చంద్రుడి అవతలి వైపు చీకటా?

చందమామను చూస్తే కలిగే ఆనందమే వేరు. ఆ చల్లటి వెన్నెల పరవశంలో ఎన్ని కథలు, కవితలు పుట్టుకొచ్చాయో! అయితే మనకు ఎప్పుడూ చంద్రుడి ఒక వైపే కనిపిస్తుంది.

Published : 18 Jan 2023 06:02 IST

చందమామను చూస్తే కలిగే ఆనందమే వేరు. ఆ చల్లటి వెన్నెల పరవశంలో ఎన్ని కథలు, కవితలు పుట్టుకొచ్చాయో! అయితే మనకు ఎప్పుడూ చంద్రుడి ఒక వైపే కనిపిస్తుంది. అవతలి వైపు కనిపించదు. అందుకే దాన్ని చీకటి భాగమనీ అభివర్ణిస్తుంటారు. నిజానికి అక్కడేమీ చీకటిగా ఉండదు. ఇవతలి వైపున పడినట్టుగానే అక్కడా ఎండ పడుతుంది. మరెందుకు కనిపించదు? దీనికి కారణం- చంద్రుడు తన కక్ష్య మీద ఒకసారి పూర్తిగా భ్రమించటానికి పట్టే సమయం, భూమి చుట్టూ తిరిగి రావటానికి పట్టే సమయం సమానంగా ఉండటమే. దీన్నే టైడల్‌ లాకింగ్‌ అంటారు. గ్రావిటేషనల్‌ లాకింగ్‌, క్యాప్చర్డ్‌ రొటేషన్‌, స్పిన్‌-ఆర్బిట్‌ లాకింగ్‌ అనీ పిలుస్తారు. దీని మూలంగానే చంద్రుడి ఒక వైపే మనకు కనిపిస్తుంది. చంద్రుడి భ్రమణం భూమి గురుత్వాకర్షణ మీద ఆధారపడి ఉంటుంది. మన సౌర వ్యవస్థలో గ్రహాల చుట్టూ భ్రమించే చంద్రుళ్లన్నీ ఇలాగే తిరుగుతూ ఉంటాయి. నిజానికి కోట్లాది సంవత్సరాల క్రితం చంద్రుడి అవతలి భాగాలూ భూమి నుంచి కనిపించాయి. ఎందుకంటే అప్పుడు చంద్రుడి భ్రమణం ఇప్పటికన్నా భిన్నంగా ఉండేది. క్రమంగా భూమి, చంద్రుడి మధ్య గురుత్వాకర్షణ బలాలు స్వల్పంగా మారిపోయాయి. ఫలితంగా కక్ష్యలు, భ్రమణ వేగాలూ తారుమారయ్యాయి. చంద్రుడి కన్నా భూమి పరిమాణం చాలా ఎక్కువ. కాబట్టి సమతుల స్థితికి చేరుకునేంతవరకు చంద్రుడి భ్రమణ వేగం నెమ్మదించింది. ఇదే టైడల్‌ లాకింగ్‌కు కారణమైంది. చంద్రుడి టైడల్‌ బలాలు భూమి భ్రమణ వేగాన్నీ నెమ్మదింపజేస్తున్నాయి. దీని మూలంగానే భూమి రోజు వ్యవధి పెరిగింది. ఇప్పటికీ చంద్రుడు ఏడాదికి 15 మైక్రోసెకండ్ల మేరకు భూమి భ్రమణ వేగాన్ని నెమ్మదింపజేస్తున్నాడు తెలుసా?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని