ద్రవమూ కాదు, ఘనమూ కాదు!

నీరు ద్రవ రూపంలో ఉంటుంది. గడ్డ కడితే ఘన రూపంలోకి మారుతుంది. మరి అటు ద్రవంగానూ, ఇటు ఘనంగానూ లేకపోతే? నీటిలో ఒక అణు పొర ఇలాంటి స్థితిలోనే ఉంటున్నట్టు యూనివర్సిటీ ఆఫ్‌ కేంబ్రిడ్జి పరిశోధకులు గుర్తించారు. అత్యధిక పీడనానికి గురిచేసినప్పుడు

Published : 21 Sep 2022 00:55 IST

నీరు ద్రవ రూపంలో ఉంటుంది. గడ్డ కడితే ఘన రూపంలోకి మారుతుంది. మరి అటు ద్రవంగానూ, ఇటు ఘనంగానూ లేకపోతే? నీటిలో ఒక అణు పొర ఇలాంటి స్థితిలోనే ఉంటున్నట్టు యూనివర్సిటీ ఆఫ్‌ కేంబ్రిడ్జి పరిశోధకులు గుర్తించారు. అత్యధిక పీడనానికి గురిచేసినప్పుడు ఇది గొప్ప విద్యుత్‌ వాహకంగానూ పనిచేస్తున్నట్టు తేలింది. నీటిని గడ్డ కట్టించినప్పుడు విస్తరిస్తుంది. దీని మరిగే ఉష్ణోగ్రత స్థాయి కూడా ఎక్కువే. కానీ నానోస్కేల్‌ స్థాయికి కంప్రెస్‌ చేసినప్పుడు నీటి గుణాలు గణనీయంగా మారిపోతాయి. ఈ అసాధారణ ప్రవర్తనను కచ్చితంగా అంచనా వేయటానికి శాస్త్రవేత్తలు కొత్త పద్ధతిలో పరిశోధన చేశారు. అణుస్థాయిలో నీటిలో చాలా కొత్త దశలు ఉంటున్నట్టు గుర్తించారు. ప్రయోగాత్మకంగా అతి సూక్ష్మ స్థాయిలో నీటి దశలను వర్గీకరించటం అంత తేలికైన విషయం కాదు. అయితే కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయ నేతృత్వంలోని పరిశోధకుల బృందం అధునాతన కంప్యుటేషనల్‌ పద్ధతుల సాయంతో దీన్ని సుసాధ్యం చేసింది. ఒక అణువు మందం నీటి పొరలో హెక్సాటిక్‌, సూపర్‌అయోనిక్‌ వంటి వివిధ దశలను కచ్చితంగా గుర్తించింది. హెక్సాటిక్‌ దశలో నీరు అటు ద్రవంగా, ఇటు ఘనంగా కాకుండా ఈ రెండింటికి మధ్య స్థితిలో ఉంటున్నట్టు బయటపడింది. అత్యధిక పీడన స్థితిలో ఏర్పడే సూపర్‌అయోనిక్‌ దశలో నీరు గొప్ప విద్యుత్‌ వాహకంగా మారుతుండటం గమనార్హం. అతి సూక్ష్మదశలో నీటి దశలను గుర్తించటం కొత్త పరిజ్ఞానాలకు ఉపయోగపడగలదని భావిస్తున్నారు. వైద్య చికిత్సలు సమర్థంగా పనిచెయ్యటమనేది మన శరీరంలోని సూక్ష్మ రంధ్రాల్లో పోగుపడిన నీటి ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. బ్యాటరీల కోసం అత్యధిక విద్యుత్‌వాహక గుణం గల ఎలక్ట్రోలైట్లు, నీటిలోంచి ఉప్పును తొలగించటం, ఘర్షణ లేకుండా ద్రవాల రవాణా వంటివన్నీ నీటి ప్రవర్తనను అంచనా వేయటం మీదే ఆధారపడి ఉంటాయి. ఇలాంటి రంగాల్లో నీటి ప్రవర్తనను అర్థం చేసుకోవటం ప్రధానం. తాజా అధ్యయనం వీటికి ఉపయోగపడగలదని భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని