Updated : 22 Jun 2022 06:40 IST

వంటింటి వ్యర్థాలతో సిమెంట్‌!

ఉల్లిపాయ పొట్టు, బత్తాయి తొక్కలు, మిగిలిపోయిన ఆహారం.. వీటిని ఏం చేస్తాం? చెత్తకుప్పలో పారేస్తాం. కానీ శాస్త్రవేత్తలు తలచుకుంటే సిమెంట్‌గా మార్చేయగలరు! ఆహార వ్యర్థాలతో సిమెంటా? జపాన్‌ శాస్త్రవేత్తలు దీన్నే సుసాధ్యం చేశారు మరి.

ప్రపంచంలో ఎక్కువగా వినియోగించుకునే పదార్థాల్లో కాంక్రీటు రెండోది. ఇళ్లు, భవనాల వంటి నిర్మాణాలకిది తప్పనిసరి. కాంక్రీటులో సిమెంటే ప్రధానం. నీటి సాయంతో ఇసుక, కంకరను కలిపి ఉంచేది ఇదే. నిర్మాణాలకు సిమెంట్‌ ఎంతగానో ఉపయోగపడుతున్నప్పటికీ పర్యావరణానికి చాలా హాని చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా పరిశ్రమలకు అవసరమైన విద్యుత్తులో 7 శాతం సిమెంట్‌ తయారీకే సరిపోతోంది. సుమారు 7 శాతం కర్బన ఉద్గారాల విడుదలకు ఇదే కారణమవుతోంది. సిమెంట్‌ తయారీకి అవసరమైన ముడి పదార్థాలను (మట్టి, సున్నపురాయి) 2500 డిగ్రీల ఫారన్‌హీట్‌కు పైగా ఉష్ణోగ్రతలో వేడి చేసే క్రమంలో ఉద్గారాలు ఎక్కువగా వెలువడుతుంటాయి. ఒక టన్ను సిమెంటు ఉత్పత్తి ప్రక్రియలో దాదాపు 600 కిలోల కార్బన్‌ డై ఆక్సైడ్‌ విడుదలవుతుంది. అందుకే సిమెంట్‌ వాడకాన్ని తగ్గించటానికి, కాంక్రీట్‌తో ముడిపడిన కర్బన ఉద్గారాలను తగ్గించటానికి ఇంజినీర్లు, పరిశోధకులు చాలాకాలంగా వినూత్న మార్గాలను అన్వేషిస్తున్నారు. కానీ ‘సుస్థిర’ స్వచ్ఛ సిమెంట్‌ను తయారు చేయటం  పెద్ద సవాల్‌గానే నిలుస్తోంది. దీన్ని పరిష్కరించటంలో భాగంగా యూనివర్సిటీ ఆఫ్‌ టోక్యో పరిశోధకులు ఆహార వ్యర్థాలతో సిమెంట్‌ను తయారు చేయటంలో విజయం సాధించారు. మొదట్లో ఈ వ్యర్థాలకు ప్లాస్టిక్‌ను కలిపి ఇసుక, కంకర వంటి వాటిని పట్టి ఉంచే పదార్థంగా తయారు చేయాలని అనుకున్నారు. చివరికి ‘వేడి ఒత్తిడి’తో ఇతర పదార్థాలేవీ కలపకుండానే సిమెంట్‌ను రూపొందించారు. ముందుగా  ఆహార వ్యర్థాల పొడిని నీటితో కలిపి, 350 డిగ్రీల ఫారన్‌హీట్‌ ఉష్ణోగ్రతతో కూడిన అచ్చులో అధిక ఒత్తిడికి గురిచేశారు. ఇది చివరికి బలమైన సిమెంటుగా మారింది. దీని బంధన సామర్థ్యం మామూలు సిమెంటు కన్నా 3 రెట్లు ఎక్కువగా ఉండటం విశేషం.

Read latest Technology News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని