Sharkbot Malware: హడలెత్తిస్తున్న షార్క్‌బోట్‌ మాల్‌వేర్‌.. ఆ యాప్‌లను తొలగించమన్న గూగుల్!

ఆండ్రాయిడ్ యూజర్లకు గూగుల్, బిట్‌డిఫెండర్‌ అనే సైబర్‌ సెక్యూరిటీ సంస్థ కీలక సూచన చేశాయి. మాల్‌వేర్‌ డివైజ్‌లో ప్రవేశించకుండా ఉండేందుకు యూజర్లు తమ డివైజ్‌లలో ప్లే ప్రొటెక్ట్‌ సర్వీస్‌ను ఎనేబుల్‌ చేసుకోవాలని సూచించాయి. 

Updated : 27 Nov 2022 16:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: యూజర్‌ డేటా లక్ష్యంగా సైబర్‌నేరగాళ్లు మరో కొత్త మాల్‌వేర్‌ను యాప్‌ల ద్వారా ప్లేస్టోర్‌లోకి ప్రవేశపెట్టారు. బిట్‌డిఫెండర్‌ అనే సైబర్‌ సెక్యూరిటీ సంస్థ ఈ మాల్‌వేర్‌ వివరాలను వెల్లడించింది. షార్క్‌బోట్‌ (Sharkbot) పేరుతో పిలిచే ఈ మాల్‌వేర్‌ను ఆరు యాప్‌ల ద్వారా ప్లేస్టోర్‌లోకి ప్రవేశపెట్టినట్లు బిట్‌డిఫెండర్‌ తెలిపింది. ఎక్స్‌-ఫైల్‌ మేనేజర్‌ (X-File Manager), ఫైల్‌వాయోజర్‌ (FileVoyager), ఫోన్‌ఏఐడీ (PhoneAID), క్లీనర్‌ (Cleaner), బూస్టర్‌ 2.6 (Booster 2.6), లైట్‌ క్లీనర్‌ ఎమ్‌ (LiteCleaner M) అనే యాప్‌లలో ఈ మాల్‌వేర్‌ ఉన్నట్లు పేర్కొంది.

ఎలాంటి అనుమానం రాకుండా...

వీటి గురించి గూగుల్‌కు సమాచారం అందించేలోపే వేల మంది యూజర్లు డౌన్‌లోడ్ చేసుకున్నారని తెలిపింది. యూజర్లు వెంటనే ఈ యాప్‌లను తమ డివైజ్‌ల నుంచి డిలీట్ చేయమని గూగుల్, బిట్‌ డిఫెండర్‌ సూచించాయి. ప్లేస్టోర్‌ నుంచి కూడా వీటిని తొలగించినట్లు గూగుల్ ప్రకటించింది. ఈ యాప్‌లలో మొదటి మూడు ఫైల్‌ మేనేజ్‌మెంట్‌ కేటగిరీకి చెందినవి కాగా, మిగిలిన మూడు ఫోన్‌ క్లీనింగ్ యాప్‌లు. యూజర్లు వీటిని డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఎలాంటి అనుమానం రాకుండా.. యూజర్‌ డేటాకు సంబంధించిన వివరాలు సేకరించేందుకు అనుమతులు కోరుతున్నాయని బిట్‌డిఫెండర్‌ వెల్లడించింది. ఈ యాప్‌లకు ఫోన్‌ డేటా యాక్సెస్‌కు అనుమతులు లభించాక యూజర్‌ బ్యాంకింగ్ వివరాలతోపాటు, ఇతర యాప్‌ల లాగిన్ వివరాలు సేకరిస్తున్నట్లు గుర్తించామని సైబర్‌ సెక్యూరిటీ సంస్థ తెలిపింది.

ఈ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకున్న యూజర్లు వెంటనే తమ డివైజ్‌లనుంచి తొలగించి, బ్యాంకింగ్‌తోపాటు, ఇతర యాప్‌ల లాగిన్‌, పాస్‌వర్డ్‌ వివరాలు మార్చుకోమని సూచించింది. ఇలాంటి యాప్‌ల నుంచి తప్పించుకునేందుకు యాజర్లు ప్లే ప్రొటెక్ట్‌ సర్వీస్‌ (Play Protect Services)ను ఎనేబుల్‌ చేసుకోవడంతోపాటు, ఆండ్రాయిడ్ యాంటీవైరస్‌ యాప్‌లను డివైజ్‌లో యాక్టివ్‌లో ఉంచుకోవాలని సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు సూచిస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని