావటం మరింత కలిసొచ్చే విషయం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని