మూలకణాలతోనే పిండాల సృష్టి!

అండం, వీర్యం లేకుండానే పిండం పుట్టుకొస్తే? బార్సిలోనాలోని పాంపే ఫాబ్రా యూనివర్సిటీ పరిశోధకులు ఇలాంటి ఘనతే సాధించారు. మొట్టమొదటిసారిగా గర్భసంచి వెలుపల.. ప్రయోగశాలలో కేవలం మూలకణాలతోనే ఎలుక పిండాలను సృష్టించటంలో విజయం సాధించారు.

Published : 10 Aug 2022 00:47 IST

అండం, వీర్యం లేకుండానే పిండం పుట్టుకొస్తే? బార్సిలోనాలోని పాంపే ఫాబ్రా యూనివర్సిటీ పరిశోధకులు ఇలాంటి ఘనతే సాధించారు. మొట్టమొదటిసారిగా గర్భసంచి వెలుపల.. ప్రయోగశాలలో కేవలం మూలకణాలతోనే ఎలుక పిండాలను సృష్టించటంలో విజయం సాధించారు. కృత్రిమ గర్భసంచి మాదిరిగా పనిచేసే ప్రత్యేకమైన బయోరియాక్టర్‌లో మూలకణాలను ప్రవేశపెట్టి, పిండాలను వృద్ధి చేశారు. వీటిని పోషకాల ద్రవంతో కూడిన చిన్న బీకర్లలో ఉంచారు. మాయలో రక్తం, పోషకాలు ప్రవహించినట్టుగా చేయటానికి ఈ బీకర్లను నిరంతరం తిరిగే మరో పరికరంలో పెట్టారు. క్రమంగా పిండాలకు గుండె, రక్త సరఫరా, మెదడు, నాడుల గొట్టం, పేగుల వ్యవస్థ వంటివన్నీ వృద్ధి చెందటం విశేషం. గర్భసంచి వెలుపల పిండాలు తమకు తాము ఎలా ఎదుగుతాయో అర్థం చేసుకోవటానికిది గొప్ప మేలి మలుపు కాగలదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తమకు తాము కలిసిపోయి అవయవాలుగా ఎదగాలనే విషయం మూలకణాలకు ఎలా తెలుసు? పిండంలో అవి ఎక్కడ, ఎలా రూపుదిద్దుకోవాలో ఎలా నిర్ణయించుకుంటాయి? అనేవి తెలుసుకోవటం మీద పరిశోధకులు ఇప్పుడు దృష్టి సారించారు. ఈ ప్రయోగంలో ఉపయోగించుకున్న కృత్రిమ గర్భసంచి ఏదో ఒకనాడు గుండె, కిడ్నీల వంటివి వృద్ధి చేయటానికీ తోడ్పడగలదని ఆశిస్తున్నారు. ఇవి అవయవ మార్పిడి కోసం ఎదురుచూసేవారికి ఎంతగానో ఉపయోగపడగలవని భావిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని