రోబో సాయం

మనిషికి రోబో సాయం. శాస్త్ర పరిశోధనలకే కాదు, సామాజిక అవసరాలకూ మర మనుషులు చేదోడు వాదోడుగా నిలుస్తున్నాయి.

Updated : 15 Feb 2023 06:10 IST

మనిషికి రోబో సాయం. శాస్త్ర పరిశోధనలకే కాదు, సామాజిక అవసరాలకూ మర మనుషులు చేదోడు వాదోడుగా నిలుస్తున్నాయి. ఇటీవల వార్తల్లో నిలిచిన ఈ రోబోలే దీనికి సాక్ష్యం.


తీరాల్లో ప్రాణరక్షణ

దీని పేరు ఆరస్‌. తనకు తానే నడిచే రోబో. ట్రైటన్‌ అనే ఏఐ ఆధారిత మానిటరింగ్‌ వ్యవస్థతో పనిచేస్తుంది. ఇటీవలే దీన్ని గోవా బీచ్‌లో నియమించారు. ఎందుకో తెలుసా? పర్యాటకుల ప్రాణాలు కాపాడటానికి. ఈత కొట్టటానికి అనుమతిలేని ప్రాంతాల్లో నిఘా వేయటం, పెద్ద పెద్ద అలలు వచ్చినప్పుడు హెచ్చరించటం దీని పని. కృత్రిమ మేధతో అనుసంధానమయ్యే ఆరస్‌ కెమెరా నిరంతరం చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలిస్తుంది. ముప్పులను గుర్తించి, అంచనా వేస్తుంది. ఏదైనా ప్రమాదాన్ని గుర్తిస్తే విధుల్లో ఉన్న రక్షణ సిబ్బందికి వెంటనే సమాచారాన్ని చేరవేస్తుంది.


జబ్బులను పట్టుకునేందుకు

ఇది వాసనను పసిగట్టే వినూత్న రోబో. జీవ సెన్సర్‌తో కూడిన దీన్ని ఇజ్రాయెల్‌లోని టెల్‌ అవీవ్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు రూపొందించారు. దీనికి మిడతల స్పర్శాంగాలను (యాంటెనా) జోడించటం విశేషం. ఇది జబ్బులను గుర్తించటానికి, భద్రతను మెరుగు పరచటానికి తోడ్పడగలదని భావిస్తున్నారు. మిడతలకు మంచి ఘ్రాణశక్తి ఉంటుంది. అందుకే వీటి యాంటెన్నాలను జోడించి జీవ-రోబోను సృష్టించారు. నాలుగు చక్రాలతో నడిచే దీని ఎలక్ట్రోడ్ల మధ్యన మిడత యాంటెనాను అమర్చారు. చుట్టుపక్కల వాసనలను యాంటెనా గ్రహించి, దాన్ని ఎలక్ట్రోడ్లకు అందిస్తుంది. రోబో ఎలక్ట్రానిక్‌ వ్యవస్థ దాన్ని విశ్లేషించి ఎలాంటి వాసనో గుర్తిస్తుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు