Google Chrome: క్రోమ్‌ కొత్త ఫీచర్‌.. ఇకపై ఆ వెబ్‌ నోటిఫికేషన్లకు చెక్‌!

వెబ్‌సైట్‌ నోటిఫికేషన్లు యూజర్‌ బ్లాక్‌ చేసిన తర్వాత కూడా కొన్ని వెబ్‌సైట్లు నోటిఫికేషన్లు పంపేందుకు అనుమతి కోరుతుంటాయి. అలాంటి వాటికి చెక్‌ పెట్టేందుకు క్రోమ్‌ బ్రౌజర్‌లో గూగుల్ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది.

Published : 06 Jun 2022 00:06 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది యూజర్లు బ్రౌజింగ్‌ కోసం గూగుల్ క్రోమ్‌నే ఉపయోగిస్తుంటారు. అయితే బ్రౌజింగ్ చేసేప్పుడు వెబ్‌సైట్లు నోటిఫికేషన్లు పంపేందుకు యూజర్‌ నుంచి అనుమతి కోరుతుంటాయి. యూజర్లు అనుమతించిన వెంటనే ఆయా వెబ్‌సైట్లలోని కంటెంట్‌కు సంబంధించిన నోటిఫికేషన్లు వస్తుంటాయి. ఒకసారి నోటిఫికేషన్లకు అనుమతించిన తర్వాత వెబ్‌సైట్ల నుంచి బయటకు వచ్చినా కూడా అందులోని కంటెంట్‌కు సంబంధించి పాప్‌-అప్‌ నోటిఫికేషన్లు వస్తూనే ఉంటాయి. 

కొన్ని వెబ్‌సైట్లు మాత్రం యూజర్లు అనుమతించే వరకు పాప్‌-అప్ విండో ద్వారా నోటిఫికేషన్లకు అనుమతి కోరుతూనే ఉంటాయి. ఒకవేళ నోటిఫికేషన్లు వద్దనుకుంటే బ్లాక్‌ చేయడం లేదా అనుమతి నిరాకరిస్తే సరిపోతుంది. అయితే కొన్ని వెబ్‌సైట్లు మాత్రం చేసిన బ్లాక్‌ చేసిన తర్వాత కూడా పాప్‌-అప్‌ విండో ద్వారా నోటిఫికేషన్లు పంపేందుకు అనుమతి కోరుతుంటాయి. అలాంటి వాటికి చెక్‌ పెట్టేందుకు క్రోమ్‌ బ్రౌజర్‌లో గూగుల్ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. 

ఈ ఫీచర్‌తో నోటిఫికేషన్లను బ్లాక్‌ చేసిన తర్వాత కూడా సదరు వెబ్‌సైట్‌ యూజర్‌కు నోటిఫికేషన్‌ పంపే ప్రయత్నం చేసినా లేదా సదరు వెబ్‌సైట్‌ హానికరమైందని క్రోమ్‌ గుర్తించినా బ్రౌజర్‌లో పాప్‌-అప్‌ విండో ద్వారా యూజర్‌ను అలర్ట్‌ చేయడమే కాకుండా, పూర్తిగా సదరు వెబ్‌సైట్‌ నోటిఫికేషన్లు బ్లాక్ చేసే ఫీచర్‌ను పరిచయం చేయనుంది. 

ఇందుకోసం యూజర్‌కు క్రోమ్‌ బ్రౌజర్‌లో బెల్ ఐకాన్‌ కనిపిస్తుంది. ఒకవేళ బ్లాక్‌ చేసిన వెబ్‌సైట్‌ మీకు నోటిఫికేషన్‌ పంపాలని ప్రయత్నిస్తే ‘‘ఈ వెబ్‌సైట్‌ మిమ్మల్ని ఏమార్చేందుకు ప్రయత్నిస్తూ నోటిఫికేషన్లకు అనుమతి కోరుతుంది’’ అనే మెసేజ్‌ చూపిస్తుంది. దానితోపాటే అలో, కంటిన్యూ బ్లాకింగ్ అనే ఆప్షన్లను చూపిస్తుంది. ఒకవేళ యూజర్‌ నోటిఫికేషన్లు తిరిగి అనుమతించాలనుకుంటే అలో ఆప్షన్‌, బ్లాక్‌ చేయాలనుకుంటే కంటిన్యూ బ్లాకింగ్ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే సరిపోతుంది. 

ఈ ఫీచర్‌తో యూజర్‌ పొరపాటున అవసరంలేని లేదా హానికరమైన వెబ్‌సైట్‌ నోటిఫికేషన్లకు అనుమతించినా.. క్రోమ్‌ యూజర్‌ను హెచ్చరింస్తుందని గూగుల్ అభిప్రాయపడుతోంది. ప్రస్తుతం క్రోమ్‌ బ్రౌజర్‌లో ఉన్న ఫీచర్‌తో కేవలం నోటిఫికేషన్లు అనుమతి ఇవ్వాలా? వద్దా? అనే నిర్ణయం యూజర్‌ చేతిలో ఉంటుంది. కొత్త ఫీచర్‌తో యూజర్‌ నోటిఫికేషన్లకు అనుమతించినా.. అది హానికరమైనది అయితే గూగుల్ యూజర్‌ను అలర్ట్ చేస్తుంది. యూజర్లకు సురక్షితమైన బ్రౌజింగ్‌ను అందించడంతోపాటు క్రోమ్‌ను స్పామ్‌-ఫ్రీగా మార్చాలనే స్థిర నిర్ణయంతో ఈ ఫీచర్‌ను తీసుకొస్తున్నట్లు గూగుల్ అభిప్రాయపడింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు