
Gmail: జీమెయిల్లో మెయిల్స్ కనిపించడంలేదా..? ఇదిగో ఇలా చేయండి!
ఇంటర్నెట్‌డెస్క్: ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది వినియోగించే ఈ-మెయిల్ సర్వీసుల్లో జీమెయిల్ ముందుంటుంది. యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్స్‌తోపాటు సెక్యూరిటీ పరంగా యూజర్లకు భరోసా ఉండటంతో ఎక్కువ మంది మెయిల్స్ పంపేందుకు జీమెయిల్‌ను ఉపయోగిస్తుంటారు. అయితే కొన్నిసార్లు మన జీమెయిల్ యాప్‌కు వచ్చే మెసేజ్‌లు కనిపించవు. అవతలి వ్యక్తులు మెయిల్ పంపామని చెబుతుంటారు. కానీ, అవి మన మెయిల్ బాక్స్‌లో మాత్రం ఉండవు. ఎంత వెతికినా కనిపించవు.
అంతేకాదు, మరికొన్నిసార్లు మన జీమెయిల్ ఇన్‌బాక్స్ ఖాళీగా దర్శనమిస్తుంది. దీంతో మన మెయిల్‌కు వచ్చే మెసేజ్‌లు ఏమవుతున్నాయో తెలియక ఆందోళన చెందుతుంటాం. ఇన్‌బాక్స్‌ను రీఫ్రెష్ చేయడం, మెయిల్‌ను లాగవుట్ చేసి లాగిన్ కావడం, యాప్‌ను అన్ఇన్స్టాల్ చేసి తిరిగి ఇన్స్టాల్ చేయడం వంటివి చేస్తుంటాం. అయినా కూడా మీ జీమెయిల్ ఇన్‌బాక్స్‌లో మెయిల్స్ కనిపించకపోతే ఏం చేయాలో తెలుసుకుందాం.
ముందుగా ఇన్‌బాక్స్‌లో మెయిల్స్ కనిపించకపోతే ఆర్క్వైడ్, డిలీట్, స్పామ్ ఫోల్డర్స్‌లోకి వెళుతున్నాయేమో చెక్ చేయాలి. వాటిలో కూడా కనిపించకపోతే గూగుల్ చెప్పే సూచనలు ఇవే..
📩 జీమెయిల్ యాప్ ఓపెన్ చేసి మెయిల్ పంపిన వ్యక్తి పేరు లేదా మెయిల్ సబ్జెక్ట్‌తో సెర్చ్ చేయాలి. తర్వాత మీరు వెతుకుతున్న మెయిల్స్ జాబితా కనిపిస్తే అవి ఏ ఫోల్డర్లో ఉన్నాయో చూడాలి.
📩 ఒకవేళ మీకు మెయిల్స్ కనిపించకపోతే మీ కంప్యూటర్ బ్రౌజర్లో జీమెయిల్ ఓపెన్ చేయాలి. అందులో కుడివైపు పై భాగంలో సెట్టింగ్స్ ఓపెన్ చేసి ఫిల్టర్స్ అండ్ బ్లాక్డ్ అడ్రస్ బార్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
📩 ఫిల్టర్స్‌లో డిలీట్ ఇట్ లేదా స్కిప్ ఇన్‌బాక్స్ ఆప్షన్స్ అనే ఫిల్టర్స్ యాడ్ చేశారేమో చెక్ చేయండి. ఆ ఫిల్టర్స్ యాడ్ చేస్తే మీ జీమెయిల్‌కు రావాల్సిన మెయిల్స్ ఇన్‌బాక్స్‌లోకి రాకుండానే డిలీట్ అయిపోతున్నట్లే. వెంటనే ఫిల్టర్స్‌ను తొలగిస్తే యథావిధిగా మెయిల్స్ ఇన్‌బాక్స్‌లో కనిపిస్తాయి.
📩 అప్పటికీ మీకు మెయిల్స్ రాకుంటే, ఫార్వార్డ్ ఆప్షన్ ఎనేబుల్ చేశారేమో చెక్ చేయండి. ఇందుకోసం జీమెయిల్ సెట్టింగ్స్‌లో ఫార్వాడింగ్ అండ్ పీఓపీ/ఐఎమ్ఏపీ సెక్షన్‌పై క్లిక్ చేస్తే మీకు ఫార్వాడింగ్ సెక్షన్ కనిపిస్తుంది.
📩 అందులో మీ జీమెయిల్ ఇన్‌బాక్స్‌కు వచ్చే మెయిల్స్‌ను ఫార్వార్డ్ చేస్తూ వేరే మెయిల్ ఐడీ ఎంటర్ చేస్తే దాన్ని తొలగించండి. అలానే కింద ఉన్న పీఓపీ డౌన్లోడ్ సెక్షన్లో ‘కీప్ జీమెయిల్ కాపీ ఇన్ ది ఇన్‌బాక్స్’ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసి సేవ్ చేంజస్పై క్లిక్ చేయాలి. అలానే ఐఎమ్ఏపీ యాక్సెస్ సెక్షన్లో ‘డిసేబుల్ ఐఎమ్ఏపీ’ సెలెక్ట్ చేసి సేవ్ చేస్తే ఎప్పటిలానే మీ జీమెయిల్ ఇన్‌బాక్స్‌లో మెయిల్స్ కనిపిస్తాయి.
► Read latest Tech & Gadgets News and Telugu News