అతి దృఢమైన పదార్థం ఇదే

అతి దృఢమైన పదార్థమేంటో తెలుసా? క్రోమియం, కోబాల్ట్‌, నికెల్‌ మిశ్రమం (సీఆర్‌సీఓఎన్‌ఐ). పరిశోధకులు ఇటీవలే దీని దారుఢ్యాన్ని పరీక్షించి నిగ్గుతేల్చారు మరి.

Updated : 21 Dec 2022 05:12 IST

అతి దృఢమైన పదార్థమేంటో తెలుసా? క్రోమియం, కోబాల్ట్‌, నికెల్‌ మిశ్రమం (సీఆర్‌సీఓఎన్‌ఐ). పరిశోధకులు ఇటీవలే దీని దారుఢ్యాన్ని పరీక్షించి నిగ్గుతేల్చారు మరి. దీన్ని విమానాలు, అంతరిక్ష నౌకల తయారీకి వాడుకోవచ్చు. పగుళ్లను ఎంతవరకు తట్టుకుంటుందనే దాన్ని బట్టి పదార్థం దృఢత్వాన్ని లెక్కిస్తారు. ఇది గట్టితనం లాంటిది కాదు. గట్టితనమనేది పదార్థం ఎంతవరకు రూపు మారకుండా ఉంటుందనటానికి కొలమానం. ఉదాహరణకు- వజ్రాన్నే తీసుకుందాం. ఇప్పటివరకు గుర్తించిన అతి గట్టి పదార్థం ఇదే. దీనికి సొట్ట పడేయలేం. కానీ పగలగొట్టొచ్చు. సాధారణంగా పదార్థాలు తక్కువ ఉష్ణోగ్రతల్లో తక్కువ దృఢత్వం కలిగుంటాయి. మరింత పెళుసుగానూ ఉంటాయి. అదే సీఆర్‌సీఓఎన్‌ఐ అయితే పరమశూన్య ఉష్ణోగ్రతకు (-273 డిగ్రీల సెంటీగ్రేడ్‌) కేవలం 20 డిగ్రీల పైన.. అంటే మైనస్‌ 253 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రత వద్ద కూడా దృఢత్వాన్ని నిరూపించుకుంది. 500 మెగాపాస్కల్స్‌ స్క్వెయర్‌ రూట్‌ మీటర్స్‌ను సాధించింది. ప్రస్తుతం విమానాల తయారీకి వాడుతున్న అల్యూమినియం దృఢత్వం కన్నా ఇది చాలా ఎక్కువ. అత్యధిక నాణ్యతతో కూడిన స్టీలు కన్నా ఎక్కువే. సీఆర్‌సీఓఎన్‌ఐ పగుళ్లు పట్టకుండా ఉండటానికి అడ్డంకులను సృష్టించుకుంటున్నట్టు పరిశోధకులు గుర్తించారు. ఇది నానోట్వినింగ్‌ ధర్మాన్నీ ప్రదర్శిస్తున్నట్టూ బయటపడింది. అంటే ఏదైనా గట్టిగా ఢీకొన్నప్పుడు మిశ్రమలోహంలోని స్ఫటికాలు ఇంకాస్త చిన్న స్ఫటికాలుగా మారతాయి. వీటిల్లో కొన్ని పక్కలకు జరిగి నిర్మాణం బలాన్ని ఇనుమడిస్తాయన్నమాట. ఇలాంటి అన్ని గుణాలను సీఆర్‌సీఓఎన్‌ఐ ఒకే సమయంలో ప్రదర్శిస్తుండటం విశేషం.

Read latest Technology News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని