సైబోర్గ్‌ మిడత!

మిడతల సాయంతో నోటి క్యాన్సర్‌ గుర్తింపు. ఎక్కడి క్యాన్సర్‌, ఎక్కడి మిడతలు? ఈ రెండింటికీ సంబంధం ఏంటని అనుకుంటున్నారా? అదే మరి శాస్త్రవేత్తల గొప్పతనం!

Updated : 14 Jun 2023 06:51 IST

మిడతల సాయంతో నోటి క్యాన్సర్‌ గుర్తింపు. ఎక్కడి క్యాన్సర్‌, ఎక్కడి మిడతలు? ఈ రెండింటికీ సంబంధం ఏంటని అనుకుంటున్నారా? అదే మరి శాస్త్రవేత్తల గొప్పతనం!
స్పర్శ, వాసన, చూపు, వినికిడి, రుచి.. మనకు తెలిసిన జ్ఞానాలివే. అదీ అంతంత మాత్రమే. ఇలాంటి జ్ఞానాల విషయంలో జంతువుల, కీటకాల సామర్థ్యం ఎనలేనిది. ఉదాహరణకు- కీటకాలు వాసన ప్రపంచంలోనే జీవిస్తాయి. పరిమళాల్లో కొద్దిపాటి రసాయనాల తేడాలనైనా వీటి యాంటెనాలు పట్టేస్తాయి. మిడతలైతే ఘ్రాణశక్తిని చాలా తెలివిగా వాడుకుంటాయి. ఒకచోటు నుంచి మరో చోటుకు తరలే మిడతలు వాసన ద్వారానే కలిసి కట్టుగా ఉంటాయి, సమాచారాన్ని మార్పిడి చేసుకుంటాయి. కొన్ని పర్యావరణ పరిస్థితుల్లో మిడతలు తమ చర్మాన్ని విడుస్తాయి. ఇతర మిడతలను ఆకర్షించటానికి ఫెరమోన్స్‌ విడుదల చేస్తాయి. వీటికి ఆకర్షితం కావటం వల్లనే మిడతలన్నీ గుంపుగా చేరి, కోట్లాది సంఖ్యలో వలసపోతాయి.

వీటి దండు ఎంత దట్టంగా ఉంటుందంటే ఎండనూ నిలువరించేంత. పంటల మీద దాడి చేసి నాశనం చేసేస్తాయి. ఇవన్నీ కలిసికట్టుగా ఉండి, దాడి చేయటానికి మూల కారణం స్వల్పస్థాయిలోనూ వాసనలను పసిగట్టటం, వేర్వేరు వాసనలను గుర్తించటమే. అందుకే మిషిగన్‌ స్టేట్‌ యూనివర్సిటీకి చెందిన దేబజిత్‌ సాహా ఇటీవల నోటి క్యాన్సర్లను పసిగట్టటానికి మిడతల మీద దృష్టి సారించారు. క్యాన్సర్‌ కణాల్లో జీవక్రియలు మారినప్పుడు అవి బయటకు వచ్చే శ్వాసలో ప్రతిఫలిస్తాయి. ఇవి ఒకరకంగా క్యాన్సర్‌ జీవ సూచికలే. వీటిని గుర్తించగలిగితే క్యాన్సర్‌ ఆనవాళ్లను పట్టుకోవచ్చు. అయితే ఇవి చాలా సున్నితంగా ఉండటం, వేగంగా గాలిలో కలిసిపోవటం పెద్ద అవరోధంగా నిలుస్తోంది. మిడతల సాయంతో దీన్ని అధిగమించాలన్నది శాస్త్రవేత్తల ప్రయత్నం. మిడతల మెదడులో వాసనలను పసిగట్టే కేంద్రంలో ఎలక్ట్రోడ్లను అమర్చి, క్యాన్సర్‌ కణాల వాసన తగిలినప్పుడు వీటి మెదడులో జరిగే విద్యుత్‌ చర్యలను రికార్డు చేయటం దీనిలోని కీలకాంశం. చిన్న సీసాలో వేర్వేరు కణాలను వృద్ధి చేసి, మిడతలకు వాసన చూపించారు. అప్పుడు వాటి మెదడులో కలుగుతున్న సంకేతాల తీరుతెన్నులను రికార్డు చేశారు. ఒకో కణం వాసనకు ఒకో రకమైన విద్యుత్‌ చర్య తలెత్తుతున్నట్టు గుర్తించారు. నోటి క్యాన్సర్ల విషయంలో ప్రత్యేకమైన ఆకారం పుట్టుకొస్తున్నట్టు కనుగొన్నారు. ఈ మిడతలు ఆరోగ్యంగా ఉన్న, క్యాన్సర్‌ కణాల మధ్య తేడాలనే కాదు.. వేర్వేరు రకాల నోటి క్యాన్సర్లనూ గుర్తించటం గమనార్హం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు