గాలిలోంచి మాంసం!

మాయా లేదు, మంత్రం లేదు. నిజంగానే గాలిలోంచి మాంసం పుడుతుంది! విచిత్రంగా అనిపించినా అమెరికాలోని ఎయిర్‌ ప్రొటీన్‌ అనే అంకుర సంస్థ సరిగ్గా ఇలాంటి పనే చేసి చూపిస్తోంది. గాలి నుంచి కార్బన్‌ డయాక్సైడ్‌ను సంగ్రహించి,

Updated : 06 Apr 2022 16:05 IST

మాయా లేదు, మంత్రం లేదు. నిజంగానే గాలిలోంచి మాంసం పుడుతుంది! విచిత్రంగా అనిపించినా అమెరికాలోని ఎయిర్‌ ప్రొటీన్‌ అనే అంకుర సంస్థ సరిగ్గా ఇలాంటి పనే చేసి చూపిస్తోంది. గాలి నుంచి కార్బన్‌ డయాక్సైడ్‌ను సంగ్రహించి, బ్యాక్టీరియా సాయంతో మాంసాన్ని తయారుచేస్తోంది. వాతావరణ మార్పును కట్టడి చేయటానికి లీసా డేసన్‌ అనే భౌతిక శాస్త్రవేత్త, జాన్‌ రీడ్‌ అనే పదార్థాల శాస్త్రవేత్త ఎయిర్‌ ప్రొటీన్‌ సంస్థను స్థాపించారు. భూతాపానికి కారణమవుతున్న కార్బన్‌ డయాక్సైడ్‌ను మాంసంగా మార్చాలనేది వీరి సంకల్పం. ఇంతకీ దీన్నెలా సాధ్యం చేశారో తెలుసా? ముందుగా హైడ్రోజన్‌ను శక్తివనరుగా వాడుకునే బ్యాక్టీరియాను ట్యాంకుల్లో పులియబెడతారు. తర్వాత వీటికి కార్బన్‌ డయాక్సైడ్‌, ఆక్సిజన్‌, ఖనిజాలు, నీరు, నత్రజని మిశ్రమాన్ని ఆహారంగా ఇస్తారు. దీంతో ప్రొటీన్‌తో నిండిన పిండి పదార్థం తయారవుతుంది. ఇది అచ్చం మాంసంలో మాదిరి అమైనో ఆమ్లాలనే కలిగుండటం విశేషం. ఈ పిండి పదార్థాన్ని శుద్ధి చేసి, ఎండబెట్టి పిండి రూపంలోకి మారుస్తారు. మనం పిండితో రొట్టెల వంటివి చేసుకున్నట్టుగానే దీన్ని ప్రత్యేక పద్ధతుల్లో రకరకాల ఆకారాల్లో మాంసం ముక్కలుగా మారుస్తారు. మాంసం కోసం జంతువులను పెంచటంతో పోలిస్తే దీనికి 15 లక్షల రెట్ల తక్కువ స్థలం అవసరమవుతుంది. నీటి వాడకమూ 15వేల రెట్లు తక్కువే. నిజానికి ఎయిర్‌ ప్రొటీన్‌ ఆవిష్కరణకు మూలం ఒకప్పుడు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా చేసిన ఆలోచనే. సుదీర్ఘ అంతరిక్ష ప్రయాణాలు చేసే వ్యోమగాములకు తగిన ఆహారం కోసం 1967లో రకరకాల మార్గాలను అన్వేషించారు. కార్బన్‌ డయాక్సైడ్‌ను సూక్ష్మక్రిములతో కలిసి ఆహారాన్ని తయారుచేయాలన్నది వీటిల్లో ఒకటి. ఎందుకనో దాన్ని పక్కన పెట్టేశారు. దీన్నే ఎయిర్‌ ప్రొటీన్‌ కార్యాచరణలో పెట్టింది. ఏదేమైనా గాలి నుంచి ఆహార పదార్థాలను పుట్టించటమనేది పర్యావరణానికీ మేలు చేసేదిగా ఉండటం మెచ్చుకోదగిన విషయమే కదా. ఏమంటారు? దీనికి అవసరమైన కార్బన్‌ డయాక్సైడ్‌ను మొక్కలు వాడుకునే గాలి నుంచే సంగ్రహిస్తారు మరి.

Read latest Technology News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts