Android Smartphones: ఆండ్రాయిడ్ యూజర్స్‌‌.. వెంటనే ఈ యాప్‌ను తొలగించండి!

ప్లేస్టోర్‌ నుంచి గూగుల్ మరో యాప్‌ను తొలగించింది. యూజర్స్ కూడా వెంటనే ఈ యాప్‌ను డిలీట్ చేయమని సూచించింది. ఈ యాప్‌లో జోకర్ మాల్‌వేర్ ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపింది. 

Published : 20 Dec 2021 15:50 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్స్‌కు గూగుల్ కీలక సూచన చేసింది. జోకర్‌ మాల్‌వేర్ ఉన్న ఓ యాప్‌ను యూజర్స్‌ తమ ఫోన్ల నుంచి వెంటనే డిలీట్ చేయమని సూచించింది. గూగుల్ ప్లేస్టోర్‌లో కలర్‌ మెసేజ్‌ పేరుతో ఉన్న మెసేజింగ్ యాప్‌లో జోకర్ మాల్‌వేర్ ఉన్నట్లు ప్రాడియో సైబర్‌ సెక్యూరిటీ సంస్థ గుర్తించింది. ఇప్పటికే ఈ యాప్‌ను సుమారు 5 లక్షల మందికిపైగా డౌన్‌లోడ్ చేసుకున్నట్లు తెలిపింది.

గూగుల్ ప్లేస్టోర్‌లో సెక్యూరిటీ ఫీచర్స్‌ పరంగా కలర్ మెసేజ్‌ ఎంతో సురక్షితమైందని, కొత్త ఎమోజీలతో మీకు సరికొత్త ఎస్సెమ్మెస్ టెక్ట్సింగ్‌ అనుభూతిని అందించే యాప్‌గా డెవలపర్స్ పేర్కొన్నారు. అయితే యూజర్స్ ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసిన తర్వాత హ్యాకర్స్ జోకర్ మాల్‌వేర్‌ను మొబైల్‌లోకి ప్రవేశపెట్టి, యూజర్‌ ప్రమేయం లేకుండా ప్రీమియం సేవలకు సంబంధించిన సర్వీసులకు సబ్‌స్క్రైబ్ చేసుకుంటున్నారని ప్రాడియో సంస్థ వెల్లడించింది. దీని వల్ల యూజర్స్ బ్యాంకింగ్ వివరాలు బహిర్గతం అవడంతోపాటు, వ్యక్తిగత సమాచారం కూడా హ్యాకర్స్ చేతికి చేరుతోందట.

ఇప్పటికే గూగుల్ కలర్ మెసేజ్‌ యాప్‌ను ప్లేస్టోర్‌ నుంచి నిషేధించింది. ఒకవేళ యూజర్స్ ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుంటే వెంటనే డిలీట్ చేయడంతోపాటు మరో ప్రక్రియ కూడా చేయమని గూగుల్ సూచించింది. మొబైల్‌ నుంచి యాప్‌ను డిలీట్ చేసిన తర్వాత యూజర్స్ గూగుల్ ప్లేస్టోర్‌ మెనూలోకి వెళ్లి సబ్‌స్క్రిప్షన్ ఆప్షన్‌ ఓపెన్ చేయాలి. అందులో మీ ప్రమేయం లేకుండా కలర్‌ మెసేజ్‌ ద్వారా ఏవైనా ప్రీమియం సేవలకు సబ్‌స్క్రైబ్ చేసుంటే వాటికి సంబంధించిన వివరాలు కనిపిస్తాయి. వెంటనే వాటిని అన్‌-సబ్‌స్క్రైబ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేస్తేనే మీ ఫోన్ నుంచి కలర్‌ మెసేజ్‌ను పూర్తిగా తొలగించినట్లని ప్రాడియో సంస్థ తెలిపింది. 

జోకర్ మాల్‌వేర్‌ను 2017లో గుర్తించారు. ఆండ్రాయిడ్ యూజర్స్ లక్ష్యంగా హ్యాకర్స్ వివిధ యాప్‌ల ద్వారా ఈ మాల్‌వేర్‌తో దాడులు చేస్తున్నారు. ప్లేస్టోర్‌ నుంచి ఈ మాల్‌వేర్ బారిన పడిన యాప్‌లను గూగుల్ ఎప్పటికప్పుడు తొలగిస్తున్నప్పటికీ హ్యాకర్స్ కొత్తగా యాప్‌లను తీసుకొస్తూ  దాడులు చేస్తూనే ఉన్నారు. ఈ మాల్‌వేర్‌ నుంచి తప్పించుకునేందుకు యూజర్స్ కొత్త యాప్‌లను డౌన్‌లోడ్ చేసేప్పుడు అప్రమత్తంగా ఉండటంతోపాటు, యాంటీ వైరస్‌ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించమని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. 

Read latest Tech & Gadgets News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని