Google Banned Apps: ప్లే స్టోర్‌ నుంచి 12 లక్షల యాప్స్‌ నిషేధం.. గూగుల్‌ ప్రకటన!

హానికరమైన యాప్స్‌ నుంచి యూజర్లకు మెరుగైన భద్రత కల్పించడం కోసం 12 లక్షల యాప్‌లను నిషేధించినట్లు గూగుల్‌ ప్రకటించింది.

Published : 30 Apr 2022 02:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: హానికరమైన యాప్స్‌ నుంచి యూజర్లకు మెరుగైన భద్రత కల్పించడం కోసం 12 లక్షల యాప్‌లను నిషేధించినట్లు గూగుల్‌ ప్రకటించింది. పాలసీలకు విరుద్ధంగా ఉన్న యాప్‌లను గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి తొలగించినట్లు వెల్లడించింది. అంతేకాకుండా 2021లో మోసపూరిత, స్పామ్‌ డెవలపర్‌లను నియంత్రించడానికి 1.90 లక్షల అకౌంట్లను బ్యాన్‌ చేసినట్లు తెలిపింది. దీంతోపాటు ఇన్‌యాక్టివ్‌గా ఉన్న దాదాపు 5 లక్షల ఖాతాలను నిలిపి వేసినట్లు గూగుల్‌ నివేదించింది.

వైరస్‌, మాల్‌వేర్‌ ఇతర సమస్యలు ఉన్నప్పుడు గూగుల్‌ కొన్ని యాప్స్‌ను ప్లే స్టోర్‌ నుంచి తొలగిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే యూజర్ల భద్రతా కారణాల దృష్ట్యా వీటిని నిషేధించినట్లు గూగుల్‌ తన బ్లాగ్‌ పోస్టులో వివరించింది. ‘‘మాల్‌వేర్‌, హానికరమైన సాఫ్ట్‌వేర్‌ల నుంచి యూజర్లకు రక్షణ కల్పించడానికి బిలియన్ల కొద్దీ ఇన్‌స్టాల్‌ చేసుకున్న యాప్‌లను ఎప్పటికప్పుడు స్కాన్‌ చేస్తూనే ఉన్నాం’’ అని పేర్కొంది. 

సెర్చ్‌ దిగ్గజం గూగుల్‌ యూజర్ల డేటా సేఫ్టీ కోసం మే నెలలో ఒక ప్రత్యేక విభాగాన్ని ప్రారంభించింది. యాపిల్‌ గోప్యత విభాగం ‘న్యూట్రిషన్ లేబుల్స్‌’ (nutrition labels) తరహాలోనే ఇది పనిచేస్తుంది. దీనిలో గూగుల్‌ ప్లే స్టోర్‌లోని యాప్స్‌లో గోప్యత, భద్రతా హక్కులకు సంబంధించిన సమాచారాన్ని తప్పనిసరిగా యాప్‌ డెవలపర్స్‌ నమోదు చేయాల్సి ఉంటుంది. డెవలపర్‌లు యాప్‌నకు సంబంధించిన గోప్యత సమాచారాన్ని జులై 20లోపు  సమర్పించాలని గూగుల్‌ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. 

ఇదిలా ఉండగా.. నిషేధిత యాప్‌లు ఇంకా మీ ఫోన్‌లో ఉన్నాయో లేదో తెలుసుకోవాలంటే గూగుల్‌/యాప్‌ స్టోర్‌లోకెళ్లి యాప్‌ల వివరాలు సరిచూసుకోవాలని టెక్ నిపుణులు సూచిస్తున్నారు. వాటిలో కనిపించినట్లయితే అవి నిషేధిత యాప్‌ కాదని చెబుతున్నారు. ప్లే స్టోర్‌లలో కనిపించకపోతే మొబైల్స్‌ నుంచి ఆ యాప్‌ను వెంటనే డిలీట్ చేయాలని హెచ్చరిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని