Google: గూగుల్‌ డ్రైవ్‌ నుంచి అదిరే ఫీచర్‌.. యూజర్ల భద్రతకు పెద్దపీట

వినియోగదారుల భద్రతకు పెద్దపీట వేస్తూ డేంజర్ ఫైల్స్‌ నుంచి రక్షణ కల్పించడానికి ‘గూగుల్‌ డ్రైవ్‌’ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇది ఎలా పనిచేస్తుందంటే..

Published : 24 Jan 2022 02:01 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వినియోగదారుల భద్రతకు పెద్దపీట వేస్తూ డేంజర్ ఫైల్స్‌ నుంచి రక్షణ కల్పించడానికి ‘గూగుల్‌ డ్రైవ్‌ (Goole Drive)’ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. అక్టోబర్‌లో జరిగిన క్లౌడ్‌ నెక్స్ట్‌ 2021లో గూగుల్‌ ఈ ఫీచర్‌పై ప్రకటన చేయగా.. ఎట్టకేలకు 2022లో అందరికి అందుబాటులోకి తీసుకొస్తోంది.

చాలా మంది వినియోగదారులు పలు సైట్ల నుంచి డాక్యుమెంట్లను డౌన్‌లోడ్‌ చేసుకొని వాటిని గూగుల్‌ డ్రైవ్‌ ద్వారా ఓపెన్‌, షేర్‌ చేయడం చేస్తుంటారు. మరికొందరు నేరుగా జీమెయిల్‌లో గూగుల్‌ డ్రైవ్‌తో లింక్‌ చేసిన ఫైల్స్‌ను ఓపెన్‌ చేస్తుంటారు. పైగా ఆండ్రాయిడ్‌ మొబైల్స్‌లో గూగుల్‌ డ్రైవ్‌ డిఫాల్ట్‌గా ఇన్‌స్టాల్‌ చేసి రావడంతో.. దీని వినియోగం గతంలో కంటే బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో సైబర్‌ కేటుగాళ్లు పలు అనుమానాస్పద ఫైల్స్‌తో డివైస్‌లోకి స్పైవేర్‌లను జొప్పించే ప్రమాదం ఉంది. తద్వారా యూజర్ల వ్యక్తిగత డేటా తస్కరించే వీలుంటుంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని గూగుల్‌ డ్రైవ్‌ తాజా అప్‌డేట్‌తో కంటెంట్ నుంచి రక్షణ కల్పిస్తుంది. 

కొత్త ఫీచర్‌ ఎలా పనిచేస్తుందంటే..!

డిఫాల్ట్‌గా ఎనేబుల్ చేసిన ఈ ఫీచర్‌ని ఆన్ చేయాల్సిన పనిలేదు. యాప్‌లో డేంజర్‌ లేదా అనుమానాస్పద డాక్యుమెంట్‌‌, ఫొటోను ఓపెన్‌ చేయగానే.. గూగుల్‌ వేగంగా స్కాన్‌ చేసి వెంటనే వినియోగదారులను అప్రమత్తం చేస్తుంది. ఈ మేరకు స్క్రీన్‌ పైభాగంలో పసుపు హెచ్చరిక బ్యానర్‌ను చూపుతుంది. వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించే ప్రమాదం ఉందని ఆ బ్యానర్‌పై సందేశం పంపుతుంది. అయితే, ఈ ఫీచర్‌ ఇటీవలే ప్రారంభించడంతో అందరికీ అందుబాటులోకి రావటానికి కొంతం సమయం పట్టే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని