జింక్‌ సూక్ష్మక్రిములు!

వరి పండించే రైతులకు శుభవార్త. పంట పొలాల్లో జింక్‌ లోపాన్ని తగ్గించటానికి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ సైన్సెస్‌-బనారస్‌ హిందూ యూనివర్సిటీ (ఏఐఎస్‌-బీహెచ్‌యూ) పరిశోధకులు వినూత్న మార్గాన్ని కనుగొన్నారు.

Published : 26 Jun 2024 00:28 IST

వరి పండించే రైతులకు శుభవార్త. పంట పొలాల్లో జింక్‌ లోపాన్ని తగ్గించటానికి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ సైన్సెస్‌-బనారస్‌ హిందూ యూనివర్సిటీ (ఏఐఎస్‌-బీహెచ్‌యూ) పరిశోధకులు వినూత్న మార్గాన్ని కనుగొన్నారు. జింక్‌ను పట్టి ఉంచగల బ్యాక్టీరియా, ఫంగస్‌ను రూపొందించారు. పొలాల్లో జింక్‌ లోపం పెద్ద సమస్య. ఆధునిక వంగడాల రాక, వరి పంట విస్తీర్ణం పెరగటంతో ఇదీ ఎక్కువవుతూ వస్తోంది. ప్రపంచంలోని సుమారు సగం నేలలు జింక్‌ లోపంతో కూడుకున్నవే. ఇలాంటి చోట్ల పండించిన తృణధాన్యాల్లో జింక్‌ మోతాదూ తక్కువగానే ఉంటుంది. సూక్ష్మ మోతాదులో అవసరమైనా ఇది మన ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తుంది. అందువల్ల నేలలో జింక్‌ లోపం మన మీదా గణనీయమైన ప్రభావం చూపుతుంది. ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రకారం జింక్‌ లోపం మూలంగా ఏటా సుమారు 8లక్షల మంది మరణిస్తున్నారు. వీరిలో 4.5లక్షల మంది ఐదేళ్లలోపు పిల్లలే. ప్రపంచ జనాభాలో మూడింట ఒక వంతు మంది జింక్‌ లోపంతో బాధపడుతున్నారని అంచనా. వరిలో జింక్‌ లోపాన్ని తగ్గించగలిగితే మనలోనూ చాలావరకు నివారించుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఏఐఎస్‌-బీహెచ్‌యూ పరిశోధకులు జింక్‌ను విచ్ఛిన్నం చేయగల 8-10 సూక్ష్మక్రిములను (బ్యాక్టీరియా, ఫంగస్‌) వేరు చేసి, వృద్ధి చెందించారు. వీటిని నానో జింక్‌ ఆక్సైడ్‌తో కలిపి మడిలో చల్లితే వరి మరింత ఎక్కువగా జింక్‌ను గ్రహించుకుంటుంది. జింక్‌ సల్ఫేట్‌ ఎరువును చల్లటంతో సమానంగా ఇది పనిచేస్తున్నట్టు పరిశోధకులు గుర్తించారు. అదీ 7 నుంచి 8 రెట్ల తక్కువ ఖర్చుతో. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని