Google: ఇకపై ఆ ఫోన్లలో జీఎమ్‌ఎస్‌ పనిచేయదన్న గూగుల్.. ఎందుకంటే?

ఆండ్రాయిడ్ ఫోన్లకు సంబంధించి గూగుల్ కీలక ప్రకటన చేసింది. 1జీబీ ర్యామ్‌తో పనిచేస్తున్న ఫోన్లకు గూగుల్‌ మొబైల్‌ సర్వీసెస్‌ సేవలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది...

Published : 13 Sep 2022 15:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆండ్రాయిడ్ ఫోన్లకు సంబంధించి గూగుల్ (Google) కీలక ప్రకటన చేసింది. 1జీబీ ర్యామ్‌తో పనిచేస్తున్న ఫోన్లకు గూగుల్‌ మొబైల్‌ సర్వీసెస్‌ ( GMS) సేవలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. ఈ ప్రకటనతో ఆండ్రాయిడ్ లైట్‌ వెర్షన్‌ ‘ఆండ్రాయిడ్ గో’ (Android Go) ఓఎస్‌ 1జీబీ ర్యామ్‌ ఫోన్లలో పనిచేయదు. తక్కువ ర్యామ్‌ సామర్థ్యం కలిగిన బడ్జెట్‌ ఫోన్ల కోసం గూగుల్ ఆండ్రాయిడ్ గో ఓఎస్‌ను తీసుకొచ్చింది. సాధారణ ఆండ్రాయిడ్‌లో ఉండే అన్ని రకాల యాప్‌లు గో ఓఎస్‌లో లైట్‌ వెర్షన్‌లో అందుబాటులో ఉంటాయి. గతంలో బడ్జెట్‌ ఫోన్లు 1జీబీ ర్యామ్‌/8జీబీ ఇంటర్నల్‌ మెమొరీతో విడుదలయ్యేవి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆండ్రాయిడ్‌ గో ఓఎస్‌  పనిచేయాలంటే 2 జీబీ ర్యామ్‌/ 16 జీబీ మెమొరీ తప్పనిసరి. ఈ నేపథ్యంలో 1జీబీ ర్యామ్‌ ఫోన్లకు జీఎమ్‌ఎస్‌ సేవలను నిలిపివేస్తున్నామని గూగుల్ తెలిపింది.

గూగుల్ త్వరలో ఆండ్రాయిడ్ లేటెస్ట్‌ వెర్షన్‌ను ఆండ్రాయిడ్ 13 ఓఎస్‌ను విడుదల చేయనుంది. దీంతోపాటు ఆండ్రాయిడ్ 13 గో వెర్షన్‌ను కూడా తీసుకురానుంది. భద్రత, గోప్యత పరంగా ఈ ఓఎస్‌లో అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లు యూజర్లకు అందుబాటులోకి రానున్నాయి. సాధారణ ఆండ్రాయిడ్ ఓఎస్‌ పనిచేయాలంటే తప్పనిసరిగా 4 జీబీ ర్యామ్‌ సామర్థ్యం ఉండాలి. అలానే గో వెర్షన్‌కు 2జీబీ ర్యామ్‌ తప్పనిసరి. ప్రస్తుతం మార్కెట్‌లో విడుదలయ్యే స్మార్ట్‌ఫోన్లలో ఎక్కువ శాతం మోడల్స్‌లో 8జీబీ ర్యామ్‌ ఉంటుంది. దీంతో ఆండ్రాయిడ్ గో వెర్షన్‌ ర్యామ్‌ సామర్థ్యాన్ని 2 జీబీకి పెంచుతూ గూగుల్ నిర్ణయం తీసుకుంది. ఆండ్రాయిడ్‌ 14 విడుదలనాటికి ఇది 3 జీబీకి మారుతుందని టెక్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు మొబైల్‌ పనితీరు వేగంగా ఉండటం కోసం ఫీచర్లు, ఓఎస్‌లలో ఎప్పటికప్పుడు మార్పులు చేస్తున్న నేపథ్యంలో భవిష్యత్తులో ఆండ్రాయిడ్ గో వెర్షన్‌ నిలిపివేయొచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని