Updated : 30 Dec 2021 16:17 IST

Year Ender 2021 : ఈ ఏడాదిలో గూగుల్‌ మెచ్చిన 10 ఎక్స్‌టెన్షన్లు ఇవే!

ఎలాంటి టెన్షన్‌ లేకుండా బ్రౌజింగ్‌ పూర్తవ్వాలంటే... ఎక్స్‌టెన్షన్స్‌ ఉండాల్సిందే. ఇవేంటి కొత్తగా అనుకోవద్దు. చాలా రోజుల నుంచి అందుబాటులో ఉన్నవే. డెస్క్‌టాప్‌ / ల్యాప్‌టాప్‌ వాడేవాళ్లకు సుపరిచితమే. మొబైల్‌లో యాప్స్‌ ఎలాగో... సిస్టమ్‌లో బ్రౌజర్‌ ఎక్స్‌టెన్షన్లు అలాంటివన్నమాట. 2021 ఇంకొన్ని రోజుల్లో ముగిసిపోతున్న తరుణంలో... ఈ ఏడాదిలో బెస్ట్‌ ఎక్స్‌టెన్షన్స్‌ జాబితాను మీ ముందుంచుతున్నాం. అన్నట్లు ఇవి గూగుల్‌ మెచ్చినవే. మరి ఈ ఎక్స్‌టెన్షన్లు ఎలా పని చేస్తాయి, తదితర వివరాలు ఓ లుక్కేయండి.

స్క్రీన్‌ రికార్డ్‌ సులభంగా...

బ్రౌజర్‌ ఆ వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేశాక... ఫలానా వెబ్‌ సైట్‌ ఓపెన్‌ చేసి... అలా చేయాలి, ఇలా చేయాలి అని చెప్పే బదులు ఎలా చేయాలో చూపించొచ్చుగా? మీకు ఎవరైనా ఇలా అడిగారా! అయితే ఈ ఎక్స్‌టెన్షన్‌ మీకు భలేగా ఉపయోగపడుతుంది. దాని పేరు ‘లూమ్‌’.  స్క్రీన్‌ రికార్డరర్‌ సాఫ్ట్‌వేర్‌లు, ఎక్స్‌టెన్షన్‌లు చూసే ఉంటారు. అయితే ఇది వాటి కంటే ప్రత్యేకం. మీరు రికార్డు చేసిందంతా...  క్లౌడ్‌లో సేవ్‌ అవుతుంది. దాని లింక్‌ను మీకు కావాల్సిన వ్యక్తికి పంపిస్తే... అతను ఎంచక్కా యూట్యూబ్‌లో వీడియో చూసినట్లే, చూసేయొచ్చు. కావాల్సిన వివరాలు తెలుసుకోవచ్చు. 

మీ మాటలు.. ఎక్కడైనా

మనసులో విషయాన్ని చెప్పడానికి ఒక్కోసారి మాటలే సులభంగా ఉంటాయి. రాతల్లో అంత సౌకర్యవంతంగా విషయం చేరవేయలేకపోవచ్చు. మరోవైపు ఇప్పుడు ఉద్యోగం, విద్య అన్నీ గూగుల్‌ డాక్స్‌, షీట్స్‌, జీమెయిల్‌, క్లాస్‌ రూమ్‌, ఫామ్స్‌లోనే సాగిపోతుంది. వాటికి రిప్లైలు టెక్స్‌ రూపంలో కాకుండా మాటల రూపంలోనూ ఇవ్వొచ్చు. దీని కోసం ‘మోట్‌’ ఎక్స్‌టెన్షన్‌ చక్కగా ఉపయోగపడుతుంది. ఈ ఎక్స్‌టెన్షన్‌ను యాక్టివ్‌ చేసి... చెప్పాలనుకున్న విషయాన్ని రికార్డు చేయాలి.  ఆ తర్వాత ఆ ఆడియోకు ఓ లింక్‌ జనరేట్‌ అవుతుంది. దాన్ని మీరు పంపాలనుకున్నవారికి సెండ్‌ చేసేయొచ్చు. వాళ్లు క్లిక్‌ చేసి వినేయొచ్చు.

తప్పులు పడుతుంది...

వేగంగా రాస్తున్నప్పుడు కొన్ని అక్షర దోషాలు వచ్చేస్తాయి. అలాగే అన్వయ దోషాలు పడుతుంటాయి. వీటికి చెక్‌ పెట్టడానికి చాలామంది గ్రామర్లీ సర్వీసు వాడుతుంటారు. దానికి అదనపు హంగులు అందిస్తూ ‘వర్డ్‌ ట్యూన్‌’ అనే సర్వీసు ఉంది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ)తో ఇది పని చేస్తుంది. మీరు రాసిన టెక్స్ట్‌లో అక్షర దోషాలు, అన్వయ దోషాలను సరిచేయడంతోపాటు... కొన్ని పదాలకు పర్యాయ పదాలనూ సూచిస్తుంది. ఒక్కోసారి వాక్యం మొత్తం మార్చే అవకాశం ఉంటే అదీ చెబుతుంది. అయితే ఈ సర్వీసు ఇంకా తెలుగులోకి రాలేదు. 

ఉపయోపగడే అడవి

ఓ పది నిమిషాలు ఈ బిజీ బ్రౌజింగ్‌ లైఫ్‌కి రెస్ట్‌ దొరికితే బాగుండు... అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఒకవేళ దొరికినా ఏవేవో సోషల్‌ మీడియాలు, సరదా వెబ్‌సైట్లు చూసేస్తున్నారా? అయితే మీకు మీరు సమయం ఇచ్చుకోవడానికి ఓ ఎక్స్‌టెన్షన్‌ ఉంది. అదే ‘ఫారెస్ట్‌’. ఈ ఎక్స్‌టెన్షన్‌ను యాక్టివ్‌ చేయగానే మట్టిలో చిన్న మొక్క ఉన్నట్లుగా ఓ ఇమేజ్‌ వస్తుంది. ఎంత సేపు నెట్‌ వాడొద్దు అనుకుంటున్నారో అంత సమయం అక్కడ ఇచ్చి యాక్టివ్‌ చేయాలి. ఆ తర్వాత అంతసేపూ సిస్టమ్‌ వాడకూడదు. ఒకవేళ వాడితే అందులో మొక్క పెరగదు. ఇది మీకు మీరు కంట్రోల్‌ చేసుకోవడాన్ని అలవాటు చేసే ఎక్స్‌టెన్షన్‌. 

కళ్లకు చల్లగా...

మొబైల్స్‌లో మొదలైన డార్క్‌ మోడ్‌ ఆప్షన్‌... ఇప్పుడు సిస్టమ్స్‌కు కూడా వచ్చేసింది. దీని వల్ల కళ్లకు వెలుతురుతో వచ్చే ఇబ్బంది తగ్గుతుంది అని నిపుణులు చెబుతుంటారు. ఇప్పటికే చాలా మంది ఈ ఫీచర్‌ను వాడుతూనే ఉన్నారు. ఈ ఫీచర్‌ను ఆన్‌ చేస్తే లైట్‌ కలర్‌లో ఉన్నవి బ్లాక్‌/గ్రే అయిపోతాయి. బ్లాక్‌లో ఉన్న అక్షరాలు వైట్‌ అయిపోతాయి. అయితే ఈ ఫీచర్‌ అన్ని వెబ్‌సైట్లలో అందుబాటులో లేదు. అయినప్పటికీ మీకు డార్క్‌ మోడ్‌ కావాలి అంటే... ‘డార్క్‌ రీడర్‌’ ఎక్స్‌టెన్షన్‌ ఇన్‌స్టాల్‌ చేయాల్సిందే. ఇది ఇన్‌స్టాల్‌ చేసి యాక్టివ్‌ చేయగానే... మీరు చూస్తున్న వెబ్‌పేజీలో డార్క్‌ మోడ్‌లోకి వెళ్లిపోతుంది. 

రైలు పెట్టెల్లా పేరుకుంటే...

ఏదో పని ఉండి బ్రౌజర్‌లో సెర్చ్‌ చేస్తూ వెళ్లారు. కాసేపయ్యాక చూస్తా... బ్రౌజర్‌ ట్యాబ్‌లన్నీ రైలు పెట్టెల్లా నిండిపోయాయి. అందులో మనకు కావాల్సింది వెతుక్కోవడం అంత ఈజీ కాదు. అలాంటప్పుడు ‘ట్యాబ్‌ మేనేజర్‌ ప్లస్’ ఎక్స్‌టెన్షన్‌ బాగా ఉపయోగపడుతుంది. బ్రౌజర్‌లో ఓపెన్‌ అయి ఉన్న ట్యాబ్‌ల వివరాలు ఐకాన్ల రూపంలో, లిస్ట్‌ రూపంలో ఒక బాక్స్‌లో చూపెడుతుంది. అక్కడి నుంచి సులభంగా మీకు కావాల్సిన ట్యాబ్‌ క్లిక్‌ చేయొచ్చు. అలాగే ట్యాబ్‌ క్లోజ్‌, పిన్‌, మినిమైజ్‌ లాంటివి చేసుకోవచ్చు. బ్రౌజర్‌లో మ్యాగ్జిమమ్‌ ఎన్ని ట్యాబ్‌లు ఓపెన్‌ చేయొచ్చు అనేదీ ఇక్కడ ఫిక్స్‌ చేయొచ్చు. ట్యాబ్‌ హైడ్‌ లాంటి ఆప్షన్లూ ఉన్నాయి. 

ఎడిట్‌ చేసి పంపేలా...

సిస్టమ్‌ బ్రౌజర్‌లో స్క్రీన్‌ షాట్‌ కొట్టి... దానిని వేరే ఎవరికైనా పంపాలి అంటే సెండ్‌ చేసేయొచ్చు. అదే అందులో మార్కింగ్‌ వేసి పంపాలన్నా, మొత్తం కాకుండా కాస్త భాగమే పంపాలంటే మళ్లీ ఆ స్క్రీన్‌షాట్‌ని ఏ పెయింట్‌ సాఫ్ట్‌వేర్‌లోనో, ఫొటోషాప్‌లోనే పేస్ట్‌ చేసి ఎడిట్‌ చేయాలి. అలా కాకుండా ఇన్‌ బిల్ట్‌ బేసిక్‌ ఎడిట్‌ ఆప్షన్లతో కూడా ఓ స్క్రీన్‌షాట్‌ సౌకర్యం ఉంది. అదే ‘నింబస్‌ స్క్రీన్‌ షాట్‌ అండ్‌ స్క్రీన్‌ వీడియో రికార్డర్‌’. ఇందులో స్క్రీన్‌షాట్‌ను రకరకాల ఫార్మాట్లలో సేవ్‌ చేయొచ్చు. గిఫ్‌గా కూడా సేవ్‌ చేయొచ్చు. స్క్రీన్ రికార్డర్‌ సౌకర్యమూ ఉందని ఎక్స్‌టెన్షన్‌ పేరులోనే తెలిసిపోతోంది.

క్లాసుల్లో ఉపయోగపడేలా...

పిల్లలకు ఆన్‌లైన్‌ క్లాస్‌లో బాగా ఉపయోగపడుతున్న గూగుల్‌ టూల్ క్లాస్‌రూమ్‌. వర్చువల్‌ సాగే క్లాసుల్లో దీని వినియోగం బాగా పెరిగింది. అలాంటి గూగుల్‌ క్లాస్‌రూమ్‌ వెబ్‌ పేజీలో మీరు మార్కింగ్‌ చేయడం, స్టికీ నోట్స్‌ అతికించడం లాంటి పనులు చేయాలి అనుకుంటున్నారా? అయితే ‘ఇన్‌సర్ట్‌ లెర్నింగ్‌’ మీకు ఉపయోగపడుతుంది. ఈ ఎక్స్‌టెన్షన్‌ ఇన్‌స్టాల్‌ చేసుకున్నాక... మీ స్క్రీన్‌ మీదకు హైలైటర్‌, నోట్స్‌ లాంటి ఆప్షన్లు ఉన్న ప్యానల్‌ ఒకటి ఎడమ వైపున వస్తుంది. ఆ ఆప్షన్ల సాయంతో హైలైట్‌ చేసి... ఆ లింక్‌ను అవతలి వ్యక్తికి లింక్‌ రూపంలో పంపించేయొచ్చు.

కొత్త భాషల కోసం...

కొత్త భాషలు నేర్చుకోవాలని అనుకుంటున్నారా? అయితే మీకు ‘టౌకెన్‌’ ఎక్స్‌టెన్షన్‌ బాగా ఉపయోగపడుతుంది. ఏదైనా వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేస్తే అందులో కొన్ని ఎంపిక చేసిన పదాలను మీరు కోరుకున్న భాషలోకి ఆటోమేటిక్‌గా ట్రాన్స్‌లేట్‌ చేసి చూపిస్తుంది ఈ ఎక్స్‌టెన్షన్‌. ఉదాహరణకు ఇంగ్లిష్‌ టెక్స్ట్‌ ఉన్న వెబ్‌ పేజీకి టౌకెన్‌ యాక్టివేట్‌ చేసి మీరు  హిందీ భాష ఎంచుకుంటే... ఆ వెబ్‌ పేజీలోని కొన్ని ముఖ్యమైన పదాలు హిందీలో కనిపిస్తాయి. వాటి మీద మౌస్‌ పెడితే... ఆ పదాలకు ఇంగ్లిష్‌ అర్థం, ఒరిజినల్‌ పదం  కనిపిస్తాయి. అలా వివిధ అంతర్జాతీయ భాషలను కూడా మార్చి తెలుసుకోవచ్చు. 

ఆఫర్లు చెప్పేస్తుంది... 

ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేసేటప్పుడు కూపన్‌ కోడ్‌లు, ధరల తగ్గింపు వివరాల కోసం తరచుగా వెతుకుతుంటారా? అయితే మీరు ‘రకుటెన్‌’ ఎక్స్‌టెన్షన్‌ బాగా ఉపయోగపడుతుంది. ఈ ఎక్స్‌టెన్షన్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకున్నాక... ఆన్‌లైన్‌ షాపింగ్‌ పోర్టల్స్‌లో డిస్కౌంట్లు, ఆఫర్ల గురించి చెబుతుంది. ఈ - కామర్స్‌ పోర్టల్స్‌లో ఏదైనా వస్తువు కొనేటప్పడు... దానికి కూపన్‌ కోడ్స్‌ని ఆటోమేటిక్‌గా అప్లై చేసేస్తుంది. ఆన్‌లైన్‌ సర్వీసుల సబ్‌స్క్రిప్షన్లలో కూపన్లు, డిస్కౌంట్లు ఉన్నా ఈ ఎక్స్‌టెన్షన్‌ తెలియజేస్తుంది. అయితే ఈ సర్వీసు కొన్ని ఈకామర్స్‌ వెబ్‌సైట్లకే అందుబాటులో ఉంది. 

డౌన్‌లోడ్‌... ఇన్‌స్టాల్‌

యాప్‌లకు ప్టేస్టోర్‌ ఉన్నట్లే... ఎక్స్‌టెన్షన్లకు కూడా ఓ స్టోర్‌ ఉంటుంది. దాని పేరు వెబ్‌ స్టోర్‌. క్రోమియం సాంకేతికతో పని చేసే బ్రౌజర్లలో ఈ స్టోర్‌ అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం క్రోమ్‌, ఎడ్జ్‌, ఒపెరా, బ్రేవ్‌ బ్రౌజర్లు క్రోమియం సాంకేతికతతో పని చేస్తున్నాయి. వెబ్‌ స్టోర్‌లో ఎక్స్‌టెన్షన్‌ సెర్చ్‌ చేశాక, యాడ్‌ టు బ్రౌజర్‌ క్లిక్‌ చేయాలి. ఆ తర్వాత ఆ ఎక్స్‌టెన్షన్‌ డౌన్‌లోడ్‌ అయ్యి... మీ బ్రౌజర్‌లోకి యాడ్‌ అవుతుంది. ఆ తర్వాత టాప్‌లో అడ్రెస్‌ బార్‌ పక్కన ‘ఎక్స్‌టెన్షన్‌ ఐకాన్‌’లోకి వచ్చి చేరుతుంది. అక్కడ క్లిక్‌ చేసి వాడుకోవచ్చు. 

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Read latest Technology News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :
వీక్షకులకు గమనిక
ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు/ సేవల గురించి ఈనాడు సంస్థకి ఎటువంటి అవగాహనా ఉండదు. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి, జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు/ సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు.

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని