భూమి అంతర్భాగంలో మహా సముద్రం!

భూమి పైపొర, దిగువ మ్యాంటిల్‌ మధ్యలోని సంధి ప్రాంతంలో పెద్దఎత్తున నీరు ఉన్నట్టు అంతర్జాతీయ అధ్యయనంలో బయటపడింది. భూమి ఉపరితలానికి 660 మీటర్ల లోతున ఏర్పడిన అరుదైన వజ్రాన్ని పరిశోధకులు విశ్లేషించి ఈ విషయాన్ని గుర్తించారు.

Published : 05 Oct 2022 00:56 IST

భూమి పైపొర, దిగువ మ్యాంటిల్‌ మధ్యలోని సంధి ప్రాంతంలో పెద్దఎత్తున నీరు ఉన్నట్టు అంతర్జాతీయ అధ్యయనంలో బయటపడింది. భూమి ఉపరితలానికి 660 మీటర్ల లోతున ఏర్పడిన అరుదైన వజ్రాన్ని పరిశోధకులు విశ్లేషించి ఈ విషయాన్ని గుర్తించారు. భూమి లోపల ఫలకాలతో పాటు సముద్రపు నీరు ఉందని చాలాకాలంగా భావిస్తున్నారు. అయితే ఇది కేవలం సిద్ధాంతానికే పరిమితమైంది. తాజా అధ్యయనంలో ఇది నిర్ధరణ అయినట్టయ్యింది. భూమి పైపొర, దిగువ మ్యాంటిల్‌ మధ్యలోని సంధి ప్రాంతంలో రింగ్‌వుడైట్‌ అనే ఖనిజం అధికంగా ఉంటుంది. ఇక్కడ వజ్రాలు ఏర్పడటం అరుదు. అందుకే గోథే యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్‌ ఫ్రాంక్‌ బ్రెంకర్‌ బృందం దీనిపై దృష్టి సారించింది. ఈ వజ్రాన్ని విశ్లేషించగా.. ఎన్నో రింగ్‌వుడైట్‌ భాగాలు కనిపించాయి. ఇవి నీటి ఆనవాళ్లను పట్టి చూపుతున్నాయి. దీనిలోని రసాయన మిశ్రమాలు మాంటిల్‌ రాయిలోని ప్రతిభాగంతోనూ సరిపోతుండటం విశేషం. అందువల్ల ఇది కచ్చితంగా మ్యాంటిల్‌ నుంచే వచ్చిందని భావిస్తున్నారు. భూమిలోని సంధి ప్రాంతం పొడిగా ఏమీ లేదని, అందులో పెద్ద మొత్తంలో నీరుందని తమ అధ్యయనంలో నిరూపించామని బ్రెంకర్‌ చెబుతున్నారు. అయితే అక్కడ నిజంగా భూమ్మీదలాంటి మహా సముద్రమేమీ లేదు. కాకపోతే ఎక్కువ నీటితో కూడిన రాయి ఉండొచ్చని భావిస్తున్నారు. సరిహద్దులు కలిసేచోట మహా సముద్రాల శిలావరణం భూమి మ్యాంటిల్‌లోకి ఒదిగిపోతుంది. ఈ శిలావరణ ఫలకాలు ఒకదాని కింద మరోటి చొచ్చుకుపోయి మ్యాంటిల్‌లో మునిగిపోతాయి. ఇవి సముద్రపు అడుగున ఉండే అవక్షేపాన్నీ భూ అంతర్భాగంలోకి తీసుకెళ్తాయని బ్రెంకర్‌ పేర్కొంటున్నారు. ఇలాంటి అవక్షేపాల్లో పెద్దమొత్తంలో నీరు, బొగ్గుపులుసు వాయువు కూడా ఉంటాయని వివరిస్తున్నారు. శిలా ఫలకాలు సంధి ప్రాంతం గుండా అతి కష్టంగా సాగుతుంటాయి. అందువల్ల అక్కడ పెద్ద ఖాళీ ప్రాంతం ఏర్పడుతుంది. యూరప్‌ అడుగున ఇలాంటి ప్రాంతం ఉంది. ఇప్పటివరకూ సంధి ప్రాంతంలోకి చొచ్చుకెళ్లే పదార్థ ప్రభావాల గురించి గానీ అక్కడ పెద్ద ఎత్తున నీరు ఉండటం గురించి గానీ తెలియదు. తాజా అధ్యయనంతో దీని గుట్టు బయటపడింది.

Read latest Technology News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని