ఏఐ ప్రజెంటేషన్‌

ఏదైనా విషయాన్ని పది మందికీ వివరించటానికి ప్రజెంటేషన్లు బాగా ఉపయోగపడతాయి. అయితే వీటిని తయారు చేయటం శ్రమతో కూడుకున్న పనే. సమయమూ ఎక్కువే పడుతుంది.

Published : 07 Jun 2023 00:02 IST

ఏదైనా విషయాన్ని పది మందికీ వివరించటానికి ప్రజెంటేషన్లు బాగా ఉపయోగపడతాయి. అయితే వీటిని తయారు చేయటం శ్రమతో కూడుకున్న పనే. సమయమూ ఎక్కువే పడుతుంది. తరచూ ప్రజెంటేషన్లు ఇచ్చేవారికిది ఇబ్బందిగానూ అనిపిస్తుంటుంది. అదృష్టవశాత్తూ ఇప్పుడు కృత్రిమ మేధ (ఏఐ) సాధనాలు అందుబాటులోకి వచ్చాయి. కేవలం టెక్స్ట్‌ను అందిస్తే చాలు. మొదటి నుంచీ చివరి వరకూ మొత్తం ప్రజెంటేషన్‌ను రూపొందించి ముందుంచుతాయి. అలాంటి కొన్ని సాధనాలు ఇవిగో..

డెక్టోపస్‌ ఏఐ

ఇది ఎలాంటి ప్రజెంటేషన్లు తయారు చేయటానికైనా ఉపయోగపడుతుంది. వాడుకోవటమూ తేలికే. ప్రజెంటేషన్‌కు సంబంధించిన వివరాలను టైప్‌ చేస్తే చాలు. ఒకవేళ ప్రజెంటేషన్‌ ఎలా ఉండాలో తేల్చుకోలేకపోయినా డెక్టోపస్‌ సాయం తీసుకోవచ్చు. ఇది ప్రజెంటేషన్‌కు సంబంధించి సూచనలూ చేస్తుంది మరి. అనంతరం ప్రెజెంటేషన్‌ లక్ష్యమేంటి? ఎవరి కోసం ఉద్దేశించింది? ఎంత నిడివి ఉండాలి? ఎలాంటి టెంప్లేట్లు వాడాలి?.. ఇలాంటి ప్రశ్నలను వేస్తుంది. ఇవన్నీ ముందుగా సృష్టించిన ప్రతిస్పందనల నుంచే తీసుకుంటుంది. కానీ మనకు అవసరమైన వాటిని టైప్‌ చేయొచ్చు కూడా. వీటి ఆధారంగా మన అవసరాలకు అనుగుణమైన ప్రెజెంటేషన్‌ను రూపొందిస్తుంది. కావాలంనుకుంటే థీమ్‌లు, రంగులు మార్చు కోవచ్చు. వీటన్నింటికన్నా మించి డెక్టోపస్‌ చాలా లేఅవుట్‌లనూ సృష్టిస్తుంది. వీటిని అవసరమైనట్టుగా సరిదిద్దుకోవచ్చు. ఒకవేళ డెక్టోపస్‌ సృష్టించింది నచ్చకపోతే, మరోసారి ఏఐ సాయంతో పూర్తిగా కొత్త ప్రజెంటేషన్‌ను సృష్టించుకోవచ్చు.

స్లైడ్స్‌ఏఐ.ఐఓ

నేరుగా గూగుల్‌ స్లైడ్స్‌లోనే పనిచేసే ఏఐ ప్రజెంటేషన్‌ జెనరేటర్‌ కోసం చూస్తున్నట్టయితే స్లైడ్స్‌ఏఐ.ఐఓ మంచి ప్రత్యామ్నాయం. ఎందుకంటే ఇది గూగుల్‌ వర్క్‌స్పేస్‌ యాడ్‌ ఆన్‌ మరి. గూగుల్‌ షీట్స్‌, గూగుల్‌ డాక్స్‌ మీద ఛాట్‌జీపీటిని వాడుకోవటానికి తోడ్పడే వర్క్‌స్పేస్‌ యాడ్‌ ఆన్స్‌ ఇప్పటికే చాలా ఉన్నాయి. వీటిలాగే స్లైడ్స్‌ఏఐ.ఐఓ కూడా గూగుల్‌ స్లైడ్స్‌లో ఏఐ ఆధారిత ప్రజెంటేషన్లను సృష్టించుకోవటానికి సాయం చేస్తుంది. ఇందుకోసం మనం చేయాల్సిందల్లా కొంత టెక్స్ట్‌ను ఎంటర్‌ చేయటమే. ఉచితంగా వాడుకునేవారికి అక్షర పరిమితి ఉంటుంది. అయినా పరిమితి పెంచుకునేలా అప్‌గ్రేడ్‌ చేసుకోవచ్చు. ఎంత ఎక్కువగా టెక్స్ట్‌ను ఉపయోగిస్తే అంత కచ్చితమైన ఫలితం కనిపిస్తుంది. కావాలంటే   స్లైడ్స్‌ఏఐ.ఐఓలో కేవలం శీర్షిక సాయంతోనే ప్రజెంటేషన్‌నూ సృష్టించుకోవచ్చు.

టోమ్‌

అన్ని ఫీచర్లతో కూడిన సమగ్ర ప్రజెంటేషన్‌ టూల్‌ కోసం చూసేవారికి టోమ్‌ మంచి ఎంపిక. ప్రత్యేక థీమ్‌లు, ఫాంట్‌లు, లోగోలు వంటి ఫీచర్‌లన్నీ ఇందులో ఉన్నాయి. ప్రజెంటేషన్‌ను ఇంటరాక్టివ్‌గా మలచుకోవటానికీ టోమ్‌ వీలు కల్పిస్తుంది. అంశానికి సరిపోయే ఏఐ ఇమేజ్‌లనూ ఇది సృష్టించగలదు. అదే అంశంతో కొత్త స్లైడ్‌నూ పుట్టిస్తుంది. డాక్యుమెంట్‌ను తనకు తానే ప్రజెంటేషన్‌గానూ మార్చగలదు. అదీ చాలా వేగంగా, సమర్థంగానూ మన ముందుంచుతుంది. ప్రజెంటేషన్లను మరింత ఆకర్షణీయంగానూ తీర్చిదిద్దుతుంది.

ప్రజెంటేషన్స్‌.ఏఐ

ఇది వ్యాపారాల కోసం ప్రజెంటేష్లను రూపొందిస్తుంది. టెంప్లేట్‌ను ఎంచుకుంటే మిగతా పనంతా తనే కానిచ్చేస్తుంది. ఇందులో బోలెడన్ని టెంప్లేట్‌లు ఉంటాయి. ప్రతి ఒక్కదాన్నీ అవసరమైనట్టు మార్చుకోవచ్చు. మెరుగైన ఫలితాలను సాధించటానికి కంపెనీ ఎలాంటి ఆఫర్లు అందిస్తుందో కూడా ఏఐకి చెప్పొచ్చు. అక్కడి నుంచి ప్రజెంటేషన్స్‌.ఏఐ మొత్తం పనిని చేసేస్తుంది. టెంప్లేట్‌, స్లయిడ్ల అంశం వంటి అన్నింటినీ చక్కబెడుతుంది. ఆకర్షణీయమైన ప్రజెంటేషన్‌ను సృష్టిస్తుంది. స్లయిడ్లలో ఏదైనా నచ్చకపోతే వాటి శైలిని మార్చుకోవచ్చు. ప్రజెంటేషన్‌లో పాయింట్లను జోడించుకోవచ్చు. అవసరమనుకుంటే సవరించుకోవచ్చు కూడా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని