కృష్ణ పదార్థం ఎక్కడ?

ఎవరూ, ఎప్పుడూ దాన్ని చూడలేదు. కేవలం ఊహలకే పరిమితం. అయినా విశ్వంలోని పదార్థంలో 85 శాతం అదేనన్నది శాస్త్రవేత్తల అంచనా! ఇంతకీ అదేంటో తెలుసా? కృష్ణ పదార్థం (డార్క్‌ మ్యాటర్‌)! ఇదేంటన్నది కచ్చితంగా నిర్వచించలేకపోవచ్చు, వర్ణించలేకపోవచ్చు.

Updated : 17 Aug 2022 12:57 IST

ఎవరూ, ఎప్పుడూ దాన్ని చూడలేదు. కేవలం ఊహలకే పరిమితం. అయినా విశ్వంలోని పదార్థంలో 85 శాతం అదేనన్నది శాస్త్రవేత్తల అంచనా! ఇంతకీ అదేంటో తెలుసా? కృష్ణ పదార్థం (డార్క్‌ మ్యాటర్‌)! ఇదేంటన్నది కచ్చితంగా నిర్వచించలేకపోవచ్చు, వర్ణించలేకపోవచ్చు. కానీ శాస్త్రవేత్తలు దీన్ని శోధించటం మాత్రం ఆపలేదు. అతిపెద్ద, అధునాతన జేమ్స్‌ వెబ్‌ స్పేస్‌ టెలిస్కోప్‌ సైతం దీన్ని గుర్తించే పనిలో పడింది.

స్టీఫెన్స్‌ క్వింటెట్‌. ఐదు నక్షత్ర మండలాల సముదాయం. మనం మునుపెన్నడూ చూడని దీన్ని జేమ్స్‌ వెబ్‌ స్పేస్‌ టెలిస్కోప్‌ తొలిసారిగా స్పష్టంగా చిత్రీకరించింది. తొలిసారి పంపించిన చిత్రాల్లో భాగంగా దీని ఫొటోలనూ అందించింది. వీటిని చూశాక ఖగోళ శాస్త్రవేత్తలు ‘మనకు తెలియనిది ఏదో నిజంగానే ఉంది’ అని గట్టిగా అభిప్రాయపడుతున్నారు. ఆ రహస్యమయ అంశాల్లో ఒకటి కృష్ణ పదార్థం కావొచ్చని భావిస్తున్నారు. దీని గురించిన చర్చ చాలాకాలంగా నడుస్తోంది. ఒకరకంగా దీన్ని యాదృచ్ఛిక ఆవిష్కరణ అనే అనుకోవచ్చు. లార్డ్‌ కెల్విన్‌ అనే భౌతిక శాస్త్రవేత్త 19వ శతాబ్దంలో మన నక్షత్ర మండలమైన పాలపుంత ద్రవ్యరాశిని అంచనా వేయాలని అనుకున్నారు. నక్షత్ర మండలం అంతర్భాగం చుట్టూ నక్షత్రాలు తిరుగుతున్న వేగానికి సంబంధించిన సమాచారాన్ని దీనికి ఆధారంగా ఎంచుకున్నారు. అయితే ఈ సమాచారంలో ఏవో లోపాలున్నట్టు అనిపించింది. అవేంటని వర్ణించలేకపోవటం, వాటిని చూడలేకపోవటం వల్ల ‘చీకటి వస్తువులు’గా పేర్కొన్నారు.

నక్షత్రాలు చెల్లాచెదరు కావాల్సింది కానీ..

కృష్ణ పదార్థం లేకపోతే నక్షత్రాలు చెల్లాచెదరై ఉండేవా? శాస్త్రవేత్తలు ఇలాగే అనుమానిస్తున్నారు. మన నక్షత్ర మండలమైన పాలపుంత తిరగాల్సిన దానికన్నా ఎక్కువ వేగంగా తిరుగుతున్నట్టు కనిపిస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనికి ‘అదృశ్య పదార్థం’ కారణమై ఉండొచ్చని, ఇది ఇతర నక్షత్ర మండలాలకూ వర్తిస్తుండొచ్చన్నది వీరి భావన. ఒక్క పాలపుంత మాత్రమే కాదు.. నక్షత్రాలు సైతం అంచనా కన్నా ఎక్కువ వేగంతో ప్రయాణిస్తున్నాయని, ముఖ్యంగా నక్షత్ర మండలం అంచుల్లో ఇంకాస్త ఎక్కువ వేగంతో తిరుగుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది చాలా విచిత్రమైన విషయం. ఒక దారానికి రాయిని కట్టి, అతి వేగంగా గిరగిరా తిప్పారనుకోండి. గరిష్ఠ వేగాన్ని మించిన తర్వాత.. అంటే దారం ఆ రాయిని పట్టి ఉంచలేని స్థితికి చేరినప్పుడు దారం తెగిపోతుంది కదా. అప్పుడు రాయి వేగాన్ని పుంజుకొని, మరింత బలాన్ని సంతరించుకుంటుంది. అయితే నక్షత్ర మండలానికి పట్టి ఉంచే ‘దారం’ అలాగే ఉన్నప్పటికీ దీని కేంద్రం చుట్టూ నక్షత్రాలు తిరుగుతూనే ఉన్నట్టు శాస్త్రవేత్తల పరిశీలనలో తేలింది. ‘దారం’ తెగినట్టయితే నక్షత్రాలు చెల్లాచెదరై, ఎటో ఎగిరిపోయి ఉండేవన్నమాట. ఏదో ఒక అదృశ్య పదార్థం వీటిని కట్టిపడేస్తోందని, అది కృష్ణ పదార్థమే కావొచ్చన్నది ఖగోళ శాస్త్రవేత్తల వివరణ. ఇప్పటికైతే ఇది సమాధానం తెలియని ప్రశ్నే.

చూడలేకపోవచ్చు గానీ..

కృష్ణ పదార్థం మన కంటికి కనిపించదు. గుర్తించలేం కూడా. ఎందుకంటే ఇది విద్యుదయస్కాత బలాలతో ఢీకొనదు. దృశ్యకాంతి, ఎక్స్‌రేలు, రేడియో తరంగాలకూ తాకదు. కానీ కృష్ణ పదార్థం గురుత్వాకర్షణ బలం ద్వారా దీని ప్రభావాల్లో కొన్నింటిని పసిగట్టొచ్చు. ఇది కనిపించనంత మాత్రాన శాస్త్రవేత్తలు పూర్తిగా ప్రయత్నాలు మానలేదు. ఎలాగైనా దీన్ని చూడాలనే అనుకుంటున్నారు. ఇక్కడే సెర్న్‌లోని లార్జ్‌ హ్యాడ్రన్‌ కొలైడర్‌ (ఎల్‌హెచ్‌సీ) ప్రాముఖ్యత సంతరించుకుంటోంది. పదేళ్ల క్రితం దీంతోనే దైవ కణాన్ని (హిగ్స్‌ బోసన్‌ పార్టికల్‌) గుర్తించారు. ఇలా ఇది విశ్వంలోని సమస్తమూ నాలుగు ప్రాథమిక కణాలతో నిర్మితమైందని చెప్పే స్టాండర్డ్‌ మోడల్‌ ఆఫ్‌ పార్టికల్‌ ఫిజిక్స్‌ సిద్ధాంతాన్నీ రుజువు చేసింది. అలాగే కృష్ణ పదార్థం రహస్యాన్నీ ఛేదించటంలోనూ తోడ్పడగలదని గట్టిగా నమ్ముతున్నారు. కృష్ణ పదార్థం స్టాండర్డ్‌ మోడల్‌ సిద్ధాంతం పేర్కొంటున్న కణాల వంటిది కాదనీ అనుమానిస్తున్నారు.

కొత్త కొత్త సిద్ధాంతాలు

విశ్వంలో ఏవైనా అదృశ్య బలాలు ఉన్నట్టయితే ఇప్పటికే వాటిని గుర్తించి ఉండేవాళ్లమని, ఇప్పటికీ వాటిని గుర్తించలేదంటే స్టాండర్డ్‌ మోడల్‌ సిద్ధాంతానికి విభిన్నంగా ఆలోచించాల్సి ఉంటుందని కొందరు శాస్త్రవేత్తలు వాదిస్తున్నారు. మోర్డెహాయ్‌ మిల్‌గ్రోమ్‌ అనే శాస్త్రవేత్త ఏకంగా గురుత్వాకర్షణ ప్రత్యామ్నాయ సిద్ధాంతాన్ని రూపొందించారు. నక్షత్ర మండలం అంతర్భాగం నుంచి గురుత్వాకర్షణ బలం వేర్వేరు దూరాల్లో వేర్వేరుగా ప్రభావం చూపుతుందన్నది దీనిలోని కీలకాంశం. న్యూటన్‌ గురుత్వాకర్షణ సిద్ధాంతం అంతరిక్షంలో పెద్ద ఎత్తున సాగే కదలికలను వివరిస్తుంది. అయితే బలహీనంగా ఉన్నచోట (నక్షత్ర మండలం అంచుల వంటివి) ఈ బలం విభిన్నంగా ప్రవర్తిస్తుందని మిల్‌గ్రామ్స్‌ మోడిఫైడ్‌ న్యూటోనియన్‌ డైనమిక్స్‌ సూత్రం పేర్కొంటోంది. న్యూటన్‌ సిద్ధాంతం కన్నా ఇది నక్షత్ర మండలాల భ్రమణం, నక్షత్రాల వేగాలను మరింత బాగా అంచనా వేయగలదని భావిస్తున్నారు. కృష్ణ పదార్థాన్ని కనుగొంటామా? లేదా?.. మిల్‌గ్రామ్స్‌ మోడిఫైడ్‌ న్యూటోనియన్‌ డైనమిక్స్‌ సూత్రాన్ని రుజువు చేస్తామా? లేదా? అన్నది ఇంకా మనకు తెలియదు. కానీ తెలిసింది ఒక్కటే. విశ్వాన్ని అర్థం చేసుకోవటానికి మనమింకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉందనే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని