Goolge Play Store: ఈ 50 యాప్‌లను గూగుల్ తొలగించింది.. మీరూ డిలీట్ చేయండి!

గూగుల్ ప్లేస్టోర్‌లో 50 యాప్‌లలో జోకర్‌ మాల్‌వేర్‌, ఫేస్‌స్టీలర్‌, కోపర్‌ మాల్‌వేర్‌లను గుర్తించినట్లు జెడ్‌స్కాలర్‌ అనే సైబర్‌ సెక్యూరిటీ సంస్థ వెల్లడించింది... 

Published : 21 Jul 2022 20:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: యూజర్‌ డేటా భద్రత కోసం ఇటీవలే గూగుల్ ప్లేస్టోర్‌ (Google Play Store)లో డేటా సేఫ్టీ (Data Safety) నిబంధనను అమల్లోకి తీసుకొచ్చింది. ఈ నిబంధన ప్రకారం యాప్‌లు యూజర్‌ను ఎలాంటి సమాచారం సేకరిస్తున్నాయి? దాన్ని ఎవరితో పంచుకుంటున్నాయనేది తెలియజేయాలి. దీంతో యూజర్లు సదరు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలా? వద్దా? అనే నిర్ణయం తీసుకుంటారు. వీటితో పాటు మాల్‌వేర్‌ యాప్‌లను ఎప్పటికప్పుడు తొలగిస్తూ యూజర్ల సమాచారం సైబర్‌ నేరగాళ్ల చేతికి చిక్కకుండా చర్యలు చేపడుతోంది. అయినప్పటికీ సైబర్‌ నేరస్థులు కొత్త మార్గాల్లో డేటా చౌర్యానికి పాల్పడుతున్నారు. తాజా సమాచారం ప్రకారం గూగుల్ ప్లేస్టోర్‌లో 50 యాప్‌లలో జోకర్‌ మాల్‌వేర్‌ (Joker Malware), ఫేస్‌స్టీలర్‌ (Facestealer), కోపర్‌ (Coper) మాల్‌వేర్‌లను గుర్తించినట్లు జెడ్‌స్కాలర్‌ (Zscaler) అనే సైబర్‌ సెక్యూరిటీ సంస్థ వెల్లడించింది. వీటి గురించి గూగుల్‌కు సమాచారం అందించడంతో ప్లేస్టోర్‌ నుంచి వాటిని తొలగించినట్లు తెలిపింది. యూజర్లు కూడా వెంటనే ఈ యాప్‌లను తమ ఫోన్ల నుంచి డిలీట్ చేయమని సూచించింది. 

జోకర్‌ మాల్‌వేర్‌

జోకర్ మాల్‌వేర్‌ను ఫ్లీసీవేర్‌గా చెబుతారు. యూజర్‌ ఏదైనా యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసినప్పుడు వారి ఫోన్లలోకి ప్రవేశిస్తుంది. దీని సాయంతో హ్యాకర్స్‌ యూజర్‌ ప్రమేయం లేకుండా ప్రీమియం సర్వీసులను సబ్‌స్క్రైబ్‌ చేసుకుంటారు. ఈ మాల్‌వేర్ సాయంతో యూజర్‌ ఫోన్‌కు ఎస్సెమ్మెస్‌ల ద్వారా వచ్చే ఓటీపీలను తెలుసుకుని పేమెంట్‌ ప్రక్రియను పూర్తి చేస్తారని సైబర్ సెక్యూరిటీ సంస్థలు తెలిపాయి. యూజర్‌ బ్యాంక్‌ స్టేట్‌మెంట్‌ చెక్‌ చేసుకుంటే తప్ప తమ ఖాతాలో నగదు ఖాళీ అయినట్లు తెలియదట. 

ఫేస్‌స్టీలర్

ఈ మాల్‌వేర్‌ సాయంతో హ్యాకర్స్‌ యూజర్‌ సోషల్‌ మీడియా సమారం సేకరిస్తారు. వాటి ద్వారా యూజర్‌ క్రెడిట్‌ కార్డ్‌, బ్యాంకు ఖాతాలకు సంబంధించిన సమాచారం సేకరించి బ్యాంక్‌ ఖాతాలను ఖాళీ చేస్తారు. సోషల్‌ ఇంజనీరింగ్ ద్వారా యూజర్‌ సోషల్‌ మీడియా డేటాను ఇవి రష్యన్‌ సర్వర్లకు చేరవేస్తున్నట్లు గుర్తించామని సైబర్ సెక్యూరిటీ సంస్థలు తెలిపాయి. 

కోపర్‌ మాల్‌వేర్‌

దీని ద్వారా హ్యాకర్లు ముందుగా యూజర్ల డివైజ్‌లలో ఎంటర్‌ చేసే ఎస్సెమ్మెస్‌ టెక్ట్స్‌, లాగింగ్‌ టెక్ట్స్‌ వివరాలను సేకరిస్తారు. వాటి ద్వారా మాల్‌వేర్ ఎస్సెమ్మెస్‌ టెక్ట్స్‌లను పంపుతాయి. యూజర్‌ వాటిపై క్లిక్ చేసినప్పుడు వారి డేటా మొత్తం హ్యాకర్ల సర్వర్లలోకి చేరిపోతుంది. 

ప్లేస్టోర్‌ నుంచి డిలీట్‌ చేసిన యాప్‌ల జాబితా కోసం క్లిక్ చేయండి..

మాల్‌వేర్‌ నుంచి రక్షణ ఎలా?

యాప్‌ల ద్వారా మాల్‌వేర్‌ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు అవసరమైన యాప్‌లను మాత్రమే ఇన్‌స్టాల్ చేసుకోవాలని సైబర్‌ సెక్యూరిటీ సంస్థలు సూచిస్తున్నాయి. కొత్తగా ఏదైనా యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసే ముందు వాటి రివ్యూలను చదవమని చెబుతున్నాయి. అలానే యాప్‌ డెవలపర్‌ ఎవరు? అవి యూజర్‌ నుంచి ఎలాంటి సమాచారం సేకరిస్తున్నాయనేది తెలుసుకోవాలి. ఇందుకోసం యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసేముందు కిందకు స్క్రోల్ చేసి డేటా సేఫ్టీలోకి వెళితే యాప్‌లు సేకరిస్తున్న సమాచార వివరాలు కనిపిస్తాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని