Updated : 01 Jun 2022 03:05 IST

ల్యాబ్‌ కలప!

అడవులను నరకొద్దని పర్యావరణవేత్తలు చాలాకాలంగా చెబుతూనే వస్తున్నారు. చెట్లు తగ్గిపోతే భూతాపం పెరుగుతుందని, ఇది చాలా అనర్థాలకు దారితీస్తుందని హెచ్చరిస్తూనే ఉన్నారు. కానీ పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. చెట్లను కొట్టేయటం ఆగకపోవటానికి ప్రధాన కారణం కలపకు సహజ ప్రత్యామ్నాయమేదీ లేకపోవటం. మరి చెట్లను కాపాడే పోరాటంలో మనం పూర్తిగా ఓడిపోయినట్టేనా? ఇంకా ఓడిపోలేదు. ఎందుకంటే ఎంఐటీ పరిశోధకులు ఓ కొత్త పరిష్కార మార్గాన్ని కనుగొన్నారు మరి. అదేంటో తెలుసా? ప్రయోగశాలలో కలపను వృద్ధి చేయటం! ఆశ్చర్యంగా అనిపించినా ఇది సాధ్యమేనని నిరూపించారు. మామూలు వృక్ష కణాలకు మూలకణాల మాదిరి గుణాలను కల్పించటం ఇందులోని కీలకాంశం. పరిశోధకులు ముందుగా ఒక పూల మొక్క ఆకుల నుంచి సేకరించిన కణాలను, కొద్ది రోజుల పాటు ద్రవ మాధ్యమంలో నిల్వ చేశారు. అనంతరం జిగురు ద్రవం సాయంతో పోషకాలను, హార్మోన్లను అందించారు. దీంతో అవి కొత్త వృక్ష కణాలుగా వృద్ధి చెందాయి. హార్మోన్ల మోతాదులను మార్చటం ద్వారా ఈ కణాల ఆకారాలూ మారిపోతుండటం విశేషం. హార్మోన్‌ మోతాదులు ఎక్కువగా ఉన్న వృక్ష పదార్థం గట్టిగా మారిపోయింది కూడా. వీటిని 3డీ బయోప్రింటింగ్‌ పద్ధతి ద్వారా ఫర్నిచర్‌ ఆకారాలనూ సృష్టించారు. అంటే దీని ద్వారా చెట్లను కొట్టకుండానే కలప ఫర్నిచర్‌ను తయారుచేసుకోవచ్చన్నమాట. ఉదాహరణకు- చెక్క కుర్చీ కావాలనుకుంటే 3డీ బయోప్రింటింగ్‌తోనే ముద్రించుకోవచ్చు. దీంతో చెట్లను సంరక్షించటమే కాదు, కలప వృథా కాకుండానూ చూసుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ ప్రయోగం ఆరంభదశలోనే ఉన్నా ప్రకృతి ప్రేమికుల మదిలో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఏటా 1500 కోట్ల చెట్లను నరికేస్తున్నారని అంచనా. ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న రకరకాల పర్యావరణ సమస్యలకు అడవులు తగ్గటమే ప్రధాన కారణం. ప్రయోగశాలలో కలపను వృద్ధి చేసే ప్రక్రియ విజయవంతమైతే చెట్ల నరికివేత చాలావరకు ఆగిపోతుందనటంలో ఎలాంటి సందేహం లేదు. ఇది వీలైనంత త్వరగా సాకారం కావాలనీ ఆశిద్దాం.  

Read latest Technology News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts