Google: గూగుల్ కీలక నిర్ణయం.. ఇకపై వీడియో కాలింగ్‌కు ఒకటే యాప్‌

వీడియో కాలింగ్‌తో పాపులర్‌ అయిన రెండు ముఖ్యమైన యాప్‌లను ఇక మీదట ఒకటే యాప్‌గా మారనున్నాయా.. అంటే అవుననే అంటోంది గూగుల్‌. త్వరలో మీట్‌, డ్యుయో యాప్‌లను కలిపేస్తున్నట్లు గూగుల్‌ తన బ్లాగ్‌లో పేర్కొంది.

Published : 02 Jun 2022 17:43 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: వీడియో కాలింగ్‌తో పాపులర్‌ అయిన రెండు ముఖ్యమైన యాప్‌లను ఇక మీదట ఒకటే యాప్‌గా మారనున్నాయా.. అంటే అవుననే అంటోంది గూగుల్‌. త్వరలో మీట్‌, డ్యుయో యాప్‌లను కలిపేస్తున్నట్లు గూగుల్‌ తన బ్లాగ్‌లో పేర్కొంది. వ్యక్తిగత, బిజినెస్‌ యూజర్లకు గూగుల్ ఒకే ఫ్లాట్‌ఫామ్‌ నుంచి సేవలందించనుంది. దీంతో యూజర్లకు ఇక మీదట గూగుల్ డ్యుయో అందుబాటులో ఉండదు. అలానే గూగుల్ మీట్ ఫీచర్లతోపాటు డ్యుయో ఫీచర్లు కూడా అదనంగా అప్‌డేట్‌ అవుతాయి. డ్యుయో పేరును మీట్‌గా మార్చిన తర్వాత కూడా ఉచిత సేవలను పొందుతున్న యూజర్లు ఎలాంటి రుసుమూ చెల్లించాల్సిన అవసరంలేదని గూగుల్‌ వెల్లడించింది.

ఇప్పటి వరకు గూగుల్ డ్యుయోలో అందుబాటులో ఉన్న ఫన్‌ ఫిల్టర్‌, ఎఫెక్ట్స్‌, మెసేజెస్‌, గూగుల్ అసిస్టెంట్, ఫోన్‌ నంబర్‌, ఈ-మెయిల్‌తో వీడియో కాల్ చేసుకునే ఫీచర్లు.. ఇక మీదట మీట్‌లో ఉపయోగించుకోవచ్చు. వీటితోపాటు కొత్తగా మీటింగ్ మధ్యలో చాటింగ్‌, లైవ్‌ క్యాప్షన్స్‌, వర్చువల్ బ్యాక్‌గ్రౌండ్‌ ఫీచర్లు యూజర్లు అందుబాటులోకి వస్తాయి. అలానే యూజర్లకు మెరుగైన వీడియో, ఆడియో కాలింగ్‌ అనుభూతిని పొందవచ్చు. డ్యుయో యాప్‌ మీట్‌గా ఆటోమేటిగ్గా అప్‌డేట్‌ అవుతుందని గూగుల్ వెల్లడిచింది.

గూగుల్ 2016లో డ్యుయో యాప్‌ను పరిచయం చేసింది. తర్వాతి కాలంలో ఫేస్‌టైమ్‌కు పోటీగా ఇందులో మార్పులు చేశారు. డ్యుయోలో వన్‌ టు వన్‌ వీడియో కాల్స్‌ చేసుకోవచ్చు. తర్వాతి కాలంలో వీడియో కాలింగ్ పరిమితిని 18కి పెంచారు. తాజాగా మీట్‌తో కలవనుండటంతో వీడియో కాలింగ్‌లో ఒకేసారి వంద మంది పాల్గొనవచ్చని గూగుల్‌ తెలిపింది. అయితే ఈ ఫీచర్లు యూజర్లు అందరికీ అందుబాటులోకి వస్తాయా? లేక జీ సూట్‌ సబ్‌స్క్రైబర్స్‌కు మాత్రమే అందుబాటులో ఉంటాయా? అనేది తెలియాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని