Cow: ఆవుల అపాన వాయువు మీద పన్ను!

ఆవుల అపాన వాయువు మీద పన్నా? వినటానికే విచిత్రంగా ఉన్నప్పటికీ న్యూజిలాండ్‌ దీన్నే ప్రతిపాదించింది. రైతులు పెంచే పశువుల రకాలు, వాటికి పెట్టే దాణా, కొట్టాల సంఖ్య వంటి వాటిని బట్టి రైతుల దగ్గర్నుంచి దీన్ని వసూలు చేయాలన్నది సంకల్పం.

Updated : 22 Feb 2023 10:04 IST

ఆవుల అపాన వాయువు మీద పన్నా? వినటానికే విచిత్రంగా ఉన్నప్పటికీ న్యూజిలాండ్‌ దీన్నే ప్రతిపాదించింది. రైతులు పెంచే పశువుల రకాలు, వాటికి పెట్టే దాణా, కొట్టాల సంఖ్య వంటి వాటిని బట్టి రైతుల దగ్గర్నుంచి దీన్ని వసూలు చేయాలన్నది సంకల్పం. ఇంతకీ దీని ఉద్దేశమేంటో తెలుసా? పశువుల నుంచి వెలువడే మీథేన్‌ వాయువును తగ్గించటం. భూ వాతావరణం వేడెక్కటానికి కారణమవుతున్న గ్రీన్‌ హౌజ్‌ వాయువుల్లో మీథేన్‌ రెండోది మరి. దీని ఉద్గారాలను 2050 కల్లా నికర-శూన్యానికి తగ్గించటం కోసమే న్యూజిలాండ్‌ ఇలాంటి ప్రయత్నం చేస్తోంది. నిజానికి మీథేన్‌ వాయువు వ్యవసాయం నుంచే కాదు.. సహజవాయు సరఫరా గొట్టాలు, ఇతర శిలాజ ఇంధనాల సదుపాయాలు లీక్‌ కావటం ద్వారానూ వాతావరణంలోకి విడుదలవుతుంది.

అంత హానికరమైందా?

శిలాజ ఇంధనాల నుంచి వెలువడే మీథేన్‌ మాదిరిగా ఆవుల నుంచి వెలువడే మీథేన్‌ అంత చెడ్డదా? కార్బన్‌ డయాక్సైడ్‌ కన్నా హానికరమైందా? దీనికి సమాధానాలు పునర్వినియోగ వనరులు, వర్తుల ఆర్థిక వ్యవస్థల్లో దాగున్నాయి. భూ వాతావరణం వేడెక్కటానికి కారణమవుతున్న గ్రీన్‌ హౌజ్‌ వాయువుల్లో మీథేన్‌ కన్నా ముఖ్యమైంది కార్బన్‌ డయాక్సైడ్‌. దీనికి కారణం మానవ చర్యలే. 1800ల్లో శిలాజ ఇంధనాలను మండించటం మొదలెట్టినప్పటి నుంచీ బోలెడంత కార్బన్‌ డయాక్సైడ్‌ వాతావరణంలోకి వెలువడింది. ఇది రోజురోజుకీ పెరిగిపోతూ అంతరిక్షంలోకి ఉష్ణం వెలువడకుండా అడ్డుకుంటోంది. ఫలితమే భూతాపం. కార్బన్‌ డయాక్సైడ్‌లో కొంత భాగం వాతావరణంలో వందలాది ఏళ్ల నుంచి వేలాది సంవవత్సరాల వరకూ అలాగే ఉండిపోతుంది. కానీ మీథేన్‌ వాయువు అలా కాదు. పైగా పునర్వియోగమవుతూ వస్తుంటుంది. ఆవులు, గెదేలు, ఎద్దులు, మేకలు, గొర్రెల వంటి అన్నిరకాల పశువుల నుంచి జీవసంబంధ మీథేన్‌ వెలువడుతుంది. ఇదొక చక్రంలా కొనసాగుతూ వస్తుంది. కిరణజన్య సంయోగక్రియలో భాగంగా గడ్డి, మొక్కలు వాతావరణంలోని కార్బన్‌ డయాక్సైడ్‌ను గ్రహిస్తాయి. వీటిని పశువులు, జంతువులు తిని జీర్ణం చేసుకున్నాక.. అపాన వాయువు రూపంలో లేదా ఎరువు క్షీణించే క్రమంలో మీథేన్‌ వాయువు వెలువడుతుంది. ఇది వాతావరణంలో సుమారు పదేళ్ల పాటు ఉంటుంది. అనంతరం ఆక్సీకరణ చెంది కార్బన్‌ డయాక్సైడ్‌గా మారుతుంది. దీన్ని గడ్డి, మొక్కలు తిరిగి తింటాయి. కొంత కార్బన్‌ మాంసం, చర్మం, ఉన్నిలో తాత్కాలికంగా ఉంటుంది. ఇదీ చివరికి పునర్వియోగమవుతుంది. అయితే రోజురోజుకీ పెరుగుతున్న జనాభా ఆహార అవసరాల కోసం.. ముఖ్యంగా మాంసం, పాడి కోసం ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున పశు పెంపకాన్ని కొనసాగిస్తున్నారు. ఇది మీథేన్‌ విడుదల పెరగటానికి కారణమవుతోంది.

మూడో వంతు ఇదే

మానవ చర్యలతో ఉత్పత్తి అవుతున్న మీథేన్‌ ఉద్గారాల్లో సుమారు మూడింట ఒక వంతు పశువుల నుంచే విడుదల అవుతోందని అంచనా. కార్బన్‌ డయాక్సైడ్‌తో పోలిస్తే ఇది వాతారణంలో తక్కువ కాలమే ఉండొచ్చు. కానీ వాతావరణం వేడెక్కటంలో కార్బన్‌ డయాక్సైడ్‌ కన్నా ఎక్కువ ప్రభావమే చూపుతుంది. అందుకే పశువుల నుంచి వెలువడే మీథేన్‌ను తగ్గించటం మీద దృష్టి సారిస్తున్నారు. అందులో భాగమే ఆవుల అపాన వాయువు మీద పన్ను వేయటం. ఒకరకంగా ఇది పశువుల పెంపకాన్ని తగ్గించే ప్రయత్నమే. పశువులు, గొర్రెల వంటి వాటి సంఖ్య తగ్గితే మీథేన్‌ విడుదలా తగ్గుతుంది. శిలాజ ఇంధన సదుపాయాల నుంచి వెలువడే మీథేన్‌ను తగ్గించటంతో పాటు దీని మీదా దృష్టి పెడితే కొంతవరకైనా భూ వాతావరణానికి మేలు చేస్తుంది కదా అన్నది ఆలోచన.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని