వేలిముద్రల పరిజ్ఞాన మార్గదర్శి

ధన, కనక, వస్తువులనే కాదు.. ఆంగ్లేయులు మన మేధా సంపత్తులనూ దోచుకున్నారు.  మన శాస్త్రవేత్తల ఆవిష్కరణలను తమవిగా ప్రచారం చేసుకోవటానికీ వెనకాడలేదు.

Updated : 07 Sep 2022 12:45 IST

ఖాన్‌ బహదూర్‌ ఖాజీ అజిజుల్‌ హఖ్‌

ధన, కనక, వస్తువులనే కాదు.. ఆంగ్లేయులు మన మేధా సంపత్తులనూ దోచుకున్నారు.  మన శాస్త్రవేత్తల ఆవిష్కరణలను తమవిగా ప్రచారం చేసుకోవటానికీ వెనకాడలేదు. దీంతో సర్‌ జగదీశ్‌ చంద్రబోస్‌, రాధానాథ్‌ సిక్దర్‌, కిశోరీ మోహన్‌ బంధోపాధ్యాయ్‌, హేమంత బోస్‌ వంటి ఎంతోమంది శాస్త్రవేత్తలకు లభించాల్సిన గౌరవం, గుర్తింపు దక్కకుండా పోయాయి. ఖాన్‌ బహదూర్‌ ఖాజీ అజిజుల్‌ హఖ్‌ సైతం ఇలా అన్యాయానికి గురైనవారే. వేలిముద్రల పరిజ్ఞానాన్ని ఆవిష్కరించినవారిలో ఆయన ఒకరు. కానీ ఆ కీర్తి ఆంగ్లేయుడైన సర్‌ ఎడ్వర్డ్‌ రిచర్డ్‌ హెన్రీకి దక్కింది. ఇది ఖాన్‌ బహదూర్‌ ఖాజీ అజిజుల్‌ హఖ్‌ 150వ జయంతి. ఈ సందర్భంగా ఆయన గురించి, ఆయన కృష్టి గురించి తెలుసుకుందాం.

ఖాన్‌ బహదూర్‌ ఖాజీ అజిజుల్‌ హఖ్‌ 1872లో బెంగాల్‌ ప్రెసిడెన్సీలోని ఖులానా జిల్లా పైగ్రామ్‌ కస్బా గ్రామంలో (ప్రస్తుత బంగ్లాదేశ్‌) జన్మించారు. చిన్నతనంలోనే  ఆయన తల్లిదండ్రులు పడవ ప్రమాదంలో మరణించారు. కుటుంబం ఆర్థికంగా చితికిపోయింది. పెద్దన్నయ్య ఇంటి బాధ్యతలు తీసుకున్నాడు. హఖ్‌కు లెక్కలంటే చాలా ఇష్టం. తిండి ప్రియుడు కూడా. ఒకరోజు అన్నయ్య పని ముగించుకొని ఇంటికి వచ్చాడు. హఖ్‌కు పెట్టిందే కాదు, తన పళ్లెంలోంచీ బాగానే తినేయటంతో తమ్ముడి మీద కోప్పడి, తోసేశాడు. దీన్ని అవమానంగా భావించిన హఖ్‌ ఇల్లు విడిచి వచ్చేశారు. రైలు ఎక్కి 1884లో కలకత్తాకు చేరుకున్నాడు. అతడి స్థితిని చూసి ఒక ధనవంతుడు చేరదీశాడు. ఇంటి పనులు చేస్తూ, హఖ్‌ అక్కడే ఉండేవాడు. పిల్లలకు మాస్టారు చదువు చెబుతుంటే పక్కనే కూర్చొని శ్రద్ధగా వినేవాడు. అలా లెక్కలు బాగా చేయటం నేర్చుకున్నాడు. దీనికి ఆశ్చర్యపోయిన మాస్టారు ఆ విషయాన్ని ఇంటి యజమానికి చెప్పాడు. ఆయన హఖ్‌ వివరాలు తెలుసుకొని, స్కూలుకు పంపించాడు. అలా ప్రఖ్యాత ప్రెసెడెన్సీ కాలేజీలో చేరాడు. గణితం, సైన్స్‌లో ప్రావీణ్యం సంపాదించాడు.

పోలీసు బాధ్యతల్లో భాగంగా..
అప్పట్లో సర్‌ ఎడ్వర్డ్‌ రిచర్డ్‌ హెన్రీ బెంగాల్‌ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌గా ఉండేవారు. సాంఖ్యక శాస్త్రం, సైన్స్‌ తెలిసిన ఒక విద్యార్థిని సూచించమని ప్రిన్సిపల్‌కు ఉత్తరం రాశాడు. ఆయన వెంటనే హఖ్‌ పేరును సిఫారసు చేశారు. అలా హఖ్‌ పోలీస్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా విధుల్లో చేరాడు. ఆయనతో పాటు హేమంత బోస్‌ కూడా చేరాడు. అప్పటివరకు నేరగాళ్లను గుర్తించటానికి శరీర భాగాల నిష్పత్తి కొలతల (ఆంత్రోపామెట్రీ) మీద ఆధారపడేవారు. దీని స్థానంలో వేలి ముద్రలను ప్రవేశపెట్టాలని హెన్రీ భావించారు. ఇందుకోసం ఫింగర్‌ ప్రింట్స్‌ బ్యూరోను ఆరంభించారు. వేలి ముద్రలను గుర్తించే సిస్టమ్‌ను రూపొందించటం మీద పనిచేయాలని హఖ్‌, బోస్‌లను హెన్రీ పురమాయించాడు. దీనికి హఖ్‌ గణిశాస్త్ర పునాదిని వేయగా, బోస్‌ టెలిగ్రాఫిక్‌ సంకేతాన్ని అందించారు. ఇదే చివరికి వేలి ముద్రలకు సంబంధించిన ‘హెన్రీ క్లాసిఫికేషన్‌ సిస్టమ్‌’గా పేరొందింది. దీన్ని మొదట్లో బెంగాల్‌ పోలీస్‌ విభాగంలో అమలు చేశారు. బాగా ఉపయోగపడుతుండటంతో దేశమంతటా విస్తరించారు. అప్పటికి హెన్రీ ప్రముఖ వ్యక్తి. తన క్లాసిఫికేషన్‌ వ్యవస్థ మీద పరిశోధన సదస్సుల్లో ప్రసంగించటం, పుస్తకాలు రాయటం మొదలెట్టారు. దీన్ని జీర్ణించుకోలేని హఖ్‌ తదనంతర పరిశోధన నుంచి వైదొలిగారు. బెంగాల్‌ ప్రెసిడెన్సీ నుంచి బిహార్‌ వేరయ్యాక బిహార్‌ పోలీస్‌ సర్వీస్‌లో చేరారు. ఉద్యోగ విరమణ దశలో తన కృషి గురించి ప్రభుత్వానికి నివేదించారు. ‘ద స్టేట్స్‌మన్‌’ పత్రికలో తన ప్రస్తావనతో కూడిన కథనాన్ని అందులో చేర్చారు. ప్రభుత్వం దాన్ని తిరస్కరించటమే కాదు, చివరికి హెన్రీకే దాన్ని సిఫారసు చేసింది. అప్పటికి ఆయన వయసు మీరిందేమో మనసూ మారింది. వేలిముద్రల క్లాసిఫికేషన్‌ సిస్టమ్‌లో అందరికన్నా ఎక్కువగా కృషి చేసింది హఖేనని ఎట్టకేలకు అంగీకరించారు. ఈ పద్ధతి కాల పరీక్షకు నెగ్గిందని, చాలా దేశాల అంగీకారాన్ని పొందిందని మెచ్చుకున్నారు. అలా హఖ్‌కు తగిన గుర్తింపు, గౌరవ వేతనం లభించాయి. తర్వాత బోస్‌కూ ఇలాంటి గౌరవమే దక్కింది.


సొంత గణిత సూత్రంతో..
వేలి ముద్రల తీరుతెన్నుల మీద ప్రత్యేకంగా అధ్యయనం చేయటం యూరప్‌లో 1600ల మధ్యలో ఆరంభమైంది. కానీ వీటిని వ్యక్తులను గుర్తించటానికి వాడుకోవటం 19వ శతాబ్దం మధ్యలో గానీ మొదలు కాలేదు. వేలిముద్రలు కొంతకాలం వరకు స్థిరంగా ఉంటున్నాయని, ఇవి ఒకరిలో ఒకోలా ఉంటున్నాయని సర్‌ విలియం జేమ్స్‌ హెర్షల్‌ 1859లో గుర్తించారు. హుగ్లీ జిల్లాలో ప్రధాన న్యాయమూర్తి కూడా అయిన ఆయన తొలిసారిగా వేలి ముద్రలను వ్యక్తులను గుర్తించటానికి, న్యాయ పత్రాల మీద సంతకాలకు, లావాదేవీల ధ్రువీకరణకు వాడుకున్నారు. సర్‌ ఫ్రాన్సిస్‌ గాల్టన్‌ 1892లో ‘ఫింగర్‌ ప్రింట్స్‌’ అనే పుస్తకాన్ని రాశారు. ఇందులో ప్రధానమైన మూడు రకాల వేలిముద్రల గురించి ప్రస్తావించారు. నేరగాళ్లను గుర్తించటానికి వీటిని వాడుకోవాలని హెన్రీ అనుకున్నారు. అయితే గాల్టన్‌ ప్రతిపాదించిన వ్యవస్థ హఖ్‌కు పూర్తిగా సంతృప్తి కలిగించలేదు. వేలి ముద్రలను వాటి తీరును బట్టి 32 నిలువు వరుసలు, 32 అడ్డం వరుసల్లో విభజించి ‘1024 పీజియన్‌హోల్స్‌’ సిద్ధాంతంలో ఇమిడేలా సొంత గణిత సూత్రాన్ని రూపొందించారు. దీని ఆలోచన యాదృచ్ఛికంగా పుట్టుకురావటం విశేషం. హఖ్‌ రైలులో ప్రయాణిస్తున్న సమయంలో వేలి ముద్రల వర్గీకరణకు సంబంధించిన ఆలోచన తళుక్కున మెరిసింది. దాన్ని రాసుకోవటానికి దగ్గర కాగితం కూడా లేదు. దీంతో ఆయన చొక్కా మీదే రాసుకున్నారు. ఆంత్రోపామెట్రీ కన్నా హఖ్‌ రూపొందించిన సూత్రం మెరుగ్గా పనిచేస్తుండటంతో హెన్రీ బ్రిటన్‌ ప్రభుత్వానికి సిఫారసు చేశారు. అలా నేరగాళ్లను గుర్తించటానికి వేలి ముద్రలు కొత్త సాధనంగా మారిపోయాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని