Published : 15 Jun 2022 00:23 IST

టమోటా సౌర ఫలకాలు!

క్కడి టమోటా? ఎక్కడి సౌర ఫలకాలు? రెండింటికీ అసలు ఏమైనా సంబంధం ఉందా? కానీ శాస్త్రవేత్తలు తలచుకుంటే దేన్నయినా సాధ్యం చేయగలరు. టమోటాలకు ఎరుపు రంగును తెచ్చిపెట్టే లైకోపేన్‌ను తీసుకొచ్చి సౌర కణాలకు జోడించేశారు. ఎందుకో తెలుసా? సౌర కణాల సామర్థ్యాన్ని, స్థిరత్వాన్ని పెంచటానికి!

పునరుత్పాదన ఇంధనాల విషయంలో సౌర విద్యుత్తు తీరే వేరు. సౌరశక్తిని ఒడిసిపట్టి విద్యుత్తును తయారుచేయటం ఎప్పట్నుంచో మొదలెట్టాం. సౌర ఫలకాల్లో విద్యుత్తును తయారుచేసే కణాలు చాలా కీలకం. అందుకే ఎప్పటికప్పుడు వీటి సామర్థ్యాన్ని పెంపొందించటానికి శాస్త్రవేత్తలు కృషి చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం వాణిజ్యపరంగా వాడుకుంటున్న చాలా సౌర కణాలు సిలికాన్‌ ఆధారంగా తయారైనవే. కానీ కొత్త తరం సౌర కణాలను టైటానియం, క్యాల్షియం స్ఫటికాలతో కూడిన పెరోవ్‌స్కైట్‌ పొరలతో రూపొందిస్తున్నారు. ఇవి చాలా సమర్థంగా పనిచేస్తుండటం విశేషం. కాకపోతే సిలికాన్‌ ఆధారిత సౌర కణాలతో పోలిస్తే త్వరగా క్షీణిస్తాయి. అందుకే ఇవి ఎక్కువ కాలం మన్నేలా చేయటంపై చైనాలోని జిలిన్‌ యూనివర్సిటీ పరిశోధకులు దృష్టి సారించారు. లైకోపేన్‌కు యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలు దండిగా ఉండటమే వీరిని బాగా ఆకర్షించింది. దీన్ని పెరోవ్‌స్కైట్‌ కణాలకు జోడించగా స్థిరత్వంతో పాటు కాంతిని విద్యుత్తుగా మార్చే సామర్థ్యమూ 3% పెరగటం విశేషం. మన చర్మానికి ఎండలోని అతి నీలలోహిత కాంతి తగిలినప్పుడు కొన్ని విశృంఖల కణాలు పుట్టుకొస్తుంటాయి. ఆహారం ద్వారా తీసుకున్న లైకోపేన్‌ వీటిని పట్టేసుకొని, చర్మ కణజాలం దెబ్బతినకుండా కాపాడుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే పరిశోధకులు లైకోపేన్‌ను పెరోవ్‌స్కైట్‌ కణాలకు జతచేశారు. దీంతో ఆక్సీకరణ వేగం తగ్గుతుండటం గమనార్హం. అంటే మన్నికకాలం బాగా మెరుగవుతోందన్నమాట. ఇది పెరోవ్‌స్కైట్ల స్ఫటికాల నిర్మాణంలో అతి సూక్ష్మ రేణువుల సంఖ్యనూ తగ్గించటం వల్ల సామర్థ్యమూ ఇనుమడిస్తోంది.

Read latest Technology News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts