అంతరిక్ష ప్రయోగాలకు ద్రవ ఉదజనే ఎందుకు?

అమెరికా అంతరిక్ష సంస్థ నాసా చంద్రుడి మీదికి పంపిస్తున్న ఆర్టెమిస్‌ 1 ప్రయోగానికి క్రయోజెనిక్‌ ట్యాంకింగ్‌ పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. కానీ ఉదజని (హైడ్రోజన్‌) లీక్‌ అవుతుండటంతో వాయిదా వేస్తూ వస్తోంది. ద్రవ ఉదజనిని పట్టి ఉంచటం

Updated : 28 Sep 2022 10:58 IST

అమెరికా అంతరిక్ష సంస్థ నాసా చంద్రుడి మీదికి పంపిస్తున్న ఆర్టెమిస్‌ 1 ప్రయోగానికి క్రయోజెనిక్‌ ట్యాంకింగ్‌ పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. కానీ ఉదజని (హైడ్రోజన్‌) లీక్‌ అవుతుండటంతో వాయిదా వేస్తూ వస్తోంది. ద్రవ ఉదజనిని పట్టి ఉంచటం అంత కష్టమైనప్పుడు అంతరిక్ష ప్రయోగాల కోసం రాకెట్‌ ఇంధనంగా దీన్నే ఎందుకు ఎంచుకుంటున్నారు?

ద్రవ ఉదజని, ద్రవ ప్రాణవాయువు (ఆక్సిజన్‌).. రెండూ క్రయోజెనిక్‌ వాయువులు. అంటే వీటిని అత్యధిక తక్కువ పీడనంలోనే ద్రవ రూపంలోకి మార్చగలమన్నమాట. కాబట్టే సాంకేతికంగా చాలా సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. ద్రవ ఉదజనిని సుమారు మైనస్‌ 217 డిగ్రీల సెల్షియస్‌ ఉష్ణోగ్రత వద్దనే నిల్వ చేయటం సాధ్యమవుతుంది. అందువల్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. రాకెట్‌ ఇంజిన్‌ నుంచి చాలా వేడి ఉత్పన్నమవుతుంది. అంతరిక్షంలోకి దూసుకెళ్లేటప్పుడు గాలి ఘర్షణ కూడా తలెత్తుతుంది. వేడిని వెదజల్లే ఇలాంటి వ్యవస్థలేవీ ద్రవ ఉదజనితో కూడిన రాకెట్‌ ఇంధన ట్యాంకులను దెబ్బతీయకుండా చూసుకోవటం చాలా ముఖ్యం. ఇలాంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉదజనితో కొన్ని ప్రత్యేకమైన లాభాలు లేకపోలేదు. మనకు తెలిసిన అన్ని పదార్థాల్లోనూ అతి తక్కువ అణు బరువు కలిగిన మూలకం ఇదే. చాలా తీవ్రంగా.. 2,600 డిగ్రీల కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతతో మండుతుంది. ద్రవ ఉదజని, ద్రవ ప్రాణవాయువు రెండూ కలిస్తే సామర్థ్యం మరింత ఇనుమడిస్తుంది. చోదకం తీసుకునే దాని కన్నా ఎక్కువ శక్తి విడుదలవుతుంది. అందుకే ద్రవ ఉదజనికి అంత ప్రాధాన్యం. ద్రవ ఉదజనిని ఇంధనంగా వాడుకునే తొలి ప్రాజెక్టును అమెరికా వాయుసేన 1956-58లో నిర్వహించింది. ఉదజని-ఇంధన విమానాన్ని తయారుచేసే ప్రయత్నంలో భాగంగా దీన్ని చేపట్టింది. అప్పట్లో దాని గురించి బయటి ప్రపంచానికి పెద్దగా తెలియదు. ఈ ప్రాజెక్టు పూర్తికాకుండానే నిలిచిపోయినప్పటికీ ఉదజనితో అంతరిక్షంలోకి ఎగిసిన మొట్టమొదటి రాకెట్‌ ఇంజిన్‌ తయారీకి దారితీసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని