వందేళ్ళు మన్నే బ్యాటరీ!

ఎలక్ట్రిక్‌ వాహనాల్లో బ్యాటరీ ఎంత కాలం పనిచేస్తుంది? నాణ్యతను బట్టి ఐదేళ్లో, పదేళ్లో పనిచేస్తుండొచ్చు. మరి వందేళ్లు చెక్కు చెదరకుండా ఉంటే? ఎలాన్‌ మస్క్‌కు చెందిన టెస్లా కంపెనీ ఇలాంటి దీర్ఘకాల బ్యాటరీ రూపకల్పన మీదే దృష్టి పెట్టింది. కర్బన ఉద్గారాలను

Updated : 01 Jun 2022 03:04 IST

ఎలక్ట్రిక్‌ వాహనాల్లో బ్యాటరీ ఎంత కాలం పనిచేస్తుంది? నాణ్యతను బట్టి ఐదేళ్లో, పదేళ్లో పనిచేస్తుండొచ్చు. మరి వందేళ్లు చెక్కు చెదరకుండా ఉంటే? ఎలాన్‌ మస్క్‌కు చెందిన టెస్లా కంపెనీ ఇలాంటి దీర్ఘకాల బ్యాటరీ రూపకల్పన మీదే దృష్టి పెట్టింది. కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు ప్రపంచమంతా ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు పరుగులు తీస్తుండటం చూస్తూనే ఉన్నాయి. వీటికి బ్యాటరీలే గుండెకాయ. ఇవి ఎంత ఎక్కువ విద్యుత్తును నిల్వ చేసుకుంటే అంత ఎక్కువ దూరం ప్రయాణించొచ్చు. ఎంత ఎక్కువకాలం మన్నితే అన్ని ఏళ్లు వాడుకోవచ్చు. ఆ మేరకు ఖర్చూ తగ్గుతుంది. సౌర శక్తి వంటి పునరుత్పాదక వనరులతో విద్యుత్తును తయారుచేస్తే కర్బన ఉద్గారాలు వెలువడటమూ పడిపోతుంది. అందుకే టెస్లా కంపెనీ డల్హౌసీ యూనివర్సిటీకి చెందిన ప్రముఖ బ్యాటరీ టెక్నాలజీ నిపుణులు జెఫ్‌ డాన్‌తో జట్టుకట్టింది. ప్రస్తుతం ఎలక్ట్రిక్‌ వాహనాల్లో ఎక్కువగా వాడుకుంటున్న లిథియం-అయాన్‌ బ్యాటరీలను తయారు చేసినవారిలో జెఫ్‌ ఒకరు. ఆయన లిథియం-అయాన్‌ కణాల కన్నా గొప్ప బ్యాటరీ కణాలను రూపొందించటంపై కృషి చేస్తున్నారు. ఇటీవలే నికెల్‌ మిశ్రమంతో కూడిన కొత్తరకం బ్యాటరీ కణాలపై పరిశోధన పత్రం వెలువరించారు. వేర్వేరు ఉష్ణోగ్రతల వద్ద ఛార్జ్‌ చేసినప్పుడు ఇవి మరింత ఎక్కువగా విద్యుత్తును నిల్వ చేసుకుంటుండటం విశేషం. 25 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఛార్జ్‌ చేస్తే బ్యాటరీ మన్నిక కాలం వందేళ్లు కూడా దాటగలదని ఆశిస్తున్నారు. గతంలో నికెల్‌ బ్యాటరీలను కోబాల్ట్‌ మిశ్రమంతో కలిపి ఉపయోగించేవారు. అయితే కోబాల్ట్‌తో కొన్ని దుష్ప్రభావాలు పొంచి ఉంటున్నాయి. కొత్త బ్యాటరీ డిజైన్‌తో వీటిని తగ్గించటంలో విజయం సాధించారు. కోబాల్ట్‌ మోతాదు తగ్గించినా, దీన్ని పక్కనపెట్టినా బ్యాటరీ పూర్తి సామర్థ్యంతో పనిచేసేలా చేయొచ్చని నిరూపించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని