ఆస్ట్రోశాట్‌ మహా ఘనత

భారత అంతరిక్ష టెలిస్కోప్‌ ఆస్ట్రోశాట్‌ కిరీటంలో మరో కలికి తురాయి తోడైంది. ఇది కృష్ణబిలాల పుట్టుకను 500వ సారి చూడటానికి తోడ్పడింది. అంతరిక్ష రహస్యాల్లో కృష్ణబిలాలు ఒకటి. వీటి బలమైన గురుత్వాకర్షణ నుంచి కాంతి కూడా తప్పించుకోలేదు.

Updated : 21 Sep 2022 04:41 IST

భారత అంతరిక్ష టెలిస్కోప్‌ ఆస్ట్రోశాట్‌ కిరీటంలో మరో కలికి తురాయి తోడైంది. ఇది కృష్ణబిలాల పుట్టుకను 500వ సారి చూడటానికి తోడ్పడింది. అంతరిక్ష రహస్యాల్లో కృష్ణబిలాలు ఒకటి. వీటి బలమైన గురుత్వాకర్షణ నుంచి కాంతి కూడా తప్పించుకోలేదు. వీటి మీద ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది పరిశోధనలు సాగిస్తున్నారు. చాలామంది ఇవి ఎలా పుడతాయనేది తెలుసుకోవటానికే ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. పెద్ద నక్షత్రాలు కుప్పకూలే ముందు భారీ విస్ఫోటనం జరుగుతుంది. వీటిని మినీ బిగ్‌ బ్యాంగ్‌లనీ అంటుంటారు. ఇలా నక్షత్రాలు చనిపోయే క్రమంలోనే కృష్ణబిలాలు ఏర్పడుతుంటాయి. నక్షత్ర విస్ఫోటనం జరిగినప్పుడు తీవ్రమైన కాంతి పుంజాలు, అత్యధిక శక్తితో కూడిన రేడియేషన్‌ విశ్వమంతా విస్తరిస్తుంటాయి. ఇలాంటి సమయాల్లో వెలువడే గామా, ఎక్స్‌ కిరణాల ఆధారంగా పరిశోధకులు నక్షత్ర విస్ఫోటనాలను, కృష్ణబిలాల పుట్టుకను లోతుగా అర్థం చేసుకుంటుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతి సునిశితమైన అంతరిక్ష టెలిస్కోపుల్లో ఆస్ట్రోశాట్‌ ఒకటి. దీనికి ఐదు పరికరాలు ఉంటాయి. ఇవి ఒకే సమయంలో అతి నీలలోహిత, ఆప్టికల్‌, ఎక్స్‌ రే రేడియేషన్‌ను గుర్తించగలవు. ఈ పరికరాల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కాడ్మియం జింక్‌ టెల్యురైడ్‌ ఇమేజర్‌ (సీజెడ్‌టీఐ) గురించి. ఇది గామా కిరణాల పేలుళ్లను గుర్తిస్తుంది. దీంతో అందే సమాచారాన్ని కృష్ణ బిలాల పుట్టుక అధ్యయనాల్లో వాడుకుంటుంటారు. సీజెడ్‌టీఐ ఆరున్నరేళ క్రితం కళ్లు తెరచింది. అప్పట్నుంచీ గామా కిరణాల పేలుళ్లను గుర్తిస్తూనే ఉంది. ఇది పనిచేయటం ఆరంభించిన తొలి గంటల్లోనే జీఆర్‌బీ 141006ఏను గుర్తించింది. ఇప్పుడు 500వ సారి కృష్ణ బిలం పుట్టుకను చూపించటం గొప్ప మైలురాయని ఇంటర్‌-యూనివర్సిటీ సెంటర్‌ ఫర్‌ ఆస్ట్రానమీ అండ్‌ ఆస్ట్రోఫిజిక్స్‌కు (ఐయూసీఏఏ) చెందిన ప్రొఫెసర్‌ దీపాంకర్‌ భట్టాచార్య చెబుతున్నారు. గామా కిరణాల మీద సీజెడ్‌టీఐ అందిస్తున్న సమాచారం ప్రపంచవ్యాప్తంగా గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తోందని అంటున్నారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని