Slice App: స్లైస్‌ యాప్‌తో ముప్పు ఉందన్న గూగుల్.. వివరణ ఇచ్చిన ఫిన్‌టెక్‌ సంస్థ!

స్మార్ట్‌ఫోన్‌ యాప్‌లలో కొన్ని యూజర్లకు పారదర్శకమైన సేవలందిస్తుంటే.. మరికొన్ని యాప్‌లు యూజర్‌ డేటాను సేకరిస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. తాజాగా క్రెడిట్‌ కార్డ్ జారీ యాప్‌ స్లైస్‌.. యూజర్ల వ్యక్తిగత వివరాలను ట్రాక్‌ చేస్తుందని గూగుల్ ఆరోపించింది. దీనిపై స్లైస్‌ సంస్థ వివరణ ఇచ్చింది. 

Updated : 23 Nov 2022 10:54 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: స్మార్ట్‌ఫోన్‌ వినియోగించే వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో అన్ని రకాల సంస్థలు తమ సేవలను యాప్‌ల ద్వారా యూజర్లకు అందిస్తున్నాయి. అయితే వీటిలో కొన్ని యాప్‌లు యూజర్లకు పారదర్శకమైన సేవలందిస్తుంటే.. మరికొన్ని యాప్‌లు యూజర్‌ డేటాను సేకరిస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి యాప్‌లను గూగుల్ ఎప్పటికప్పుడు గుర్తించి డివైజ్‌ల నుంచి వాటిని డిలీట్ చేసుకోమని యూజర్లకు సూచిస్తుంది. తాజాగా క్రెడిట్‌ కార్డ్ జారీ యాప్‌ స్లైస్‌.. యూజర్ల వ్యక్తిగత వివరాలను ట్రాక్‌ చేస్తుందని గూగుల్ ఆరోపించింది. స్లైస్‌ యాప్‌ ఉపయోగిస్తున్న యూజర్లు వెంటనే  సదరు యాప్‌ను డిలీట్ చేసుకోవాలని సూచించింది.

గూగుల్‌ సంస్థ మాల్‌వేర్‌ సాయంతో యూజర్ల డేటాను సేకరించే యాప్‌లను గుర్తించేందుకు తరచుగా గూగుల్ ప్లే ప్రొటెక్టెట్‌ ద్వారా యాప్‌లను స్కాన్‌ చేస్తుంది. అలా గూగుల్ తాజాగా జరిపిన స్కానింగ్‌లో స్లైస్‌ యాప్‌లో యూజర్‌ వ్యక్తిగత వివరాలను ట్రాక్‌ చేసే మాల్‌వేర్ ఉన్నట్లు గుర్తించామని గూగుల్ తెలిపింది. దీంతో గూగుల్ యూజర్లకు యాప్‌ను డిలీట్ చేసుకోవాలనే సూచన చేసింది. గూగుల్ సూచన తర్వాత యూజర్లు స్లైస్‌ నోటిఫికేషన్లపై క్లిక్ చేస్తే గూగుల్‌ ప్లే ప్రొటెక్ట్‌కు పేజ్‌కు రీడైరెక్ట్ చేసింది. అందులో ‘‘ఈ యాప్‌ మీ వ్యక్తిగత డేటాతోపాటు, మెసేజ్‌లు, ఫొటోలు, ఆడియో రికార్డింగ్స్‌, కాల్ హిస్టరీ ట్రాక్‌ చేయొచ్చు. అందుకే ప్లే ప్రొటెక్ట్‌ ఈ యాప్‌ను డిలీట్ చేసుకోమని సూచిస్తుంది’’ అనే మెసేజ్‌ను చూపిస్తుందని పలువురు యూజర్లు తెలిపారు.

గూగుల్ ఆరోపణలపై స్లైస్‌ సంస్థ స్పందించింది. ‘‘రెండు రోజుల క్రితం మా యాప్‌ వినియోగం రిస్క్‌తో కూడుకున్నది అని ప్లేస్టోర్‌ నుంచి మెసేజ్‌ వచ్చింది. అందులోని సమస్యను గుర్తించిన గంటల వ్యవధిలోనే దాన్ని పరిష్కరించాం. ఇప్పటికీ ఒక శాతం మంది స్లైస్‌ యూజర్లు పాత వెర్షన్‌ యాప్‌ను ఉపయోగిస్తున్నారు. వారంతా వెంటనే కొత్త వెర్షన్‌ను అప్‌డేట్‌ చేసుకోవాలని సూచిస్తున్నాం’’ అని స్లైస్‌ సంస్థ వెల్లడించింది. అలానే యూజర్ల వ్యక్తిగత డేటా భద్రతకు సంబంధించి కచ్చితమైన నిబంధనలు పాటిస్తున్నామని సంస్థ తెలిపింది. ఎట్టిపరిస్థితుల్లోనూ యూజర్ల డేటాకు ముప్పు వాటిల్లేలా స్లైస్‌ వ్యవహరించదని వివరణ ఇచ్చింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు