చంద్రకంపనల ప్రాంతాలివిగో..
భూకంపాలపై 50 ఏళ్లుగా అధ్యయనం చేస్తున్న హైదరాబాద్‌లోని జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ (ఎన్జీఆర్ఐ) ప్రస్తుతం చంద్రుడి మీద తలెత్తే ప్రకంపనలపైనా దృష్టి సారించింది. నిజానికి చంద్రుడిపై ప్రకంపనలు వస్తాయనే సంగతి ఇంతకుముందే తెలుసు.
భూకంపాలపై 50 ఏళ్లుగా అధ్యయనం చేస్తున్న హైదరాబాద్‌లోని జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ (ఎన్జీఆర్ఐ) ప్రస్తుతం చంద్రుడి మీద తలెత్తే ప్రకంపనలపైనా దృష్టి సారించింది. నిజానికి చంద్రుడిపై ప్రకంపనలు వస్తాయనే సంగతి ఇంతకుముందే తెలుసు. అయితే వీటి ముప్పు ఎక్కడెక్కడ పొంచి ఉంటుందనేది మాత్రం కచ్చితంగా తెలియదు. ఈ నేపథ్యంలోనే ఎన్జీఐఆర్ఐ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి.సెంథిల్ కుమార్, పరిశోధక విద్యార్థి అభిషేక్ మిత్ర బృందం చంద్రుడి దక్షిణ ధ్రువంపై అధ్యయనం చేసింది. ఇప్పటివరకు ఎవరూ గుర్తించని 30 ప్రాంతాల్లో 75 టెక్టోనిక్ ఫాల్ట్స్ను 538 చిన్న భాగాలుగా విడదీసి పటం రూపొందించింది. భారత్‌తో పాటు అమెరికా వంటి దేశాలు చంద్రుడిపై మానవ సహిత, మానవ రహిత ప్రయోగాలు చేపడుతున్న తరుణంలో ఇది మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఆ పరిశోధన విశేషాలను ప్లానెటరీ జియోలజిస్టు డాక్టర్ పి.సెంథిల్ కుమార్ ‘ఈనాడు’తో పంచుకున్నారు.
దక్షిణ ధ్రువంలోనే ఎందుకు?
నాసా చేపడుతున్న ఆర్టెమిస్ ప్రయోగం చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలోనే దిగేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మూడు దశల్లో మొదటిదైన ఆర్టెమిస్1 మానవ రహిత ప్రయోగం. వివిధ కారణాలతో ఇది వాయిదా పడుతూ వస్తోంది. ఇదొక్కటే కాదు.. 2024 కన్నా ముందే మానవ రహిత ఆర్టెమిస్2 ప్రయోగాన్ని నిర్వహించాలనీ నాసా ప్రణాళిక వేసింది. అలాగే 2025లో చంద్రుడిపై గుర్తించిన 13 ప్రాంతాల్లో ఒక చోట మనిషి అడుగుపెట్టేలా ఆర్టెమిస్3 ప్రయోగాన్ని జరపాలనీ చూస్తోంది. ఇస్రో చేపడుతున్న చంద్రయాన్3 గురించి కచ్చితంగా చెప్పనప్పటికీ ఇదీ దక్షిణ ధ్రువంపైనే దిగే అవకాశం కనిపిస్తోంది. అంతరిక్ష నౌకను చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతానికి సమీపంలో దింపేందుకు, అక్కడ ప్రకంపనలను గుర్తించేందుకు సైస్మోమీటర్ను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఆ ప్రాంతంలో లూనార్ బేస్ క్యాంపు ఏర్పాటు చేసి సమాచారాన్ని భూమి మీదకు చేరవేయాల్సి ఉంటుంది. క్యాంపు ఏర్పాటుకు సురక్షితమైన ప్రాంతం అత్యంత అవసరం. చంద్రుడిపై ప్రకంపనలు వస్తాయనేది తెలిసిన విషయమే. కొన్నిచోట్ల ఫాల్ట్స్ సైతం అప్పట్లో బయటపడ్డాయి. మేం ఇటీవల జరిపిన అధ్యయనంలో ఇప్పటివరకు గుర్తించని మరిన్ని ప్రాంతాలను ఉపగ్రహ చిత్రాల ద్వారా గుర్తించాం. ఇది చంద్రుడిపై దిగేందుకు, సురక్షిత ప్రాంతాలను ఎంపిక చేసుకునేందుకు నాసాకు, ఇస్రోకు తోడ్పడుతుంది. మా అధ్యయనం ఇటీవల ప్రతిష్ఠాత్మక జర్నల్ జియోఫిజికల్ రీసెర్చ్ లెటర్స్‌లోనూ ప్రచురితమైంది.
ఎంత తీవ్రతతో ప్రకంపనలు వస్తాయి?
1969లో చేపట్టిన అపోలో మిషన్ ద్వారా తొలిసారి మానవుడు చంద్రుడిపై అడుగుపెట్టాడు. ఆ సమయంలోనే అక్కడ సైస్మోమీటర్లను ఏర్పాటు చేశారు. కానీ అవి 1977 వరకే పనిచేశాయి. సుమారు 28 చంద్ర ప్రకంపనలను గుర్తించాయి. వీటి సమాచారాన్ని బట్టి చూస్తే చంద్రుడిపై ఇప్పటివరకు అత్యధికంగా రిక్టర్ స్కేల్ మీద 4.1 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి. మరీ పెద్ద ప్రకంపనలైతే వందేళ్లకు ఒకసారి వస్తుంటాయి. వీటి ముప్పును కచ్చితంగా తెలుసుకోవాలంటే అక్కడ సైస్మోమీటర్లను ఏర్పాటు చేసి దీర్ఘకాలం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం ప్రకంపనల తీవ్రత 1 నుంచి 3 వరకు ఉన్నా అంతగా ప్రభావమేమీ ఉండదు. అదే తీవ్రత 4, అంతకన్నా ఎక్కువగా ఉంటే కొంత ప్రభావం పడొచ్చు. చంద్రుడి మీదికి మనుషులను పంపేందుకు నాసా ఎంపిక చేసిన 13 ప్రాంతాల్లో మేం అధ్యయనం నిర్వహించాం. మొత్తం ఎనిమిది ప్రాంతాల్లో 4 తీవ్రతతో కూడిన ప్రకంపనలు వచ్చే అవకాశముందని గుర్తించాం. తీవ్రత ఒక్కటే కాదు.. ప్రకంపనల లోతును బట్టీ ప్రకంపనల ప్రభావం ఆధారపడి ఉంటుంది.
ఫాల్ట్స్ ఎప్పటి నుంచి ఉన్నాయి?
ప్రకంపనల తీవ్రతను అంచనా వేయాలంటే ఫాల్ట్స్ వయసు తెలుసుకోవడం చాలా ప్రధానం. చంద్రుడిపై గుర్తించిన ఫాల్ట్స్ వయసును తొలిసారి మేమే కనుగొన్నాం. వీటి సగటు వయసు 10 కోట్ల సంవత్సరాలుగా తేల్చాం. అప్పట్నుంచే చంద్రుడు సంకోచించటం మొదలైందని భావిస్తున్నాం. ఈ సంకోచాల ఫలితంగానే ఉపరితల ఫాల్ట్స్ ఏర్పడుతున్నాయి. ఎక్కువ వయసు గల ఫాల్ట్స్‌తో ముప్పు తక్కువగా ఉంటుంది. దాదాపు 75 వరకు తక్కువ వయసున్న ఫాల్ట్స్ ఉన్నాయి. దక్షిణ ధ్రువ ప్రాంతంలో కోటి సంవత్సరాల క్రితం చంద్రుడు సంకోచించే వేగం పెరిగినట్లు కన్పించింది. ఇదే అక్కడ అనేక ఫాల్ట్స్ ఏర్పడటానికి దారితీసింది.
అంగారక గ్రహంపై ప్రయోగాలకు తోడ్పడుతుందా?
చంద్రుడిపై ఎక్కువ ఆసక్తిని చూపటానికి చాలా కారణాలే ఉన్నాయి. అంగారక గ్రహం మీదికి నేరుగా భూమి నుంచి వ్యోమగాములను పంపటం చాలా ఖర్చుతో కూడుకున్న పని. అందుకే ముందు చంద్రుడిపై అడుగు పెట్టి, అక్కడ బేస్ క్యాంపు ఏర్పాటు చేసుకోవాలని అంతరిక్ష సంస్థలు భావిస్తున్నాయి. అక్కడ పరిశోధనలకు అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటు చేసుకోగలిగితే మున్ముందు ఎంతగానో ఉపయోగపడుతుంది. అక్కడ్నుంచి అంగారక గ్రహంపైకి వ్యోమగాములను పంపటమూ తేలికవుతుందనటంలో సందేహం లేదు.
చల్లబడుతున్నకొద్దీ సంకోచం
అంతర్భాగం చల్లబడుతున్నకొద్దీ రోజురోజుకీ చంద్రుడు కుంచించుకు పోతున్నాడు. ఇలా కోట్లాది ఏళ్లుగా సుమారు 50 మీటర్ల వరకు పైగా కుంచించుకుపోయాడు. ఈ క్రమంలో చంద్రుడి మీద ముడతలు ఏర్పడు తుంటాయి. అయితే పెళుసుగా ఉండటం వల్ల ఉపరితలం విరిగిపోతుంది. అప్పుడు ఒక భాగం కిందికి మరో భాగం చొచ్చుకొని వస్తుంది. దీంతో అక్కడ ఎగుడు దిగుడులు ఏర్పడుతుంటాయి. వీటినే థ్రస్ట్ ఫాల్ట్స్ అంటారు. ఈ ఎగుడు దిగుడులు ఇంకా చురుకుగానే ఉంటున్నట్టు, ఇవి ప్రస్తుతం చంద్ర ప్రకంపనలకు కారణమయ్యే అవకాశం ఉంటున్నట్టు నాసా శాస్త్రవేత్తలు గతంలో గుర్తించారు. వీటిల్లో కొన్ని రిక్టర్ స్కేల్ మీద సుమారు 5 తీవ్రతతో కూడుకున్నవీ ఉంటున్నట్టు కనుగొన్నారు.
- మల్లేపల్లి రమేశ్‌రెడ్డి, హైదరాబాద్
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Latestnews News
Team India: టీ20 ప్రపంచకప్ 2007 ఫైనల్ ‘ఓవర్’ హీరో.. క్రికెట్‌కు వీడ్కోలు
-
Movies News
K Viswanath: విశ్వనాథ్ ‘S’ సెంటిమెంట్.. ఆ రెండు చిత్రాల విషయంలో నెరవేరని కల!
-
General News
Krishna Tribunal: కొత్త కృష్ణా ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలా? వద్దా?.. అభిప్రాయం వెల్లడించని ఏజీ
-
India News
Parliament: అదానీ ఎఫెక్ట్.. సోమవారానికి వాయిదా పడిన ఉభయ సభలు
-
World News
Putin: 80 ఏళ్ల తర్వాత.. మళ్లీ సరిహద్దుల్లో వారి ట్యాంకులు..!
-
General News
TTD: తిరుమలలో ఆటోమేటిక్ యంత్రాలతో లడ్డూ తయారీ!