మన ఇంటర్నెట్‌ పితామహుడు

మనదేశంలో మొబైల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ వాడేవారి సంఖ్య 80 కోట్లకు పైనే. అత్యంత వేగంగా డిజిటలీకరణ చెందుతున్న రెండో ఆర్థిక వ్యవస్థ మనదే. సాఫ్ట్‌వేర్‌ రంగంలోనూ ముందంజలోనే ఉన్నాô. ఐటీ సేవల ఎగుమతులు 13వేల కోట్ల డాలర్లను దాటిపోవటమే దీనికి నిదర్శనం.

Published : 27 Jul 2022 00:17 IST

మనదేశంలో మొబైల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ వాడేవారి సంఖ్య 80 కోట్లకు పైనే. అత్యంత వేగంగా డిజిటలీకరణ చెందుతున్న రెండో ఆర్థిక వ్యవస్థ మనదే. సాఫ్ట్‌వేర్‌ రంగంలోనూ ముందంజలోనే ఉన్నాô. ఐటీ సేవల ఎగుమతులు 13వేల కోట్ల డాలర్లను దాటిపోవటమే దీనికి నిదర్శనం. ఇంతటి ఘన ప్రస్థానం అంత తేలికగా సాధ్యం కాలేదు. కేవలం ఐదు పట్టణాలతోనే మనదేశంలో ఇంటర్నెట్‌ ప్రస్థానం మొదలైంది. దీనికి బీజం వేసింది ‘భారతదేశ ఇంటర్నెట్‌ పితామహుడు’ బ్రజేంద్ర కె. సింగాల్‌. అప్పట్లో అంతర్జాతీయ టెలికం రంగాన్ని శాసించిన వీఎఎస్‌ఎన్‌ఎల్‌కు అధిపతిగా వ్యవహరించిన ఆయన 1995, ఆగస్టు 15న దిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, పుణేల్లో తొలిసారి ఇంటర్నెట్‌ సేవలను ఆరంభించారు. ఈ మహత్తర ఘటనను ‘రెండో స్వాతంత్య్ర దినోత్సవం’గానూ పత్రికలు శ్లాఘించాయి. వాణిజ్యపరంగా ఇంటర్నెట్‌ సేవలను తొలిసారిగా మొదలెట్టిన ఆసియా దేశాల్లో భారత్‌ ఒకటి మరి. అయితే అప్పట్లో సింగాల్‌ను ఇది పీడకలగానే వెంటాడింది. డయల్‌-అప్‌ యాక్సెస్‌, మోడెమ్‌ల వాడకం, కనెక్టివిటీ సరిగా లేకపోవటం చిక్కులు తెచ్చిపెట్టాయి. కనెక్షన్‌లో జాప్యం, సిగ్నళ్లు బిజీగా ఉండటం, కాల్స్‌ మధ్యలో ఆగిపోవటం, ప్రతి మూడు నిమిషాలకోసారి డిస్‌కనెక్ట్‌ కావటం తలనొప్పిగా మారాయి. ఛార్జీలు కూడా చాలా ఎక్కువగా ఉండేవి. దీంతో ఆయన తప్పయిపోయిందని అందరిముందూ అంగీకరించాల్సి వచ్చింది కూడా. అయినా పట్టు వదల్లేదు. పది వారాల్లో పరిస్థితి చక్కబరుస్తానని మాట ఇచ్చారు. ఫోన్‌ విభాగాన్ని పరుగులెత్తించి కనెక్టివిటీని మెరుగు పరచారు. నాణ్యమైన పరికరాలు తయారుచేసేలా మోడెమ్‌ తయారీ సంస్థలను ప్రోత్సహించారు. రాగి తీగలకు బదులు ఫైబర్‌ కేబుల్స్‌కు మారారు. అదే సమయంలో ఛార్జీలనూ సగానికి తగ్గించేశారు. సముద్రం అడుగు నుంచి కేబుల్‌ వేయటానికి నిధులు ఇవ్వలేమని ప్రభుత్వం చేతులెత్తేసిన తరుణంలోనూ కంపెనీలతో సమావేశమై వాయిదాల చెల్లింపులకు ఒప్పించటం, విదేశ రుణాలకు భరోసా ఇప్పించి కొత్త ఉత్సాహాన్ని కలిగించారు. అలా ఇంటర్నెట్ సేవల రంగంలో ఒక హీరోలా మారారు. ఇటీవలే సింగాల్‌ మరణించారు. అయినా ఆయన వేసిన అంతర్జాల ప్రస్థానం దేశాన్ని శిఖర స్థాయికి తీసుకెళ్లింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని