అల్ట్రాసౌండ్‌ స్టికర్‌!

అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ తెలిసిందే. అవసరమైనప్పుడు స్కాన్‌ చేయించుకొని, వచ్చేస్తాం. మరి నిరంతరం స్కాన్‌ చేయాల్సి వస్తే? మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ పరిశోధకులు దీనికో వినూత్న పరిష్కారం కనిపెట్టారు. పోస్టల్‌ స్టాంపంత స్టికర్‌ను రూపొందించారు. దీన్ని చర్మానికి అతికిస్తే చాలు. రెండు రోజుల వరకు ఆగకుండా లోపలి...

Published : 03 Aug 2022 00:12 IST

ల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ తెలిసిందే. అవసరమైనప్పుడు స్కాన్‌ చేయించుకొని, వచ్చేస్తాం. మరి నిరంతరం స్కాన్‌ చేయాల్సి వస్తే? మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ పరిశోధకులు దీనికో వినూత్న పరిష్కారం కనిపెట్టారు. పోస్టల్‌ స్టాంపంత స్టికర్‌ను రూపొందించారు. దీన్ని చర్మానికి అతికిస్తే చాలు. రెండు రోజుల వరకు ఆగకుండా లోపలి అవయవాలను స్కాన్‌ చేస్తూనే ఉంటుంది. వ్యాయామం చేస్తున్నప్పుడు గుండె ఆకారం ఎలా మారుతుంది? తింటున్నప్పుడు, తాగుతున్నప్పుడు జీర్ణాశయ సంకోచ, వ్యాకోచాలు ఎలా సాగుతున్నాయి? ఇలాంటివన్నీ ఇట్టే చూసుకోవచ్చు. ఈ పట్టీలో అల్ట్రాసౌండ్‌ తరంగాలను ప్రసారం చేసే నీటి ఆధారిత హైడ్రోజెల్‌ పొర కీలకం. దీన్ని మెత్తటి ఎలాస్టోమీటర్‌ పదార్థంతో తయారుచేసిన పొరల మధ్య కూర్చి, పొడిబారకుండా చేశారు. ఈ స్టికర్‌ను 15 మందికి శరీరంలో వివిధ భాగాల్లో అంటించి పరీక్షించారు. బరువులు ఎత్తుతున్నప్పుడు, ద్రవాలు తాగుతున్నప్పుడు, సైకిల్‌ తొక్కుతున్నప్పుడు, నడుస్తున్నప్పుడు ఇది లోపలి అవయవాల చిత్రాలను స్పష్టంగా సంగ్రహించింది. దీన్ని మరింత బాగా తీర్చిదిద్దటంపై పరిశోధకులు దృష్టి సారించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని