అసామాన్యం అస్పష్ట లాజిక్‌!

మనం చాలాసార్లు కచ్చితమైన స్థితిని చెప్పలేని సంఘటనలను ఎదుర్కొంటూ ఉంటాం. అప్పుడు అవుననో, కాదనో కాకుండా మధ్యస్థంగా ఏదో ఒకటి చెప్పి దాట వేస్తుంటాం. గణితశాస్త్రంలోనూ ఇలాగే 0 లేదా 1 అని కచ్చితంగా చెప్పలేని పరిస్థితి ఎదురవుతుంటుంది. మరెలా? దీన్ని పరిష్కరించటానికి ఫజీ

Published : 13 Jul 2022 00:16 IST

నం చాలాసార్లు కచ్చితమైన స్థితిని చెప్పలేని సంఘటనలను ఎదుర్కొంటూ ఉంటాం. అప్పుడు అవుననో, కాదనో కాకుండా మధ్యస్థంగా ఏదో ఒకటి చెప్పి దాట వేస్తుంటాం. గణితశాస్త్రంలోనూ ఇలాగే 0 లేదా 1 అని కచ్చితంగా చెప్పలేని పరిస్థితి ఎదురవుతుంటుంది. మరెలా? దీన్ని పరిష్కరించటానికి ఫజీ లాజిక్‌ ఉపయోగపడుతుంది. ఇప్పుడు శరవేగంగా విస్తరిస్తున్న కృత్రిమ మేధకు మూల పద్ధతి ఇదే. ఒకరకంగా దీన్ని అస్పష్ట లాజిక్‌ అనుకోవచ్చు. ఆధునిక కంప్యూటర్‌ బూలియన్‌ లాజిక్‌ మీద ఆధారపడి పనిచేస్తుంది. ఇది విలువను ‘తప్పు లేదా ఒప్పు’ (0 లేదా 1) అని మాత్రమే చెబుతుంది. అదే ఫజీ లాజిక్‌ అయితే ‘వాస్తవ శ్రేణి’ని బట్టి గణిస్తుంది. ఈ విలువ 0 లేదా 1 కావొచ్చు. లేదూ వీటి మధ్యలో విలువైనా కావొచ్చు (ఉదాహరణకు- 0.17 లేదా 0.54). తేలికగా అర్థమయ్యేలా చెప్పాలంటే- బూలియన్‌ లాజిక్‌లో ఒక గ్లాసు వేడి నీరు (1 లేదా అంతకన్నా ఎక్కువ), ఒక గ్లాసు చల్లటి నీరు (0, అంతకన్నా తక్కువ) అని మాత్రమే చెప్పగలం. అదే ఫజీ లాజిక్‌లో ఒక గ్లాసు గోరువెచ్చటి నీరు (వేడిదీ కాదు, చల్లనిదీ కాదు) అనీ వివరించగలమన్నమాట. దీన్ని ప్రముఖ కంప్యూటర్‌ శాస్త్రవేత్త లోట్ఫీ జడే రూపొందించారు. ఆయనని ఫజీ లాజిక్‌ పితామహుడనీ పేర్కొంటారు. దీనిపై ఆయన 1965లో రాసిన పత్రాన్ని 90వేల సార్లకు పైగా ఉట్టంకించారంటే ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. ఫేషియల్‌ రికగ్నిషన్‌, ఎయిర్‌ కండిషనింగ్‌, వాషింగ్‌ మిషిన్లు, వాతావరణ అంచనా, స్టాక్‌ ట్రేడింగ్‌, చివరికి రైస్‌ కుక్కర్ల వంటి ఆధునిక పరిజ్ఞానాలకు ఇదే ఆధారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని