Google Maps: స్మార్ట్‌వాచ్‌లలో గూగుల్ మ్యాప్స్‌.. ఎలాగంటే?

గూగుల్‌ మరో కొత్త ఫీచర్‌తో యూజర్ల ముందుకు రానుంది. ఫోన్‌ అవసరం లేకుండా గూగుల్ మ్యాప్స్‌ను ఉపయోగించుకునే కొత్త ఫీచర్‌ను పరిచయం చేయనుంది. ఈ మేరకు బుధవారం జరిగిన శాంసంగ్‌ అన్‌ప్యాక్డ్‌ ఈవెంట్‌లో వివరాలను వెల్లడించింది.

Updated : 12 Aug 2022 15:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొత్త ప్రాంతానికి వెళ్లేటప్పుడు దారి తెలియకపోతే గూగుల్‌ మ్యాప్‌ (Google Maps)ను ఆశ్రయిస్తాం. టోల్‌ రోడ్‌, ట్రాఫిక్‌ రూట్స్‌ అంటూ ఇలా సమగ్రంగా రూట్‌ మ్యాప్‌ను చూపిస్తుండటంతో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది గూగుల్ మ్యాప్స్‌ను ఉపయోగిస్తున్నారు. ఇటీవలే స్ట్రీట్‌ వ్యూ, ఆఫ్‌లైన్‌ ఫీచర్లను కూడా పరిచయం చేసింది. తాజాగా గూగుల్‌ మరో కొత్త ఫీచర్‌తో యూజర్ల ముందుకు రానుంది. ఫోన్‌ అవసరం లేకుండా గూగుల్ మ్యాప్స్‌ను ఉపయోగించుకునే కొత్త ఫీచర్‌ను పరిచయం చేయనుంది. ఈ మేరకు బుధవారం జరిగిన శాంసంగ్‌ అన్‌ప్యాక్డ్‌ ఈవెంట్‌లో వివరాలను వెల్లడించింది. యూజర్‌ స్మార్ట్‌ఫోన్‌ను ఇంట్లో లేదా ఆఫీస్‌లో మర్చిపోయినా.. స్మార్ట్‌వాచ్‌ సాయంతో మ్యాప్స్‌ను ఉపయోగించుకోవచ్చని తెలిపింది. స్మార్ట్‌వాచ్‌ల కోసం గూగుల్ అభివృద్ధి చేసిన వేర్ ఓఎస్‌ (Wear OS)లో ఈ ఫీచర్‌ అందుబాటులోకి రానుంది. ముందుగా ఈ ఫీచర్‌ను శాంసంగ్‌ గెలాక్సీ వాచ్‌ 5 సిరీస్‌ (Samsung Galaxy Watch 5 Series) మోడల్‌లో అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు సమాచారం. ఈ ఫీచర్‌ కేవలం శాంసంగ్‌ స్మార్ట్‌వాచ్‌లలో మాత్రమే పనిచేస్తుందా? లేదా వేర్‌ ఓఎస్‌తో పనిచేస్తున్న అన్ని రకాల మోడల్స్‌లో పనిచేస్తుందా? అనే విషయంపై స్పష్టత లేదు. 

ప్రస్తుతం స్మార్ట్‌వాచ్‌లు బ్లూటూత్‌ ద్వారా మొబైల్‌కు కనెక్ట్‌ అయితేనే వాటిలో మ్యాప్స్‌ పనిచేస్తాయి. గూగుల్ ప్రకటించిన దాని ప్రకారం నెట్‌వర్క్‌ కనెక్టివిటీ అవసరం లేకుండా మ్యాప్స్‌ కావాలంటే మాత్రం స్మార్ట్‌వాచ్‌లో ఈ-సిమ్‌ లేదా నానో సిమ్‌ ఫీచర్‌ను పరిచయం చేయాలి. ఇప్పటి వరకు మార్కెట్లో అందుబాటులో ఉన్న స్మార్ట్‌వాచ్‌ మోడల్స్‌లో ఈ ఫీచర్‌ అందుబాటులో లేదు. ఇటీవల గూగుల్ తీసుకొచ్చిన స్ట్రీట్ వ్యూ ఫీచర్‌తో 360 డిగ్రీ కోణంలో వీధులని చూస్తూ వర్చువల్‌గా స్థానిక ప్రాంతాల్లోని వ్యాపారాలు, కంపెనీలను సందర్శించడానికి వీలవుతుంది. ఇక గూగుల్ మ్యాప్స్‌ అవైడ్‌ టోల్స్‌ ఫీచర్‌తో టోల్ గేట్‌లో చెల్లించాల్సిన మొత్తాన్ని ముందే తెలుసుకోవచ్చు. దాంతోపాటు టోల్‌ కట్టకుండా ఇతర రూట్లు ఎంచుకునే వెసులుబాటు ఉంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని