తోకంటే తోకా కాదు.. చుక్కంటే చుక్కా కాదు!

ఎవరెస్ట్‌ పర్వతం కన్నా రెండు రెట్లు పెద్దది. డైనోసార్లు మరణించటానికి కారణమైన గ్రహశకలం కన్నా పెద్దది. అలాంటి భారీ తోకచుక్క ఒకటి ఇటీవలే సౌరవ్యవస్థ లోపలి భాగంలోకి ప్రవేశించింది. నేడు భూమి సమీపానికి రానుంది. దీని పేరు సి.2017 కె2. సూర్య కిరణాలు చాలా బలహీనంగా ఉండే

Updated : 20 Jul 2022 08:29 IST

ఎవరెస్ట్‌ పర్వతం కన్నా రెండు రెట్లు పెద్దది. డైనోసార్లు మరణించటానికి కారణమైన గ్రహశకలం కన్నా పెద్దది. అలాంటి భారీ తోకచుక్క ఒకటి ఇటీవలే సౌరవ్యవస్థ లోపలి భాగంలోకి ప్రవేశించింది. నేడు భూమి సమీపానికి రానుంది. దీని పేరు సి.2017 కె2. సూర్య కిరణాలు చాలా బలహీనంగా ఉండే చోట కూడా దీనికి తోక ఏర్పడటం శాస్త్రవేత్తలనే ఆశ్చర్యపరుస్తోంది. ఇంతకీ తోకచుక్కలు ఎక్కడ ఉంటాయి? అప్పుడప్పుడు పలకరించి ఎందుకు వెళ్తాయి? వీటికి నిజంగా తోకలుంటాయా?

చుక్కలా ప్రకాశిస్తుంది. పైగా పొడవైన తోకతో కనువిందు చేస్తుంది. ఎప్పుడో గానీ తిరిగి రాదు. అందుకేనేమో తోకచుక్కలంటే మొదట్నుంచీ మనకు అంత ఆశ్చర్యం. ఆసక్తీనూ. చుక్క అని పిలుచుకుంటాం గానీ నిజానికి తోకచుక్కలు నక్షత్రాలు కావు. 460 కోట్ల ఏళ్ల క్రితం మన సౌర వ్యవస్థ ఏర్పడినప్పుడు మిగిలిపోయిన భాగాలు. ఇవి దుమ్ము, రాళ్లు, మంచుతో కూడుకొని ఉంటాయి. గ్రహాలు, గ్రహ శకలాల మాదిరిగానే ఇవీ సూర్యుడి చుట్టూ తిరుగుతుంటాయి. కాకపోతే పొడవైన తోక ఒక్కటే ఎక్కువ. ఇంతకీ తోక ఎలా ఏర్పడుతుంది? సూర్యుడి దగ్గరికి రావటం మూలంగానే. తోకచుక్కలు చాలావరకు నెప్ట్యూన్‌ ఆవలి క్యూపియర్‌ బెల్టులో, అంతకన్నా దూరంగా ఉండే ఊర్ట్‌ క్లౌడ్‌లో ఉంటాయి. తోకచుక్క మధ్యభాగాన్ని కోమా అంటారు. ఇది ఒకరకంగా గడ్డకట్టిన మంచు. క్యూపియర్‌ బెల్టు, ఊర్ట్‌ క్లౌడ్‌లోంచి బయటకు రానంతవరకు ఇవి ఈ స్థితిలోనే ఉంటాయి. అక్కడ్నుంచి బయటపడి, సూర్యుడి దగ్గరికి వస్తున్నకొద్దీ కొంత మంచు కరిగి, వాయువుగా మారటం మొదలవుతుంది. ఇది దుమ్ము రేణువులతో కలిసి కోమా చుట్టూ మేఘంలా ఏర్పడుతుంది. ఈ మేఘం తోకచుక్క మధ్యభాగం నుంచి విడిపోతున్నప్పుడు సూర్యుడు, సౌరగాలి, సూర్యుడి నుంచి వచ్చే రేణువులు వెనక్కి నెడతాయి. దీంతో మేఘం పొడవుగా విస్తరించి తోక మాదిరిగా కనిపిస్తుంది. ఇది లక్షలాది మైళ్ల దూరం వరకు విస్తరించి ఉంటుంది. ఒకటిగా కనిపించిన్నప్పటికీ దీనిలో రెండు వేర్వేరు తోకలు ఉంటున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. దుమ్ముతో ఏర్పడిన తోక తెల్లగా, అయాన్లతో ఏర్పడిన తోక నీలంగా ఉంటుంది. దుమ్ము తోక వెడల్పుగా, వంకరగా తిరిగితే.. అయాన్ల తోక ఎప్పుడూ సూర్యుడికి వ్యతిరేక దిశలో విస్తరించి ఉంటుంది.

రెండు రకాలు

క్యూపియర్‌ బెల్టు నుంచి వచ్చే వాటిని స్వల్పకాల తోకచుక్కలని అనుకోవచ్చు. ఇవి సూర్యుడి చుట్టూ ఒకసారి తిరిగి రావటానికి 200 ఏళ్ల కన్నా తక్కువ సమయం తీసుకుంటాయి. ఊర్ట్‌ క్లౌడ్‌ నుంచి వచ్చేవి దీర్ఘకాల తోకచుక్కలు. సూర్యుడి నుంచి లెక్కిస్తే క్యూపియర్‌ బెల్ట్‌ కన్నా ఊర్ట్‌ క్లౌడ్‌ సుమారు 50 రెట్లు ఎక్కువ దూరంలో ఉంటుంది. అందుకే ఊర్ట్‌ క్లౌడ్‌ నుంచి వచ్చే తోకచుక్కలు సూర్యుడిని చుట్టి రావటానికి ఎక్కువకాలం తీసుకుంటాయి. అతి పొడవైన కక్ష్య గల ఒక తోకచుక్క సూర్యుడిని ఒకసారి చుట్టి రావటానికి 2.5 లక్షల ఏళ్లు పడుతుంది!

భూమి దగ్గరకి ఎలా వస్తాయి?

గ్రహాలు లేదా నక్షత్రాల గురుత్వాకర్షణ ప్రభావంతో తోకచుక్కలు వాటి స్థానాల్లోంచి బయటకు వస్తుంటాయి. ఈ ఆకర్షణ వాటిని సూర్యుడి వైపు మళ్లేలా చేస్తుంది. అందుకే వీటి మార్గం చాలా పొడవుగా సాగిపోయిన అండాకారం మాదిరిగా కనిపిస్తుంది.  ఇవి సూర్యుడి వైపు వేగంగా, త్వరగా ఆకర్షితమవుతూ వస్తాయి. సూర్యుడిని చుట్టి వెనకకు వచ్చాక, తిరిగి యథాస్థానానికి ప్రయాణమవుతాయి. కొన్ని తోకచుక్కలు సూర్యుడిలోనే లీనమవుతుంటాయి కూడా. మళ్లీ ఎప్పుడూ కనిపించవు. ఇలా తోక చుక్కలు సూర్యుడి వద్దకు వస్తూ పోతున్నప్పుడు.. అంటే సౌర వ్యవస్థ లోపలికి వచ్చినప్పుడు, పోతున్నప్పుడు మనకు దర్శనమిస్తుంటాయి.

అంతరిక్షం నుంచే పరిశోధన

దుమ్ము, వాయువు ఆవరించి ఉండటం వల్ల తోకచుక్క మధ్యభాగాన్ని మనం భూమి మీది నుంచి స్పష్టంగా చూడలేం. అందుకే ఉపగ్రహాల ద్వారా పరిశీలించటం ఆరంభించారు. ఇటీవలి కాలంలో చాలా ఉపగ్రహాలు ఈ పనిలో నిమగ్నమయ్యాయి. నాసాకు చెందిన స్టార్‌డస్ట్‌ ఉపగ్రహం విల్ట్‌ టు అనే తోకచుక్క నుంచి నమూనాలు సేకరించి, భూమికి తీసుకొచ్చింది కూడా. వీటి రేణువుల్లో ప్రాణుల పుట్టుకకకు మూలమైన హైడ్రోకార్బన్లు దండిగా ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీకి చెందిన రోసెటా ఉపగ్రహం 67పీ చురీయుమోవ్‌-గెరాసిమెంకో తోకచుక్కపై అధ్యయనం చేసింది. ఇది దాని కేంద్రకం మీద ల్యాండర్‌నూ దింపింది. రెండేళ్ల వరకు తోకచుక్క చుట్టూ తిరిగింది. ఈ తోకచుక్కలోనూ హైడ్రోకార్బన్లు ఉన్నట్టు తేలింది. ఇలాంటి ఎన్నో ప్రయోగాల పుణ్యమాని తోకచుక్కల ఆకారాలు, వీటిల్లోని రసాయనాల తీరుతెన్నుల గురించి బాగా తెలుసుకోగలిగాం.


కొన్నింటి విశేషాలు

హేలీ: ఇది బాగా ప్రాచుర్యం పొందిన తోకచుక్క. 76 ఏళ్లకు ఒకసారి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. మళ్లీ మళ్లీ తోకచుక్కలు మన ఆకాశంలో ప్రత్యక్షమవుతుంటాయని తొలిసారి అర్థమైంది దీంతోనే. అప్పటివరకూ తోకచుక్కలు ఏదో ఒకసారే భూమి వైపు వస్తుంటాయని అనుకునేవారు. ఇది 2వేల సంవత్సరాల నుంచి భూమి దిశగా వస్తున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది చివరిసారిగా 1986లో మనకు కనిపించింది. మళ్లీ 2061లో కనిపిస్తుంది.


స్విఫ్ట్‌-టర్టిల్‌: దీన్ని 1862లో గుర్తించారు. ఇది 133 ఏళ్లకు ఒకసారి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. స్విఫ్ట్‌-టర్టిల్‌ పెద్ద తోకచుక్క. దీని కేంద్రకం 26 కిలోమీటర్లు ఉంటుంది. ఇది మన ఆకాశంలోకి ప్రవేశించినప్పుడు ఉల్కాపాతమూ సంభవిస్తుంది.


బోరెలీ: గుడ్డు ఆకారాన్ని పోలిన దీన్ని 1904లో కనుగొన్నారు. సుమారు 8 కిలోమీటర్ల పొడవైన కేంద్రకంతో కూడిన ఇది 6.9 సంవత్సరాలకు ఒకసారి సూర్యుడి చుట్టూ తిరిగి వస్తుంది. చివరిసారి 2015లో సూర్యుడికి అతి దగ్గరగా వచ్చింది. నాసాకు చెందిన డీప్‌ స్పేస్‌ 1 ఉపగ్రహం 2001లో దీని దగ్గరికి వెళ్లింది. తోకచుక్క కేంద్రకాన్ని స్పష్టంగా ఫొటోలు తీసింది. విలువైన సమాచారాన్ని కూడా సేకరించింది.


హేల్‌-బాప్‌: ఇది చివరిసారిగా 1997లో కనిపించింది. అప్పట్లో దీన్ని చాలామంది ఉపగ్రహంగా పొరపడటం గమనార్హం. తిరిగి 2,300 ఏళ్ల తర్వాత కనిపిస్తుంది.


ఐసన్‌: సౌర వ్యవస్థ లోపలికి మళ్లీ తిరిగిరాని తోకచుక్కల్లో ఇదొకటి. దీన్ని 2012లో గుర్తించారు. ఇది 2013లో సూర్యుడికి దగ్గరికి వచ్చినప్పుడు బాగా వేడెక్కి, ముక్కలు ముక్కలైపోయింది. దీని అవశేషాలు ప్రకాశిస్తూ చెల్లాచెదరైపోయాయి. అనంతరం మసకబారాయి. లవ్‌జాయ్‌, ఎలెనిన్‌ వంటి తోకచుక్కలూ ఇలాగే సూర్యుడి దగ్గరికి వచ్చి, కనుమరుగైపోయాయి.


ప్రత్యేకతే వేరు

తోకచుక్కలు సూర్యుడికి దగ్గరగా వచ్చే క్రమంలో వేడెక్కి, తోక ఏర్పడుతుంటుంది. సాధారణంగా ఈ ప్రక్రియ గురుగ్రహానికి సమీపంలోకి వచ్చినప్పుడు జరుగుతుంది. కానీ సి.2017 కె2 తోకచుక్కలో ఇది నెప్ట్యూన్‌ సమీపంలో ఉన్నప్పుడే మొదలైంది. సూర్య కిరణాలు తోకచుక్కలోని మంచును కరిగించలేనంత బలహీనంగా ఉన్న చోట కూడా దీని చుట్టూ వెలుగు మేఘం ఏర్పడం గమనార్హం. 225లో ఒకవంతు మాత్రమే సూర్యుడి వెలుగు పడేచోట, మైనస్‌ 440 డిగ్రీల ఫారన్‌హీట్‌ ఉష్ణోగ్రత ఉండే చోట శాస్త్రవేత్తలు దీన్ని గుర్తించారు. సూర్యుడికి చాలా దూరంలో ఉన్నా కూడా గడ్డకట్టిన కార్బన్‌మోనాక్సైడ్‌ దీన్ని చురుకుగా ఉంచుతున్నట్టు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ప్రస్తుతానికి అత్యంత ప్రకాశవంతమైన తోకచుక్క ఇదే. సౌర మండలం ఆరంభం నుంచీ గడ్డకట్టిన పదార్థాలు దీనిలో ఉన్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇది భూమికి 17 కోట్ల మైళ్ల సమీపంలోకి రానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని