Published : 15 Jun 2022 00:18 IST

ఈల్‌.. విద్యుత్తు.. బ్యాటరీ!

మొబైల్‌ ఫోన్లు, ఒంటికి ధరించే పరికరాలు.. అధునాతన ఎలక్ట్రిక్‌ వాహనాల వెల్లువతో ఎక్కువకాలం పనిచేసే బ్యాటరీల అవసరం రోజురోజుకీ పెరుగుతూ వస్తోంది. శాస్త్రవేత్తలు కూడా ఎప్పటికప్పుడు వినూత్న బ్యాటరీలను రూపొందిస్తున్నారు. ఇంతకీ మొట్టమొదటి బ్యాటరీని ఎవరు తెలుసా? ఇటలీ భౌతిక శాస్త్రవేత్త అలెసాండ్రో వోల్టా. ఆయన 1800లో ప్రాథమిక విద్యుత్‌రసాయన సూత్రాల ఆధారంగా దీన్ని రూపొందించారు. దీనికి స్ఫూర్తి ఈల్‌ చేపలు కావటం విశేషం!

రెండు వేర్వేరు పదార్థాలు (లోహాలను) అనుసంధానమైనప్పుడు రసాయన ప్రతిచర్య పుట్టుకొచ్చి, ఒక పదార్థం నుంచి మరోదానికి ఎలక్ట్రాన్లు ప్రసరిస్తాయి. బ్యాటరీల్లో విద్యుత్తు ఉత్పత్తికి మూలం ఈ ఎలక్ట్రాన్ల ప్రవాహమే. ఇందుకోసం వాడుకున్న తొలి లోహాలు రాగి, జింక్‌. ప్రస్తుతం నాణ్యమైన బ్యాటరీల్లో వివిధ లోహ మిశ్రమాలతో కూడిన లిథియాన్ని ఉపయోగిస్తున్నారు. శతాబ్దాలుగా మెరుగు పడుతూ వస్తున్నప్పటికీ ఆధునిక బ్యాటరీలు కూడా అలెసాండ్రో వోల్టా పద్ధతి మీద ఆధారపడ్డవే. లోహాల అనుసంధానం, విద్యుత్‌రసాయన ప్రతిచర్య జరగటం, పుట్టుకొచ్చే ఎలక్ట్రాన్లను ఒడిసి పట్టటం.. ఇప్పటికీ బ్యాటరీల తయారీలో అనుసరిస్తున్న సూత్రం ఇదే. అయితే దీన్ని కనుగొనటానికి వోల్టాకు స్ఫూర్తిని ఇచ్చినవి మాత్రం ఈల్‌ చేపలే. ఇవి నీటిలో ఈదుతూ మెరుపులాంటి విద్యుత్తును పుట్టించి, శత్రువును షాక్‌కు గురిచేస్తాయి. ఇలా విద్యుత్తును పుట్టించటానికి ఈల్‌ చేపల్లో ప్రత్యేక అవయవం ఉందని వోల్టా గుర్తించారు. దీని రహస్యాన్ని ఛేదించగలిగితే విద్యుత్తు తయారీకి కొత్త మార్గం దొరికినట్టే కదా అన్నది ఆయన ఆలోచన. ఈల్‌ చేపల్లో విద్యుత్తును పుట్టించే అవయవం పొడవైన కణాల కుప్పలా.. నాణాల దొంతరలా ఉంటుంది.

అందుకే వివిధ లోహాలను బిళ్లల మాదిరిగా కత్తిరించి, పొడవుగా పేరుస్తూ ప్రయోగాలు చేశారు. వేటితోనూ ఫలితం కనిపించలేదు. చివరికి ఉప్పునీటితో తడిపిన కాగితంతో రాగి, జింక్‌ బిళ్లలను వేరు చేస్తున్నప్పుడు విద్యుత్తు పుట్టుకొస్తున్నట్టు కనుగొన్నారు. బిళ్లల వరుస ఎంత ఎత్తుగా ఉంటే అంత ఎక్కువ విద్యుత్తు ఉత్పత్తి అయ్యింది. దీన్ని బట్టి ఈల్‌ చేపలో విద్యుత్తును తయారుచేసే అవయవం రహస్యాన్ని కనిపెట్టేశానని వోల్టా సంబర పడిపోయారు. అందుకే తాను తయారుచేసిన పరికరాన్ని మొదట్లో ‘కృత్రిమ విద్యుత్‌ అవయవం’ అనీ పిలుచుకునేవారు. కానీ వోల్టా ఊహించినట్టు ఈల్‌ చేపల్లోని విద్యుత్‌ అవయవానికీ, విద్యుత్‌ రసాయన ప్రతిచర్యలకూ సంబంధమేమీ లేదని తర్వాత శాస్త్రవేత్తలు గుర్తించారు. మన నాడీ కణాలు విద్యుత్‌ సంకేతాలను ఉత్పత్తి చేసినట్టుగానే ఈల్‌ చేపలు విద్యుత్తును పుట్టిస్తాయి. కాకపోతే పెద్దమొత్తంలో ఉత్పత్తి చేస్తాయి. ఇవి ప్రత్యేకమైన కణాల సాయంతో సోడియం, పొటాషియం అయాన్లను వేగంగా పంప్‌ చేస్తాయి. ఇవి విద్యుత్తు అవయవం పొరల నుంచి బయటకు వచ్చే క్రమంలో విద్యుత్తు ప్రవాహంగా మారతాయి. దీంతోనే శత్రువులను బెదర గొడతాయి. ఆహారాన్ని వేటాడతాయి. తీరు ఏదైతేనేం? ఈల్‌ చేపలు విద్యుత్తు పుట్టించే మాట నిజం. వీటిని అనుకరించే ప్రయత్నంలో బ్యాటరీల రూపకల్పనకు బీజం పడ్డ మాట నిజం. వోల్టా మాదిరిగానే ఇప్పుడు అమెరికా, స్విట్జర్లాండ్‌ పరిశోధకులు కూడా ఈల్‌ చేపల స్ఫూర్తితో బ్యాటరీ పరిజ్ఞానాలను రూపొందించారు. మృదువైన, తేలికగా వంగే తమ బ్యాటరీ ఏదో ఒకనాడు శరీరంలో అమర్చే పరికరాలకు, మెత్తటి రోబోలకు ఉపయోగపడగలదనీ భావిస్తున్నారు.

Read latest Technology News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని