రోబోకు మనిషి చర్మం!

ఎంతైనా మరమనిషి మరమనిషే. మనలాంటి సహజ రూపం ఎలా వస్తుంది? నిజానికి రోబోలను అచ్చం మనుషుల్లా కనిపించేలా చేయటానికి శాస్త్రవేత్తలు చాలాకాలంగా ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. రోబోలకు సిలికాన్‌ రబ్బరు పొరను జోడించి...

Published : 15 Jun 2022 00:20 IST

ఎంతైనా మరమనిషి మరమనిషే. మనలాంటి సహజ రూపం ఎలా వస్తుంది? నిజానికి రోబోలను అచ్చం మనుషుల్లా కనిపించేలా చేయటానికి శాస్త్రవేత్తలు చాలాకాలంగా ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. రోబోలకు సిలికాన్‌ రబ్బరు పొరను జోడించి కొంతవరకు సహజ రూపాన్ని తీసుకొస్తున్నారు. కానీ రబ్బరుకు మన చర్మం ఆకృతి ఎలా వస్తుంది? అలాగని యూనివర్సిటీ ఆఫ్‌ టోక్యో పరిశోధకులు నిరాశ పడలేదు. రోబోల ఉపరితలం మీద మన చర్మాన్ని పుట్టించే ప్రయత్నంలో విజయం సాధించారు. ప్లాస్టిక్‌ రోబో వేలును మృదులాస్థి, మనిషి చర్మకణాల మిశ్రమంలో ఉంచారు. మూడు రోజుల తర్వాత ఇవి రోబో వేలుకు అంటుకుపోయి, మన చర్మం లోపలి పొరలాంటిది ఏర్పడింది. అనంతరం దీన్ని కెరటినోసైట్లనే చర్మ కణాల్లో పెట్టగా 1.5 మిల్లీమీటర్ల మందంతో చర్మం పైపొర పుట్టుకొచ్చింది. ఇది వేలు ముందుకు, వెనక్కు కదులుతున్నప్పుడు చెక్కు చెదరలేదు. పైగా ఎక్కడైనా చీరుకుపోతే మన చర్మం మాదిరిగానే తిరిగి నయం కావటం విశేషం. అయితే రక్తనాళాలు లేకపోవటం వల్ల కొంత సేపటి తర్వాత ఎండిపోయింది. ఇది తేమగా ఉండటానికి భవిష్యత్తులో కృత్రిమ రక్తాన్ని సరఫరా చేసే అవకాశం లేకపోలేదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. మరింత సహజంగా కనిపించేలా చెమట గ్రంథులు, వెంట్రుకల కుదుళ్లనూ జోడించొచ్చనీ ఆశిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని