క్రోమ్‌ బ్రౌజర్‌ వేగం పెంచేలా.. కొత్త టూల్‌

డెస్క్‌టాప్ కంప్యూటర్లలో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది వినియోగించే బ్రౌజర్‌ గూగుల్ క్రోమ్‌. గత కొంత కాలంగా ఈ బ్రౌజర్‌ను ఉపయోగిస్తున్నప్పుడు కంప్యూటర్‌ రీసోర్సులను (ర్యామ్, మెమొరీ) ఎక్కువగా వాడుతూ వాటి పనితీరుపై ప్రభావం చూపుతుందని పలువురు యూజర్స్ ఆరోపిస్తున్నారు....

Updated : 23 Feb 2021 18:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ ఉపయోగిస్తున్నప్పుడు డెస్క్‌టాప్ కంప్యూటర్ల వేగం తగ్గిపోతోందని గత కొద్ది రోజులుగా వార్తలొస్తున్నాయి. ర్యామ్, మెమొరీ (కంప్యూటర్‌ రిసోర్సులను) బ్రౌజర్‌ ఎక్కువగా వాడటం వల్లే ఇలా జరుగుతోందని సోషల్‌ మీడియా వేదికగా యూజర్లు ఆరోపిస్తున్నారు. దీని వల్లే కంప్యూటర్‌ నెమ్మదిగా రెస్పాండ్‌ అవుతోందని, బ్రౌజర్‌ ట్యాబ్స్‌ ఆలస్యంగా ఓపెన్‌ అవుతున్నాయని వినియోగదారులు అంటున్నారు. దీంతో ఈ సమస్యను పరిష్కరించేందుకు గూగుల్ చర్యలను ప్రారంభించింది. ఇందులో భాగంగా ‘పార్టిషన్ అలోక్’ (Partition Alloc) అనే కొత్త సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నట్లు క్రోమ్‌ సమాచారాన్ని తెలిపే క్రోమియం ప్రాజెక్ట్ సంస్థ వెల్లడించింది. 

ఏంటీ పార్టిషన్ ‌ఆలోక్..

పార్టిషన్‌ అలోక్ అనేది బ్రౌజర్‌కి మెమొరీని కేటాయించే టెక్నాలజీ‌. ఇది మీ బ్రౌజర్‌ ఏయే ఆబ్జెక్ట్‌లకు ఎంత మెమొరీ కేటాయించాలనేది నిర్ణయిస్తుంది. అంతేకాకుండా ఇది బ్రౌజర్‌కి మెరుగైన భద్రతను అందిస్తుంది. అంటే మనం బ్రౌజర్‌ ట్యాబ్‌లో యూఆర్‌ఎల్ ఓపెన్ చేసిన ప్రతిసారీ అది తీసుకునే మెమొరీని వేర్వేరు భాగాలుగా విభజిస్తుంది. దానితో పాటు మాల్‌వేర్ ప్రోగ్రామ్‌లు ఆపరేటింగ్ సిస్టమ్‌ (ఓఎస్‌)పై ప్రభావం చూపకుండా అడ్డుకుంటుంది. అంతేకాకుండా క్రోమ్ బ్రౌజర్ వేగంగా పనిచేయడంతో పాటు, అంతర్గతంగా ఉండే వెబ్ పేజీలు త్వరగా లోడ్ అవుతాయి. దీని వల్ల ర్యామ్‌ పనితీరు మరింత మెరుగుపడుతుంది. 

త్వరలోనే పార్టిషన్‌ అలోక్‌ టెక్నాలజీనీ విండోస్‌తో పాటు ఆండ్రాయిడ్, లైనెక్స్‌ ఓఎస్‌లకు పరిచయం చేస్తారని సమాచారం. ప్రస్తుతం విండోస్‌, ఆండ్రాయిడ్ ఓఎస్‌లో ఈ టూల్‌ను బీటా వెర్షన్‌గా పరీక్షిస్తున్నారట. లైనెక్స్‌ వెర్షన్‌లో కొన్ని సమస్యలు ఉన్నాయని..త్వరలోనే వాటిని పరిష్కరించి, మరోసారి పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. విండోస్‌, ఆండ్రాయిడ్లో ఈ టెక్నాలజీని పరీక్షించినప్పుడు మెరుగైన పనితీరు కనబరిచిందట. వీటితో పాటు మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్‌లోనూ ఈ టెక్నాలజీని పరీక్షిస్తున్నారని, త్వరలో దీనికి సంబంధించిన వివరాలు వెల్లడిస్తామని క్రోమియం ప్రాజెక్ట్ సంస్థ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని